Komati Reddy : ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు

తెలంగాణలో ఇకపై సినిమా టికెట్ల ధరలు పెంచేది లేదని, బెనిఫిట్ షోలు కూడా ఉండవని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పేదల ప్రభుత్వం అని, టికెట్ ధరలు తక్కువగా ఉండాలన్నారు.

Komati Reddy : ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఇకపై ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు అని.. బెనిఫిట్ షోలు కూడా ఉండవు అని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు, దర్శకులు ఎవరూ మా వద్దకు రావొద్దు అన్నారు. గతంలోనే టికెట్ల ధరలు పెంచకూడదని అనుకున్నాం అని..ఇదే విషయాన్ని అసెంబ్లీలో నేను, సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గతంలో కోర్టు కొన్ని సినిమాలకు 10నుంచి 20శాతం మేరకు టికెట్ల ధరల పెంపుకు అవకాశం ఉందని పేర్కొందని.. ఇప్పుడు దానిని కూడా తప్పుబట్టిన నేపథ్యంలో ఇకమీదట ఏ సినిమాలకైనా టికెట్ల ధరల పెంపుకు అనుమతించబోమన్నారు. అఖండ 2 సినిమా టికెట్ల పెంపు నిర్ణయంలో పొరపాటు జరిగిందని వ్యాఖ్యానించారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవించి టికెట్ల ధర పెంచబోమన్నారు.

భారీ బడ్జెట్ సినిమాలకు కూడా టికెట్ల ధర పెంపుకు అనుమతినివ్వబోమని.. అసలు హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్లు ఇవ్వమని ఎవరు చెప్పారు..? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాది ఇందిరమ్మ రాజ్యం..ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని..కుటుంబాలు పిల్లలతో పాటు సినిమాలకు వెళ్లాలంటే టికెట్ ధరలు తక్కువగానే ఉండాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల ధరలు రూ.600నుంచి రూ.1000వరకు ఉండటం సరైంది కాదని..ఇక థియేటర్లో చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటి ధరలు కూడా పదింతలు అధికంగా ఉన్నాయని..వీటన్నింటిని నియంత్రించాల్సి ఉందన్నారు. పేదలు కుటుంబాలతో కలిసి సినిమా చూసే విధంగా టికెట్ ధరలు తక్కువగానే ఉండాలని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

మరి సీఎం హామీ సంగతేమిటో?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్బంగా సినిమా కార్మికులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి విరుద్దంగా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉండటం చర్చనీయాంశమైంది. పెంచిన సినిమా టికెట్ ధరలో 20శాతం మూవీ వెల్ఫర్ అసోసియేషన్ కు అందించేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 600 టికెట్ ధరపై 20శాతం కింద రూ.120 మూవీ వెల్ఫర్ అసోసియేషన్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఆఖండ 2 సినిమా టికెట్ల ధర పెంపుకు అనుమతిస్తు జారీ చేసిన ఉత్తర్వులలో సైతం పెంచిన టికెట్ ధరపై 20శాతం కార్మికుల సంక్షేమం కోసం మూవీ వెల్ఫర్ అసోసియేషన్ అందించాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అయితే సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇకమీదట టికెట్ల ధరలు పెంచబోమంటూ చెప్పిన నేపథ్యంలో..సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీ సంగతేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మంత్రి, సీఎంల పరస్పర విరుద్ద వైఖరులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంకోవైపు సినీ కార్మికులకు సీఎం ఇచ్చిన హామీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోనే ముగిసిపోయిందా? అంటూ ప్రతిపక్ష సోషల్ మీడియా సైటర్లు విసురుతుంది.

ఇవి కూడా చదవండి :

KCR Congratulates Ramachandra Reddy : సర్పంచ్ రామచంద్రారెడ్డికి కేసీఆర్ అభినందనలు
Nara Lokesh : విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్