ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కార్తీకమాసంలో శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..!
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. కార్తీకమాసంలో ఏపీ, తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడుపనున్నట్లు వెల్లడించింది

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. కార్తీకమాసంలో ఏపీ, తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడుపనున్నట్లు వెల్లడించింది. ఆయా సర్వీసులను సేవలను వినియోగించుకోవాలని కోరింది. ఈ నెల 14 నుంచి మొదలై.. డిసెంబర్ 13 వరు కొనసాగనున్నది. అయితే, కార్తీకమాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రముఖ క్షేత్రాలను దర్శిస్తుంటారు. ఇందులో విశేషంగా శైవక్షేత్రాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆయా క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు ప్రత్యేకంగా సర్వీసులు నడుపనున్నట్లు పేర్కొంది.
తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు ప్రత్యేకంగా బస్సులను నడుపనున్నట్లు తెలిపింది. ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమికి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయా క్షేత్రాలకు బస్సులు బయలుదేరుతాయని.. తిరిగి మరుసటి రోజు హైదరాబాద్‌కు చేరుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఏపీలోని ద్రాక్షారామం, అమరావతి, భీమవరం, పాలకొల్లు, పంచారామ క్షేత్రాలకు హైదరాబాద్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఆయా బస్సులు హైదరాబాద్ నుంచి సోమవారం బయలుదేరి.. దర్శనం అనంతరం మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు వస్తాయని వెల్లడించారు. ఇక ఏపీలోని క్షేత్రాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల ఛార్జీల విషయానికి వస్తే.. రాజధాని బస్‌కు టికెట్ ధర రూ.4వేలుగా నిర్ణయించారు. సూపర్ లగ్జరీకి రూ.3200గా ఉండనున్నది. తెలంగాణలో నడిచే ప్రత్యేక బస్సుల ఛార్జీలు రాజధాని బస్‌కు రూ.2400, సూపర్ లగ్జరీ బస్‌కు రూ.1900, ఎక్స్ ప్రెస్ బస్‌కు రూ.1500 టికెట్ ధరను నిర్ణయించినట్లు అధికారులు వివరించారు.