TGPSC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ తీపి కబురు అందించింది. ఇక నుంచి ప్రతి నెల రెండు నుంచి మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ క్రమంలోనే జూన్ 2వ తేదీన 280 పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పోస్టుల వివరాలివే..
కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ పర్యావరణ ఇంజినీర్లు – 09
రోడ్లు భవనాల శాఖలో ఏఈఈ సివిల్ – 222
ఏఈఈ ఎలక్ట్రికల్ – 49
ఆర్థిక శాఖ 3800 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిందని, ఇందులో అటవీశాఖ బీట్ అధికారి పోస్టులు 1393 ఉన్నాయని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపట్టినట్టు వివరించారు. మరో వారం రోజుల వ్యవధిలో మరో మూడు నోటిఫికేషన్లు వస్తాయన్నారు. అంటే ఒక్క జూన్ నెలలోనే మొత్తం 6 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు.
సీబీఆర్‌టీ విధానంలోనే నియామక పరీక్షలు
టీజీపీఎస్సీ భారీ స్థాయిలో సంస్కరణలు తీసుకువస్తుందన్నారు. ఇక నుంచి సీబీఆర్‌టీ విధానంలోనే నియామక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణ కష్టతరమవుతుందన్నారు. సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహించడంతో.. ముద్రణ, తరలింపు, పేపర్ లీకేజీ వంటి సమస్యలు ఉండవన్నారు. పరీక్షల నిర్వహణ సమయం కూడా తగ్గుతుందని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
