TG Liquor Sales | దసరాకు తెగ తాగేశారు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.1000కోట్లకుపైగా మద్యం విక్రయాలు..!
TG Liquor Sales | తెలంగాణలో దసరా పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులకు చేరాయి. పండుగ వేళల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. నవరాత్రి పర్వదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1000కోట్లకుపైగా విక్రయాలు జరిగాయి.

TG Liquor Sales | తెలంగాణలో దసరా పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులకు చేరాయి. పండుగ వేళల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. నవరాత్రి పర్వదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1000కోట్లకుపైగా విక్రయాలు జరిగాయి. వైన్స్‌లు, మద్యం దుకాణాలతో పాటు పబ్బుల్లోనూ విక్రయాలు పెరగడంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ నగరంలోనే పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు సాగాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అమ్మకాలు మరింత రెట్టింపయ్యాయని చెప్పారు. 11 రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా రూ.1000కోట్లపైగానే విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.
వాస్తవానికి పితృ అమావాస్య, పండుగ చివరి వరకు మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో మొత్తం 2,260 మద్యం దుకాణాలు ఉండగా.. 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అదే సమయంలో హైదరాబాద్‌లో పబ్‌లు సైతం ఉన్నాయి. యేటా దసరా పండగ మొదలైనప్పటి నుంచి మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతూ వస్తుంటాయి. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ సైతం రాష్ట్రవ్యాప్తంగా భారీగానే మద్యం నిల్వలను అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు రూ.2,838.92 కోట్ల విక్రయాలు జరిగాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 11 వరకు రూ.1,057కోట్ల విలువైన 10.44లక్షల మద్యం కేసులను విక్రయించినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. వీటితో పాటు రూ.17.59 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఇక మద్యం విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలువగా.. ఆ తర్వాత కరీంనగర్, నల్గొండ, వరంగల్ నిలిచాయి. దసరా పండుగ చివరి మూడురోజుల్లోనే విక్రయాలు మరీ ఎక్కువగా జరిగాయి. ఎక్సైజ్ డిపోల నుంచే రూ.205.42కోట్ల మద్యం వైన్స్‌లకు చేరింది.