Group 2 | ఫలించిన నిరుద్యోగుల డిమాండ్.. గ్రూప్-2 డిసెంబర్‌కు వాయిదా..!
తెలంగాణ నిరుద్యోగుల డిమాండ్ ఫలించింది. గ్రూప్-2 వాయిదా వేయాలన్న డిమాండ్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగుల డిమాండ్ ఫలించింది. గ్రూప్-2 వాయిదా వేయాలన్న డిమాండ్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నిన్న బేగంపేటలోని హరిత ప్లాజాలో నిరుద్యోగ అభ్యర్థులతో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు విద్యార్థి ఉద్యమ నాయకులు చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
నిరుద్యోగుల డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. గ్రూప్-2 వాయిదా వేసే ప్రయత్నం చేస్తామని వారు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం గ్రూప్-2ను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ నిరుద్యోగుల డిమాండ్ కారణంగా ఎగ్జామ్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది.
మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాయిదాతో పాటు 2 వేల పోస్టులు అదనంగా పెంచాలని నిరుద్యోగుల డిమాండ్. మరి పోస్టులు పెంచుతారా..? లేదా..? అనే దానిపై స్పష్టత లేదు.