తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)‘సర్’(SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ తుది గడువును ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పెంచింది. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లుగా తెలిపింది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది.చివరగా అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంచి. మారిన సర్ షెడ్యూల్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాలని తెలిపింది.
రాష్ట్రంలో నెమ్మదిగా సాగుతున్న సర్
రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో భాగమైన డిజిటలైజేషన్ నెమ్మదిగా సాగుతోంది. గత నెల 25న ప్రారంభమైన ఈ డ్రైవ్ ఈ నెల 24తో ముగుస్తుండగా.. ఇప్పటివరకూ సగం మంది ఓటర్ల వివరాలు కూడా డిటిటలైజేషన్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3 కోట్ల 38 లక్షల26 వేల 448 మంది ఓటర్లలో కేవలం కోటీ 66 లక్షల 70 వేల 610 మంది(కేవలం 49.28 శాతం ) వివరాలు మాత్రమే ఇప్పటివరకు డిజిటలైజ్ అయ్యాయి. వలసలు ఎక్కువగా ఉండడం, కొన్ని ఇండ్లకు తలుపులు, తాళాలు వేసి ఉండడం, గేటెడ్ కమ్యూనిటీల్లో బీఎల్ఓలకు అడ్రస్‌లు దొరకకపోవడం, యాప్‌లో సాంకేతిక సమస్యల వల్లే ‘సర్’ ప్రక్రియ వెనుకబడినట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉన్న అర్బన్ ఏరియాల్లో ‘సర్’ ప్రక్రియ వెనుకబడడం ఎన్నికల యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
గడువు పొడగింపుతో ఊరట..
రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెప్తున్నప్పటికి.. వాటిని ఆన్‌లైన్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓటర్లు రాసిన అడ్రస్‌లు సరిగ్గా లేకపోవడం, క్షేత్రస్థాయి పరిశీలనలో పేర్లు మ్యాచ్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో 2002 నాటి పాత ఓటర్ల వివరాలు లభ్యం కాకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. సర్వర్ డౌన్ కావడం, లాగిన్ సమస్యలు వంటి సాంకేతిక లోపాలు కూడా తోడవ్వడంతో ప్రక్రియ ఆలస్యంగా నడుస్తోందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఓటు కోల్పోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోతామన్న భయం ప్రజలను పీడిస్తుంది. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పెంచడం ఓటర్లకు, సిబ్బందికి భారీ ఊరటనిచ్చింది. అస
యాదాద్రి టాప్..
సర్ ప్రక్రియ అమలులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 79.86 శాతం డిజిటలైజేషన్‌తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.ఆ తర్వాతి స్థానాల్లో నల్గొండ జిల్లా (73.11 శాతం), సిద్దిపేట జిల్లా (72.11 శాతం)తో నిలిచాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ (70.79%), నిజామాబాద్ (70.22%) , రాజన్న సిరిసిల్ల (69.86%) జిల్లాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.అత్యధికంగా 47.36 లక్షల మంది ఓటర్లు ఉన్న రాజధాని హైదరాబాద్ జిల్లాలో కేవలం 10.52 లక్షల ఓటర్ల వివరాలు(22.22 శాతం ) మాత్రమే సర్ లో ఎంట్రీ అయ్యాయి. 36.98 లక్షల ఓటర్లు ఉన్న రంగారెడ్డి జిల్లాలో సైతం కేవలం 12.36 లక్షల(33.43 శాతం ) మంది వివరాలు మాత్రమే డిజిటలైజ్కావడం గమనార్హం.
ఎన్యూమరేషన్ పూర్తి చేస్తేనే ఓట్లు..
సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలను తక్షణమే పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాలని సీఈవో సుదర్శన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు . తద్వారా ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. బీఎల్‌ఓలు పంపిణీ చేసిన ఫారాల్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించి, దానిపై లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి సమర్పించాలని సూచించారు. ఈ ఎన్యూమరేషన్ ఫారంలో తప్పనిసరిగా ఓటరు సంతకం తేదీతోపాటు సంబంధిత బీఎల్ఓ సంతకం కూడా ఉండేలా చూసుకోవాలని సీఈవో స్పష్టం చేశారు.2002 నాటి ఓటరు జాబితాలో ఓటర్ వివరాలు ఉంటే ఆ పాత వివరాలను ఫారంలో తప్పనిసరిగా నమోదు చేయాలని, ఒకవేళ ఆ వివరాలు లేకపోయినా ప్రస్తుత వివరాలతోనే ఫారాన్ని పూర్తి చేసి బీఎల్ఓలకు ఇవ్వవచ్చని స్పష్టంచేశారు.
ఓటర్లకు అందజేసిన రెండు ఎన్యూమరేషన్ ఫారాలలో ఒకదానిని నింపి బీఎల్ఓకు ఇవ్వాలని, రెండో ఫారాన్ని ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలన్నారు. పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు సకాలంలో అందజేస్తేనే.. రాబోయే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటరు పేరు నమోదు అవుతుందని ఆయన తెలిపారు.
