Minister Sitakka | యజ్ఞంలా మేడారం జాతర పనులు చేపట్టాలి : మంత్రి సీతక్క
మేడారం జాతర పనులను యజ్ఞంలా చేపట్టాలని, గిరిజన సంప్రదాయాలను ఉట్టి పడేలా ఏర్పాట్లు ఉండాలని, నాణ్యతా ప్రమా ణాలు పాటించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
విధాత, వరంగల్ ప్రతినిధి:
మేడారం జాతర పనులను యజ్ఞంలా చేపట్టాలని, గిరిజన సంప్రదాయాలను ఉట్టి పడేలా ఏర్పాట్లు ఉండాలని, నాణ్యతా ప్రమా ణాలు పాటించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటీడీఏపీఓ చిత్ర మిశ్రా లతో కలిసి దర్శించుకున్నారు. దేవాలయం అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఐటిడిఏ గెస్ట్ హౌస్ లో మంత్రి.. నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, పి. ఆర్., ట్రైబల్ వెల్ఫేర్, ఆర్టీసీ, ఆర్ డబ్ల్యూ ఎస్, ఇరిగేషన్, విద్యుత్, టూరిజం, ఫారెస్టు, వైద్య, దేవాదాయ శాఖ అధికారులతో మేడారం జాతర పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
ముందుగా మేడారంలోని గిరిజన మ్యూజియం, మిషన్ భగీరథ ఓహెచ్‌ఆర్‌ఎస్ వాటర్ ట్యాంకులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మల్లంపల్లి, కటాక్షపూర్ జాతీయ రహదారి మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మంగపేట బస్టాండ్ నిర్మాణ పనులు డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని అన్నారు. మహా జాతరకు ముందు వన దేవతలను దర్శించుకోడానికి భక్తులు తరలివస్తున్న క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని చెప్పారు. మహా జాతరను విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. శ్రీ సమ్మక్క- సారలమ్మల కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలని సూచించారు. అదనపు లేబర్, యంత్రాలు, నిపుణులను సమకూర్చుకొని నిర్ణీత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఏపిఓ వసంతరావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram