ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి, విద్యార్థులకు హైకోర్టు షాక్..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కాలేజీలు విద్యార్థులను ఫీజు అడగవద్దని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్న నిబంధనపై స్టే విధిస్తూ, ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పెండింగ్ బకాయిలపై స్పష్టత లేకపోవడం, కొత్త విధానంపై గందరగోళం విద్యార్థులు, కాలేజీలలో ఆందోళనకు దారితీస్తోంది.

Telangana fee reimbursement crisis showing college fees burden and student stress

ఫీజు భారం భరించాలా? కొత్త విధానంతో విద్యార్థుల్లో ఆందోళన

Telangana High Court Stays DBT Clause in Fee Reimbursement GO, Warns Govt

విధాత కెరీర్​ డెస్క్​ | మే 1, 2026 | హైదరాబాద్​:

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం కీలక మలుపు తిరిగింది. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇంతకుముందు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని భావిస్తూ, వివాదాస్పద నిబంధనపై తాత్కాలికంగా స్టే విధించింది.

జీఓలోని నిబంధనపై కోర్టు అభ్యంతరం

జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణలో, ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms.No.7 (ఏప్రిల్ 29, 2026)లోని ఒక ముఖ్యమైన క్లాజ్‌పై అభ్యంతరం వ్యక్తమైంది. ఆ నిబంధన ప్రకారం, కాలేజీలు అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుంచి ఫీజులు డిమాండ్ చేయకూడదని, విద్యార్థులు DBT ద్వారా తమ ఖాతాల్లో జమ అయ్యే మొత్తంతో ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. అయితే, ఇదే అంశంపై ఇప్పటికే ఏప్రిల్ 2న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో కాలేజీలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో కొత్త జీఓలోని నిబంధన కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్లు వాదించారు.

 

ప్రభుత్వానికి హెచ్చరిక.. మే 4 వరకు గడువు

ఫీజు రీయింబర్స్‌మెంట్ జీఓపై హైకోర్టు జోక్యం.. కీలక క్లాజ్‌కు స్టే

వాదనలు విన్న అనంతరం కోర్టు ప్రాథమికంగా ఆ నిబంధన తమ ముందస్తు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జీఓలు జారీ చేస్తే అది ధిక్కరణ(Contempt)గా భావిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో G.Oలోని ప్యారాగ్రాఫ్ 5లోని క్లాజ్ XIIపై మే 4 వరకు తాత్కాలిక స్టే విధించింది. అదే సమయంలో, పెండింగ్ ఫీజు బకాయిల చెల్లింపుపై స్పష్టమైన టైమ్‌లైన్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 4కు వాయిదా వేసింది.

మొత్తానికి, ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులపై ఆందోళనలు నెలకొన్న వేళ, హైకోర్టు జోక్యం ఈ అంశాన్ని మరింత ప్రశ్నార్థకం చేసింది. కాలేజీలు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయవద్దన్న ప్రభుత్వ నిర్ణయంపై న్యాయస్థానం స్టే విధించడంతో కాలేజీలు ఫీజలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇది మళ్లీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల పాలిటి శాపంగా మారే అవకాశం ఉండటంతో, వచ్చే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందోనని విద్యార్థుల తలిదండ్రులు, విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు.

Latest News