MLC Kavitha | ఇది ఐదు గ్రామాల ప్రజల విజయం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

భద్రాచలంకు చెందిన 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం ఆ ఐదు గ్రామాల ప్రజలతో పాటు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

MLC Kavitha | ఇది ఐదు గ్రామాల ప్రజల విజయం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha | భద్రాచలంకు చెందిన 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం ఆ ఐదు గ్రామాల ప్రజలతో పాటు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ జూలై 17న తలపెట్టిన రైల్ రోకోకు మద్దతుగా సింగరేణి జాగృతి రూపొందించిన పోస్టర్ ను సోమవారం తన నివాసంలో కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ చీకటి ఆర్డినెన్స్ ఇచ్చిందన్నారు. ఈ ఆర్డినెన్స్ తో భద్రాచలం పట్టణానికి పక్కనే ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్టణం, గుండాల గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయని విమర్శించారు. ఫలితంగా భద్రాచల శ్రీ సీతారాముల దేవస్థానం భూములు ఏపీలోకి వెళ్లిపోయాయని..ఐదు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం సహా ఇతర అవసరాల కోసం నిత్య నరకం అనుభవిస్తున్నారన్నారు. ఐదు గ్రామాల గోడు పై తెలంగాణ జాగృతి ఈనెల 20న ‘పోలవరం – తెలంగాణ పై జలఖడ్గం’ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిందని గుర్తు చేశారు. ఐదు గ్రామాలను తెలంగాణ లో విలీనం చేయాలని డిమాండ్ చేసిందని..జాగృతి డిమాండ్ కు దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్రామాల విలీనం అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇప్పటికైనా స్పందించడం మంచి పరిణామమన్నారు. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని కవిత తెలిపారు.

అలాగే బీసీ రిజర్వేషన్ బిల్లులను ఆమోదించాలని కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని..ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైల్ రోకో చేసి తీరుతామని కవిత ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తున్నారన్నారు. రాజకీయ పార్టీల పరంగా అవకాశం కల్పించడం కాదు.. బీసీలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. బీసీ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని.. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీసీ సమాజం పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి బీసీ బిల్లులను ఆమోదించిందన్నారు. బిల్లుల ఆమోదం కోసం చేపట్టనున్న రైలు రోకోకు సింగరేణి జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కల్పన, రైల్ రోకో అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాలన్నారు.