తెలంగాణలో మారిన సినిమా టికెట్‌ ధరలు

తెలంగాణలో సినిమా టికెట్ ధరలు మారాయి. నాన్‌ ఏసీ, ఏసీ, స్పెషల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు కొత్త ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. రూ.100 కోట్లకు పైబడిన సినిమాలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.

తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియంలో రూ.30- 70గా, ప్రీమియంలో రూ.50 -100గా నిర్ణయించింది. ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియంలో రూ.50 – 150.. ఏసీ థియేటర్లలో ప్రీమియంలో రూ.100 – ₹200.. స్పెషల్‌ థియేటర్లలో నాన్‌ ప్రీమియంలో రూ.100 – 250.. స్పెషల్‌ థియేటర్లలో ప్రీమియం రిక్లైనర్‌లో రూ.200 – 300గా నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్‌ రూ.100 – 250.. మల్టీప్లెక్స్‌ రిక్లైనర్‌లో రూ.200 – రూ.300గా ఖరారు చేశారు.

అత్యాధునిక 7.1 సౌండ్ సిస్టమ్, 2K/4K స్క్రీన్ కలిగిన సినిమా హాళ్లకు కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ హోదాను కల్పించారు. అయితే సామాన్య ప్రేక్షకులకు సైతం సినిమా అందుబాటులో ఉండేలా ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీ కింద సాధారణ ధరలకే ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు రోజుకు గరిష్టంగా ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించడం తో పాటు, చిన్న చిత్రాల మనుగడ కోసం ప్రతి థియేటర్‌లో రోజుకు ఒక షో తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించారు.

భారీ బడ్జెట్ చిత్రాలకు అనుకూలంగా రూ. 100 కోట్లకు పైబడిన నిర్మాణ వ్యయం కలిగిన సినిమాలకు ‘సూపర్ హై బడ్జెట్’ హోదాను ఖరారు చేశారు. ఈ హోదా పొందిన చిత్రాలకు విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ వెసులుబాటుతో పాటు సినీ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. టికెట్ ధరల పెంపు ద్వారా లభించే అదనపు ఆదాయం నుంచి కార్మికుల సంక్షేమ నిధికి రూ. 1 కోటి విరాళంగా జమ చేయాలనే తప్పనిసరి నిబంధనను విధించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల థియేటర్ యాజమాన్యాలు, భారీ చిత్రాల నిర్మాతలతో పాటు చిన్న చిత్రాల నిర్మాతలు, సినీ కార్మికులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Latest News