Ministers Meeting | బీసీ రిజర్వేషన్లపై మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ!
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ నేపథ్యంలో పలువురు మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విధాత ప్రతినిధి):
Ministers Meeting | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాల పై కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ మంత్రులు, నాయకులు చర్చించారు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంగళవారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల కీలక సమావేశం జరిగింది. న్యాయపరమైన అంశాల్లో రిజర్వేషన్ల పై ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై సమాలోచన చేశారని సమాచారం. ఈ నెల 8వ తేదీన హైకోర్టులో రిజర్వేషన్ల కేసులో ప్రభుత్వం తన వాదనలు వినిపించి గెలిపించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామన్నారు.
తమిళనాడు రాష్ట్రం తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు. రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు మూడు నెలలకు మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవచ్చని తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ వద్ద బిల్లులు, చట్టాలు పెండింగ్ లో ఉన్నందున తెలంగాణ లో కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయన్న నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షడు బీ. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, తెలంగాణ మినరల్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, సీనియర్ నాయకులు వి. హనుమంత రావు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram