రోహిత్ కుటుంబానికి సీఎం రేవంత్ హామీ ఇవ్వడం సంతోష‌క‌రం

రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం సంతోషకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు

రోహిత్ కుటుంబానికి సీఎం రేవంత్ హామీ ఇవ్వడం సంతోష‌క‌రం
  • బీజేపీ నేతల కోసమే తప్పుడు నివేదిక
  • రోహిత్‌ వేముల కేసుపై సమగ్ర విచారణ జరపాలి
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

విధాత: రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం సంతోషకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పోలీసుల నివేదిక ఆధారంగా కేసును మూసి వేస్తున్నట్లు హై కోర్టు ప్రకటించిన నేపథ్యంలో పునర్విచారణ చేపడుతున్నట్లు డీజీపీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది బీజేపీ నేతలు, హెచ్‌సీయు వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు వేధింపులు, మానసిక హింస, వివక్షకు గురై ఎనిమిదేళ్ళ క్రితంహెచ్‌సీయులో దళిత విద్యార్థి రోహిత్‌ వేమల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన అన్నారు. రోహిత్‌ కులంపై జిల్లా కలెక్టర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించకముందే రాష్ట్ర పోలీసులు హడావుడిగా అత్యుత్సాహంతో తప్పుడు నివేదికను హైకోర్టుకు సమర్పించడం వెనక నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు, హెచ్‌సీయు వైస్‌ ఛాన్సలర్‌పై ఉన్న కేసులను ఎత్తివేయించడానికే అని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తున్నదని తెలిపారు. ఈ కేసును రాజకీయ అంశంగా చూడకుండా సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు ఏ యూనివర్సిటీలోనూ పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నదని తెలిపారు.