వరంగల్ జిల్లాలో పది కొత్తముఖాలు.. అగ్రవర్ణాలకే పెద్ద పీట

- అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థులు
- నలుగురు కాంగ్రెస్, నలుగురు బీజేపీ, ఇద్దరు బీఆర్ఎస్
- మూడు సెగ్మెంట్లలో ప్రకటించని అభ్యర్థులు
- అగ్రవర్ణాలకే పెద్ద పీట… బీసీలకు మొండిచెయ్యి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అవకాశం లభిస్తే నీతులు చెప్పే రాజకీయ పార్టీలు.. ఆచరణకు వచ్చేసరికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. యువత, కొత్తవారు, మహిళలు రాజకీయాల్లోకి రావాలంటూ ఉపదేశాలిస్తున్నప్పటికీ ఎన్నికలొచ్చేసరికి మొండి చేయి చూపెడుతున్నారు. ముఖ్యంగా శాసనసభలాంటి ఎన్నికలొచ్చేసరికి పాత వారికి తప్ప కొత్తవారికి అవకాశం కల్పించేందుకు వెనుకంజవేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

పేరుకే పార్టీల నేతల ప్రకటనలు తప్ప, ఆచరణకొచ్చేసరికి పాతవారికి, పలుకుబడి ఉన్న వారికి, అర్థ, అంగబలాలున్న వారికే అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు మినహా, మిగిలిన స్థానాల్లో అగ్రకులాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. జనరల్ స్థానాల్లో ఒకటి, అర మినహా బీసీలకు కూడా అవకాశం లభించడం లేదంటే.. జనరల్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ వారు పోటీ చేయడం ఒక కలగా చెప్పవచ్చు. మడి వరంగల్ జిల్లాలో తాజాగా ప్రధాన పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను చూస్తే స్పష్టమవుతోంది.

తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ..
ప్రస్తుత ఎన్నికల్లో మూడు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన అభ్యర్థుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పది మంది కొత్త ముఖాలకు మాత్రమే అవకాశం లభించింది. వారు తమ రాజకీయ రంగంలో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, మూడు ప్రధాన పార్టీలు ఇప్పటికే బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించారు.

బీఆర్ఎస్ 12 స్థానాలకు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా, బీజేపీ రెండు స్థానాలు పరకాల, నర్సంపేటకు, కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ కు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మూడు పార్టీల నుంచి సెగ్మెంట్ కు ముగ్గురు చొప్పున 36 మంది అభ్యర్థులు బరిలో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ముగ్గురిని ప్రకటించాల్సి ఉన్నందున ఇప్పటి వరకు 33 మంది బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ 4, బీజేపీ 4, బీఆర్ఎస్ 2
ఈ ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి ప్రకటించిన 33 మంది అభ్యర్థుల్లో పది మందికి మాత్రమే అవకాశం లభించింది. ఇందులో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పాత ముఖమైనప్పటికీ ఎమ్మెల్యేగా తొలిసారి పోటీచేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు కొత్త వారికి అవకాశం లభించింది. వరంగల్ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నుంచి కేఆర్ నాగరాజు, పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి, మహబూబాబాద్ నుంచి డాక్టర్ మురళీనాయక్ లకు అవకాశం లభించింది.

బీజేపీ నుంచి నలుగురికి అవకాశం లభించింది. జనగామ అభ్యర్థిగా ఆరూట్ల దశమంతరెడ్డి, వరంగల్ పశ్చిమ నుంచి రావు పద్మారెడ్డి, పాలకుర్తి నుంచి లేగా రామ్మోహన్ రెడ్డి, డోర్నకల్ నుంచి భూక్య సంగీతలకు అవకాశం దక్కింది. బీజేపీ నర్సంపేట, పరకాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు స్థానాల నుంచి కొత్త వారికి అవకాశం లభిస్తే ఆరుగురికి చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ములుగు నుంచి బడే నాగజ్యోతికి, జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అవకాశం దక్కింది.

16 అగ్రవర్ణాలకు..
ప్రకటించిన 33 మంది అభ్యర్థుల్లో 16 మంది అగ్రవర్ణాలకు చెందినవారుండగా, బీసీలు ముగ్గురు, ఎస్సీలు ఆరుగురు, ఎస్టీలు ఏడుగురు, మొత్తం ఎనిమిది మంది మహిళలకు అవకాశం లభించింది. ఇందులో ఎస్సీ ఒకరు, ఎస్టీలు ముగ్గురు, బీసీ ఒకరు, అగ్రవర్ణాలు ముగ్గురికి స్థానం దక్కింది. కాంగ్రెస్ 11 స్థానాలకు ప్రకటించగా ఆరుగురు అగ్రవర్ణాలకు, ఒక బీసీకి, రెండు ఎస్టీ, రెండు ఎస్సీలకు, బీజేపీ తొమ్మిది స్థానాలకు ప్రకటించగా ఐదు అగ్రవర్ణాలకు, రెండు ఎస్సీ, రెండు ఎస్టీలకు, బీఆర్ఎస్ 12 స్థానాలకు ఐదు అగ్రవర్ణాలకు, రెండు బీసీలకు, రెండు ఎస్సీలకు, మూడు ఎస్టీలకు కేటాయించారు.
