తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం ఆందోళన రేపుతుంది. దేశవ్యాప్తంగా సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా గణాంకాలలో వెల్లడైంది. ఇక్కడ జరుగుతున్న 10 డెలివరీల్లో.. 6 గురికి ఆపరేషన్ జరుగుతున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫలితాల ద్వారా వెల్లడైంది. వాస్తవానికి అనేక ఆరోగ్య సూచీల్లో తెలంగాణ మెరుగ్గానే ఉన్నప్పటికి.. సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్లు మాత్రం కలవరపరుస్తున్నాయి.
జాతీయ సగటు కన్నా… 27.2శాతం రెట్టింపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 98.8 శాతం ప్రసూతీ కేసులు హాస్పిటళ్లలోనే జరుగుతున్నాయని, ఇది జాతీయ సగటు 90.6 శాతం కన్నా ఎక్కువే అని, కానీ 62. 2 శాతం డెలివరీలు మాత్రం సిజేరియన్ సెక్షన్ ద్వారా జరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ఇది జాతీయ సగటు 27.2 శాతం కన్నా రెట్టింపు అని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5 ఆరోగ్య సర్వే సమయంలో తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య 607 శాతంగా ఉంది. 2019 నుంచి 2021 మధ్య కాలంలో ఆ సర్వే జరిగింది. అయితే గత సర్వేకు.. తాజా సర్వేతో పోలిస్తే, కేవలం తెలంగాణలో మాత్రమే సిజేరియన్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. మరే రాష్ట్రంలో కానీ, కేంద్ర పాలిత ప్రాంతంలో కానీ ఈ సంఖ్య ఇంతలా పెరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సిజేరియన్ల సంఖ్య 52.2 శాతంగా ఉంది. ఇక నాగాలాండ్‌లో అత్యల్పంగా 13.2 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 83.9శాతం
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్ల వివరాలను కూడా సర్వేలో వెల్లడించారు. తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 83.9 శాతం డెలివరీలు సిజేరియన్ పద్ధతుల్లో జరుగుతున్నాయని తెలిపింది. ఇందులో జాతీయ సగటు కేవలం 54.1 శాతం మాత్రమే ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా 48.1 శాతం సిజేరియన్ రేట్ ఉన్నట్లు పేర్కొన్నది. ఇందులో జాతీయ సగటు 16.9 శాతం మాత్రమే. ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి 100 రోజుల వరకు తెలంగాణలోని 81 శాతం మంది గర్భిణులు ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్‌లెట్లు వాడినట్లు రిపోర్టులో తెలిపారు. ఇందులో జాతీయ సగటు కేవలం 54.9 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
