చెన్నూరు సీటు కాంగ్రెస్ కే..!

- సీపీఐకి కేటాయిస్తే రాజీనామాలు చేస్తాం
- కళ్లకు గంతలు కట్టుకుని పార్టీ శ్రేణుల నిరసన
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: చెన్నూరు నియోజకవర్గ టిక్కెట్ కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని, పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తే పార్టీకి రాజీనామాలకూ వెనుకాడేది లేదంటూ కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గం టికెట్ సీపీఐకి కేటాయిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇక్కడి నుండి కాంగ్రెస్ ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమైంది. అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు సీటును కాంగ్రెస్ లో ఎవరికి ఇచ్చినా సునాయాసంగా గెలుస్తుందని కుండబద్ధలు కొడుతున్నారు.
గురువారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజవర్గంలో సీపీఐకి పెద్దగా క్యాడర్ లేదని, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి ఇచ్చినా సునాయాసంగా విజయకేతనం ఎగరేస్తుందని తెలిపారు. అలాంటి సీటును కాంగ్రెస్ అధిష్టానం సీపీఐకి ఇవ్వడం అంటే.. చేజేతులారా సీటును కాంగ్రెస్ పోగొట్టుకున్నట్టేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో 12 దరఖాస్తులు
చెన్నూరు నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు 12 మంది అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా చెన్నూరు టికెట్ సీపీఐకి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చెన్నూరు టికెట్ సీపీఐ కి కేటాయిస్తే, కాంగ్రెస్ కు రాజీనామా చేస్తామని హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. అందులో మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ సాగర్ రావు, బెల్లంపల్లి నియోజకవర్గానికి మాజీ మంత్రి వినోద్ లను ఖరారు చేశారు. చెన్నూరు నియోజకవర్గానికి ఇంతవరకు ఎవరినీ ప్రకటించలేదు. ఈ నియోజకవర్గ సీటును సీపీఐకి కేటాయిస్తున్నారన్న ప్రచార నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.