బీజేపీ స్టార్ క్యాంపయినర్ల లిస్టు నుంచి విజయశాంతి ఔట్‌

బీజేపీ స్టార్ క్యాంపయినర్ల లిస్టు నుంచి విజయశాంతి ఔట్‌

విధాత: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపయినర్ల లిస్టులో సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి(రాములమ్మ) పేరుతో లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో ఒకప్పుడు విజయశాంతి స్టార్ క్యాంపయినర్‌గా ఉన్నారు. అలాంటి ఆమెను పార్టీ పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది.


ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఊహించని విధంగా హస్తం గూటికి చేరిపోయారు. అదే కోవలో విజయశాంతి కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చని కమలం పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మకు చోటు దక్కనట్లుగా సమాచారం.


బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో విజయశాంతికి చోటు దక్కకపోవడంతో పాటు, అసెంబ్లీ ఎన్నికల జాబితాలో ఎక్కడా టికెట్ కూడా ఇవ్వకపోవడంతో ఆమె జేపీలో ఉంటారా? కాంగ్రెస్‌లోకి వెలుతారా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది.


40 మందితో బీజేపీ లిస్టు..


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున 40 మంది ప్రచారం చేయనున్నారు. ఈ లిస్ట్‌లో ప్రధాని మోదీ, నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప సహా పలువురు జాతీయ నేతలు ఉన్నారు. రాష్ట్రం నుంచి స్టార్‌ క్యాంపెయినర్ లిస్ట్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, రాజాసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు.