అప్పుడు ఒకే పార్టీ… ఇప్పుడు ప్రత్యర్థులు

అప్పుడు ఒకే పార్టీ… ఇప్పుడు ప్రత్యర్థులు
  • వరంగల్ తూర్పులో మూడు పార్టీల నేతల గతం
  • 2014లో ముగ్గురూ టీఆర్ఎస్ చెంతనే..
  • తాజా ఎన్నికల బరిలో కొండా సురేఖ-కాంగ్రెస్,
  • నరేందర్- బీఆరెస్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు-బీజేపీ


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ…శాశ్వత శత్రువులూ ఉండరనేది అంటారు. నిన్న మిత్రులుగా ఉన్న వారు ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉండొచ్చు… ప్రత్యర్థులు ఒక్కటిగావచ్చూ. ఎందుకంటే గతంలో మాదిరి నాయకులు కూడా ఒకే పార్టీని పట్టుకుని వేలాడడంలేదు. పొద్దున టిక్కెట్ రాలేదంటే సాయంత్రానికి కండువా మార్చేస్తున్నారు. సాయంత్రం టికెట్ ఇస్తానంటే పొద్దటికి గూడు మారుస్తున్నారు.


బట్టలిప్పినంత సులువుగా జెండాలు, రంగులు మార్చేస్తున్నారు. సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, రాజకీయ కమిట్మెంట్, కేడర్ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండడం ఒకప్పటి మాట. ఇప్పుడంతా అధికారం, పదవి ముఖ్యం అన్నట్లుగా పార్టీలు మార్చడం ఒకెత్తుగా ఉండగా, గెలిచిన తర్వాత అంతే వేగంగా ఫిరాయించేందుకు కూడా వెనుకంజ వేయడం లేదని రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే మనకు ఈజీగా అర్థమైపోతోంది.


అప్పడు ఒకే పార్టీ … ఇప్పుడు ప్రత్యర్ధులు


ఈ విషయాన్ని పక్కన పెడితే వరంగల్ తూర్పు రాజకీయాలు పైన చెప్పుకున్న మార్పులకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. 2023 ఈ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు బరిలో ఉన్నారు.


ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురు నాయకులు ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. 2014లో ఈ ముగ్గురు నాయకులు ఒకే పార్టీలో కొనసాగారు. ముగ్గురూ అప్పటి టీఆర్ఎస్ లో తూర్పు నియోజకవర్గ నాయకులుగా కొనసాగారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పరకాల ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మృతి అనంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన కొండా సురేఖ, కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు.


వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. అప్పటికే టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఉన్న నన్నపునేని నరేందర్ ఆ తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీచేశారు. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ సాధన సమితిలో సాగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే కొండా సురేఖ, కార్పొరేటర్ గా నరేందర్ ఎన్నికల్లో గెలిచేందుకు తన వంతు సహకారం అందించారు. నరేందర్ తర్వాత మేయర్ గా ఎన్నికయ్యారు.


కానీ, 2018 ఎన్నికలొచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. టీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖకు టికెట్ రాకపోవడంతో ఆ పార్గీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి పరకాల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మేయర్ గా ఉన్న నరేందర్ 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. తిరిగి రెండవసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.


కొద్ది నెలల క్రితం వరకు బీఆర్ఎస్ లో ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ఆ పార్టీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆవేదనతో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఒకే పార్టీలో ఉన్న ఈ నాయకులు ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులుగా మారి తమతమ అదృష్టాలను పరిశీలించుకుంటున్నారు.