Mangoes | హైదరాబాద్ : ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నారాయణగూడ పీఎస్ పరిధిలో భువనేశ్వరి(17), సంధ్య(10) తమ తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం రోజు తమ ఇంటికి సమీపంలో పడి ఉన్న మామిడి పండ్లను అక్కాచెల్లెళ్లు ఇద్దరు తీసుకున్నారు. ఇక ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ పండ్లను తినేశారు.
ఇక అదే రోజు సాయంత్రం అక్కాచెల్లెళ్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో తల్లిదండ్రులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భువనేశ్వరి సోమవారం చనిపోగా, సంధ్య మంగళవారం ప్రాణాలు విడిచింది.
ఈ ఘటనపై పేరెంట్స్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే చనిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే చనిపోయినట్లు డాక్టర్లు కూడా వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
