సీఎం సహా మంత్రులను తక్షణమే అరెస్టు చేయాలి: ధర్మార్జున్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ డొల్లతనం బయటపడిందని, అవినీతి ముసులో డబ్బు దాహార్తి తీర్చుకున్న సీఎం కేసీఆర్ సహా మంత్రులను తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ డిమాండ్ చేశారు.

- కాళేశ్వరం డొల్లతనం బట్టబయలైంది..
- టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్
విధాత, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ డొల్లతనం బయటపడిందని, అవినీతి ముసులో డబ్బు దాహార్తి తీర్చుకున్న సీఎం కేసీఆర్ సహా మంత్రులను తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ డిమాండ్ చేశారు. శనివారం సమితి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్ తో కలసి ధర్మార్జున్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నీళ్ల దాహార్తిని తీర్చే పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమాలకు నెలవైందన్నారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందన్నారు. ప్రాజెక్ట్ డీపీఆర్ డిజైన్లు ప్రజల ముందు ఉంచాలని మొదటి నుంచి కోరినా ప్రభుత్వం రహస్యంగా వ్యవహరించిందన్నారు. కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని విమర్శించారు. ప్రాజెక్టు ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగాయని వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. ప్రాజెక్టును ఇష్టారీతిలో డిజైన్లు మార్చి, అంచనాలు పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్, క్యాబినెట్ మంత్రులంతా ప్రజల సొమ్మును కొల్లగొట్టారని ఆరోపించారు.
సుందిళ్ల, అన్నారం, సరస్వతి, మల్లన్న సాగర్ లు కూడా ఇదే నిర్మాణ రీతిని వ్యవహరించినందున అవి కూడా కుంగిపోయే ప్రమాదం ఉన్నదని ఎన్డీఎస్ఏ నిర్దారించిందన్నారు. దీంతో పెద్దఎత్తున ప్రమాదం రానున్నదని అర్థమవుతోందన్నారు. ఇప్పటికే డబ్బు దుబారాతో పాటు రేపు పెద్దఎత్తున ఆస్తులు, ప్రాణాలకు తీవ్ర ముప్పు రానున్నదని చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. కేంద్ర అధికారులు అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా రాష్ట్ర అధికారాలు గుట్టుగా ఉంచడం వెనక ముఖ్యమంత్రి హస్తం ఉన్నదని ఆరోపించారు.
బీజేపీకి కేసీఆర్ తో ఎలాంటి రహస్య ఒడంబడిక లేకున్నట్లయితే, నిజాయితీ ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకొని, కేసీఆర్ ను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ – వైఫల్యం -వాస్తవాలపై ఇంజనీర్లతో నవంబర్ 11న సూర్యాపేటలో సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు బంధన్ నాయక్, ఆత్మకూరు మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్, యువజన సమితి నాయకులు కృష్ణ యాకూబ్, రాజు పాల్గొన్నారు.