పాలిటెక్నిక్ శక్తి స్కీమ్ పై భగ్గుమంటున్న విద్యార్ధి లోకం

తెలంగాణలో పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. శక్తి స్కీమ్‌, జీవో 97 రద్దు చేయాలని, బీటెక్‌ చదివే అవకాశం కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలకు అనుసంధానం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన శక్తి స్కీమ్ ను వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్ధులు వరుస ఆందోళనలను ఉదృతం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల మాకు బీటెక్ అనే ఆప్షన్ లేకుండా పోతుందని, బీటెక్ లేకపోతే మా చదువు కొనసాగించలేమని, ఈ శక్తి స్కీం వస్తే మేము లేబర్లుగా ఉండిపోవాల్సి వస్తుందని విద్యార్ధులు వాపోతున్నారు. రెండు, మూడు రోజుల నుండి మేము ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం నుండి రెస్పాన్స్ లేదు, ఒక్కరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని, ధర్నాలు చేస్తుంటే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని అంటున్నారే తప్ప మా భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించడం లేదు అని పాలిటెక్నిక్ విద్యార్ధులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలిటెక్నిక్ చేసి బీఏ చేశాడని, మరి మేం పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు. డీఆర్డీవో లాంటి పెద్ద సంస్థలకు ఈ పాలిటెక్నిక్ విద్యార్థులే జూనియర్ ఇంజనీర్లుగా వెళ్తారని, లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చేయలేని వాళ్లు ఈ పాలిటెక్నిక్ చేస్తారని, అలాంటి వాళ్లను లేబర్లుగా తయారు చేయాలని, రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలకు అనుసంధానం చేయాలని ఆదేశాలు ఇచ్చాడని ఆరోపించారు.

నీకు కనీసం తెలుగులో లెటర్ రాయడం వచ్చా రేవంత్ రెడ్డి?

మాకు అప్లికేషన్ రాయడం రాదు అని, ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కనీసం తెలుగులోనైనా రాయడం వచ్చా ? అని రామోజీ ఫిల్మ్ సిటీ అబ్దుల్లా పూర్ మెట్టు వద్ద జరిగిన ఆందోళనలో పాలిటెక్నిక్ విద్యార్థులు నిలదీశారు.జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ కల్వకుర్తి దగ్గర మా ఊరి పక్కనే సీఎం రేవంత్ ఊరు అని, ఆయనకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, నాలుగు, ఐదు తరగతి చదివే మా తమ్ముళ్లు మాట్లాడుతారని ఓ విద్యార్థి విరుచకపడ్డారు. మేం అందరం రేవంత్ రెడ్డి ముందు కూర్చొని లెటర్ రాస్తాం.. ఆయన రాయగలడా? మేము నిరసన తెలుపుతుంటే మగ పోలీసులు వచ్చి మా మీద చేతులు వేసి తోస్తున్నారు.. ఒక్క ఆడ పోలీసు లేదు, షీ టీమ్ లేదు అని విద్యార్థినిలు ఆరోపించారు. మా భవిష్యత్తు బాగుపడాలంటే ముందు మాకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఇవ్వండని డిమాండ్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి బూతులు తిట్టారని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా విద్యార్థులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్‌వీ నాయకులను అరెస్ట్ చేశారు. విద్యార్ధుల ఆందోళనకు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు.

Latest News