Chinna Reddy | కొందరి ప్రోద్బలం వల్లే నిరుద్యోగ యువకుల ఆందోళనలు: చిన్నారెడ్డి

కొందరి ప్రోద్బలం వల్లనే నిరుద్యోగ యువకులు ఆందోళనలు చేస్తున్నారని తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు.

Chinna Reddy | కొందరి ప్రోద్బలం వల్లే నిరుద్యోగ యువకుల ఆందోళనలు: చిన్నారెడ్డి

విధాత: కొందరి ప్రోద్బలం వల్లనే నిరుద్యోగ యువకులు ఆందోళనలు చేస్తున్నారని తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రెచ్చ గొట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. కొందరు రాజకీయ నాయకులు ఆర్టిఫిషియల్ ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు.

విద్యార్థుల బలిదానం, త్యాగాలను గుర్తించి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చిందన్నారు. నాడు కేసీఆర్ లక్ష 7వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో కేసీఆర్ దిగిపోయే నాటికి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

కేసీఆర్‌కు నిరుద్యోగులపై ప్రేమ ఉంటే విద్యార్థుల ప్రాణత్యాలతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మూడు నెలల్లో ఉద్యోగాలు నింపవచ్చు కానీ ఉద్యోగాలు భర్తీ చేయలేదని చిన్నారెడ్డి ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే..

తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చిన్నారెడ్డి తెలిపారు. గ్రూపు-1 నోటిఫికేషన్ ఇచ్చాం. పరీక్షలు రాశారు.. రిజల్ట్స్ కూడా వచ్చాయి.. మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు. కొంత మంది ముఖ్యమంత్రి ఇంటికి పోయి ధర్నా చేయడం సరికాదని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

పక్క రాష్ట్రంలో 3 సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తే..

పది సంవత్సరాలలో 20,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్కటి కూడా గత ప్రభుత్వం భర్తీ చేయలేదని చిన్నారెడ్డి తెలిపారు. కానీ పక్కన ఏపీ రాష్ట్రంలో మూడు డీఎస్సీలు వేస్తే తెలంగాణలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదన్నారు. బీఆరెస్ సర్కారు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు.

ఉద్యోగులపై దృష్టి సారించిన రేవంత్

కాంగ్రెస్ సర్కార్ రాగానే రేవంత్ రెడ్డి ఉద్యోగులపై దృష్టి సారించారని చిన్నారెడ్డి తెలిపారు. నిరుద్యోగుల కోసం 11 వేల పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని, హాల్ టికెట్లు కూడా విడుదల చేశామన్నారు. గత సర్కార్ 10 ఏళ్లలో 5000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించలేకపోయిందన్నారు. ఈ డీఎస్సీతో పాటు మరో డీఎస్సీని 9,000 పోస్టులతో విడుదలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. క్వాలిటి టీచర్స్ ఎంపిక కోసం రెండు డీఎస్సీలను నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు.

పిల్లలు జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకొని రాష్ట్రాన్ని దివాలా తీయించిన హరీష్, కేటీఆర్, కేసీఆర్ మళ్ళీ పిల్లలు జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులు వాళ్ల చేతులలో పావులుగా మారొద్దని విజ్ఞప్తి చేశారు. వాళ్లు అధికారం కోసం మళ్లీ విద్యార్థులను నిరుద్యోగులను వాడుకొని వదిలేస్తారన్నారు. 30 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజిలలో పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.