ఎమ్మెల్యే కడియంపై రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

తనకు తెలియకుండా తన శాఖ అంశాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షలు నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

విధాత ప్రత్యేక ప్రతినిధి:

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా దేవాదాయశాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించడంపై సంబంధిత శాఖ మంత్రి కొండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలు, మంత్రిగా తన అధికార పరిధిని బేఖాతరు చేశారని సురేఖ ఆ లేఖలో పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన, విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ తదితర అంశాలు తన శాఖ పరిధిలోకి వస్తాయని సురేఖ స్పష్టం చేశారు. అయినప్పటికీ, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరక్టర్ తో పాటు శాఖ అధికారులను సమావేశపరచి పలు దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, అధికారులకు గడువులు నిర్దేశించడం వంటి అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించడం పరిపాలనా పరంగా అభ్యంతరకరమని, రూల్స్ ఆఫ్ బిజినెస్ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

శాఖా పరిపాలనకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు సంబంధిత శాఖా మంత్రి ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంటుందనే విషయం ప్రజా జీవితంలో అనుభవజ్ఞులైన ప్రతి ప్రజాప్రతినిధికి విదితమేనని, అలాంటి పరిస్థితుల్లో శాఖా మంత్రిని పూర్తిగా పక్కనపెట్టి అధికారిక సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి దారితీస్తుందని మంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వంలో పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా అధికార యంత్రాంగంలో అయోమయ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తన ఫిర్యాదులో కోరారు.

Latest News