Highcourt | జ‌డ్జిల‌ను మేనేజ్ చేస్తాన‌ని రూ. 7 కోట్లు వ‌సూళ్లు.. లాయ‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ‌పై ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సిందేన‌న్న హైకోర్టు

Highcourt | హైకోర్టు న్యాయవాది వేదుల వెంకటరమణపై నమోదైన క్రిమినల్‌ కేసు కొట్టివేయాలని దాఖ‌లైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. వెంకటరమణపై నమోదైన కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నందున కేసును కొట్టివేయలేమ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

Highcourt | జ‌డ్జిల‌ను మేనేజ్ చేస్తాన‌ని రూ. 7 కోట్లు వ‌సూళ్లు.. లాయ‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ‌పై ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సిందేన‌న్న హైకోర్టు

Highcourt | హైదరాబాద్ : హైకోర్టు న్యాయవాది వేదుల వెంకటరమణపై నమోదైన క్రిమినల్‌ కేసు కొట్టివేయాలని దాఖ‌లైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. వెంకటరమణపై నమోదైన కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నందున కేసును కొట్టివేయలేమ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

పిటిష‌న‌ర్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. ఈ న్యాయస్థానంలోని న్యాయమూర్తులకు లంచం ఇస్తాన‌ని డబ్బు వసూలు చేశాడని వచ్చిన ఆరోపణ న్యాయవ్యవస్థ స్వతంత్రతపైన తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తుంది. న్యాయం అమ్మకానికి గురవుతున్నదన్న భావనకు దారితీస్తుంది. అటువంటి తీవ్రమైన ఆరోపణలపై తప్పనిసరిగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది అని జస్టిస్‌ లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. ఈ కేసులో తుది నివేదిక వచ్చేదాకా ఆయనను అరెస్టు చేయబోమ‌ని హైకోర్టు పేర్కొంది. వెంకటరమణ ఈ కేసు దర్యాప్తులో అధికారులకు సహకరించాలని, సహకరించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చునని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని కోర్టు పేర్కొంది.

కేసు నేప‌థ్యం ఇదే..

కుత్బుల్లాపూర్‌కు చెందిన డాక్టర్‌ చింతల యాదగిరి 1982లో తమ కమ్యూనిటీ అసోసియేషన్‌ తరపున మేడ్చల్‌ జిల్లాలోని బౌరంపేట్‌ గ్రామంలో పొలం కొనుగోలు చేశారు. ఆ పొలాలపై 2005లో వివాదాలు మొదలుకావడంతో, తమ ప్రత్యర్థులపై కేసు వేశారు. తమ కమ్యూనిటీ పెద్దల సూచనలతో సైదాబాద్‌కు చెందిన హైకోర్టు లాయర్‌ వేదుల వెంకరమణను నియమించుకున్నారు. మొదట రూ.30 లక్షలు ఫీజు రూపంలో న్యాయవాది వసూలు చేసి, కోర్టు కేసు సరిగ్గా హాజరు కాకుండా కాలయాపన చేస్తూ కేసు తప్పక మనమే గెలుస్తున్నామంటూ చెప్తూ వచ్చారు.

దీనిపై తన కమ్యూనిటీకి చెందిన 10 మంది సభ్యులు అసలు ఈ కేసు గెలుస్తామా? మరో అడ్వకేట్‌ను మాట్లాడుకోవాలా? అనే విషయంపై చర్చించుకున్నారు. ‘హైకోర్టులో మనకు అనుకూలంగా జడ్జిమెంట్‌ తెచ్చే బాధ్యత నాది. గతంలోనూ అలాగే చేశాం, మన కేసు వచ్చే బెంచ్‌ జడ్జీలను మేనేజ్‌ చేసి మనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుందాం’ అంటూ నమ్మించారు. ఇందుకు రూ.10 కోట్లు కావాలని డిమాండ్‌ చేశారు. దీనిపై బాధితుడి తరపున వారు చర్చించుకొని చివరకు రూ.7 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. రెండు దఫాల్లో ఒక‌సారి రూ. 4 కోట్లు, మ‌రోసారి రూ. 3 కోట్లు నగదు రూపంలోనే న్యాయవాదికి బాధితులు అందజేశారు.

ఈ కేసు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో బాధితులు న్యాయవాదిని నిలదీశారు. కేసు వాదించడంలో చురుకుగా వ్యవహరించకుండా, తమ ప్రత్యర్థులతోనే న్యాయవాది చేతులు కలిపి భారీగా డబ్బు వసూలు చేశార‌ని, అందుకే తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, తాము ఇచ్చిన రూ.7 కోట్లుకు రెట్టింపు రూ.14 కోట్లు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు న్యాయవాదిని నిలదీశారు. తాను తీసుకున్న రూ.7 కోట్లు తిరిగి ఇస్తానంటూ ఒప్పుకొని అందులో కోటి రూపాయాలు తిరిగి ఇచ్చాడు. మిగిలిన మొత్తం ఇవ్వ‌కుండా మ‌ల‌క్‌పేట ఎమ్మెల్యే బ‌లాలా, జ‌య‌కుమార్ అనే వ్య‌క్తితో క‌లిసి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేర‌కు సీసీఎస్ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా, ఎమ్మెల్యే బ‌లాలా, న్యాయ‌వాది వెంక‌ట‌ర‌మ‌ణ‌, జ‌య‌కుమార్‌పై ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.