TGSRTC | ఇక వాట్సాప్‌లో ఆర్టీసీ బస్‌ టికెట్లు..! సంస్థతో చర్చలు జరుపుతున్నామన్న కంపెనీ సీఈవో..!

ఇక వాట్సాప్‌లో ఆర్టీసీ బస్‌ టికెట్లు..! సంస్థతో చర్చలు జరుపుతున్నామన్న కంపెనీ సీఈవో..!

TGSRTC | ఇక వాట్సాప్‌లో ఆర్టీసీ బస్‌ టికెట్లు..! సంస్థతో చర్చలు జరుపుతున్నామన్న కంపెనీ సీఈవో..!

TGSRTC | వాట్సాప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సర్వీసులను ప్రారంభిస్తూ దూసుకుపోతున్నది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే తెలంగాణ ఆర్టీసీ బస్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా విక్రయించేందుకు సిద్ధమవుతున్నది. ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు వాట్సాప్‌ బిజినెస్‌ భారత్‌ హెడ్‌ రవి గార్గ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం వాట్సాప్‌ హైదరాబాద్‌ మెట్రో టికెట్లను వాట్సాప్‌లోనే బుక్‌ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే యూపీఐ ద్వారా బస్‌లలో టికెట్ల విక్రయించేందుకు సిద్ధమవుతున్నది. టీజీఎస్‌ ఆర్టీసీ ఈ సేవలను సెప్టెంబర్‌ నాటికి అన్ని జిల్లాలకు విస్తరించాలని భావిస్తున్నారు. కండక్టర్లకు 10వేలకుపైగా టిమ్స్‌ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో ప్రయాణికులకు టికెట్ల చెల్లింపు సులభతరం కానున్నది. రోడ్డు్ రవాణా సంస్థ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ 9వేల బస్సులను నడుపుతుండగా.. నిత్యం 5.5 మిలియన్ల ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు తరలిస్తున్నారు.

ప్రస్తుతం సిటీ, గ్రామీణ బస్సుల్లో కండక్టర్లు సాధారణ టిమ్‌లను వినియోగిస్తూ వస్తున్నారు. వీటి ద్వారా కేవలం నగదు ద్వారా మాత్రమే టికెట్లను జారీ చేసే అవకాశం ఉన్నది. కొత్తగా తీసుకురాబోయే టిమ్‌ల ద్వారా క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయడం ద్వారా డెబిట్‌కార్డులు, యూపీఐ ద్వారా చెల్లింపులను చేసేందుకు అవకాశం లభించనున్నది. ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు ‘మహాలక్ష్మీ’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కండక్టర్లు ఆధార్ కార్డులను చూసిన తర్వాతే ప్రయాణికులకు ‘జీరో’ టికెట్లను జారీ చేస్తూ వస్తున్నారు. ‘సున్నా’ టిక్కెట్ల కోసం స్వైప్ చేసుకునేందుకు వీలుగా త్వరలో మహిళలకు స్మార్ట్‌ కార్డులను సైతం జారీ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. డిపోకు బస్సులు వచ్చే వరకు ఒక్కో సర్వీసు నుంచి ఎంత మేరకు ఆదాయం వచ్చిందో తెలుసుకునేందుకు అవకాశం లేదు. ప్రస్తుతం కొత్తగా తీసుకురాబోయే టిమ్‌లతో బస్సు కదలికలు, సిబ్బంది పనితీరు, ఆదాయం తదితర సమాచారమంతా క్షణాల్లోనే అధికారులకు తెలిసిపోతుంది. దాంతో పాటు రద్దీ తక్కువగా, ఎక్కువగా ఉండే రూట్లకు సంబంధించిన సమాచారం కూడా దొరుకుతుంది. దీని సహాయంతో అధికారులు తక్షణం సిబ్బందితో మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌, బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్‌లో పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా సిటీ బస్సుల్లో ఐటిమ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. బండ్లగూడ డిపోలో 74 బస్సులకు 150 ఐటిమ్స్‌ను కండక్టర్లకు అందించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లే టిమ్‌లను అధికారులు అందించారు. ఒక్కో టిమ్‌ను రూ.9,200 వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు వివరించాయి.