Telangana Rabi Paddy Bonus Pending :యాసంగి వరి బోనస్ దిక్కులేదు..వాన కాలం బోనస్ ఎట్లా!
తెలంగాణలో యాసంగి వరి ధాన్యం బోనస్‌గా రైతులకు చెల్లించాల్సిన రూ. 1,159.64 కోట్లు ఐదు నెలలు గడిచినా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వం వానకాలం ధాన్యం సేకరణకు బోనస్ ప్రకటించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విధాత, హైదరాబాద్ : యాసంగి వరి ధాన్యం విక్రయించిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బోనస్ రూ. రూ. 1,159.64 కోట్లు ఇంకా చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి ధాన్యం అమ్మి ఐదు నెలలు గడిచినా, బోనస్ చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురుచూపులు పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం వానకాలం సీజన్ వరి ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత రైతులకు బోనస్ చెల్లిస్తుండటం ఇప్పుడు రైతాంగంలో కొత్త సందేహాలను రేకెత్తిస్తుంది. ప్రభుత్వం యాసంగి బోనస్ బకాయిలను చెల్లించకుండా కొత్త బోనస్‌లను ఎందుకు చెల్లిస్తోందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యాసంగి పంట బోనస్‌ను ఎగవేస్తుందా? అన్న సందేహాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒక దఫా రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం ఎగవేసిందన్న సంగతిని వారు గుర్తు చేసుకుంటున్నారు.
ధాన్యం సేకరణ..బోనస్ కు డబ్బుల కొరత
పౌర సరఫరాల నివేదికల ప్రకారం ప్రభుత్వానికి యాసంగి బకాయిలకు రూ. 1,159 కోట్లతో పాటు ప్రస్తుత వానకాలం ధాన్యం బోనస్‌లకు రూ. 2,000 కోట్లు కలిపి మొత్తంగా రూ.3,159కోట్లు అవసరం అని అంచనా. అయితే ఆ శాఖ వద్ధ వానకాలం ధాన్యం సేకరణకు కూడా తగినంత నిధులు లేవని తెలుస్తోంది. వాన కాలం ధాన్యం సేకరణ, బోనస్ చెల్లింపులకు దాదాపుగా రూ. 19,000 కోట్లు అవసరముండగా..ప్రభుత్వం వద్ద ప్రస్తుతం రూ. 7,000 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో యాసంగి పెండింగ్ బోనస్ డబ్బులు, వాన కాలం బోనస్ చెల్లింపులతో పాటు వాన కాలం ధాన్యం సేకరణ డబ్బులు రైతులకు ఎలా చెల్లిస్తుందన్న ప్రశ్న రైతాంగాన్ని కలవరపెడుతుంది.
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2854.11 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో నుంచి కొంత మొత్తాన్ని ధాన్యం బోనస్ పెండింగ్ చెల్లింపులకు కేటాయించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram