గురుకుల పాఠశాలలు రద్దు చేస్తే ఉద్యమిస్తాం … మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణలో పేద విద్యార్థులకు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్న గురుకుల పాఠ‌శాల‌ల‌ను ర‌ద్దు చేస్తే ఉద్య‌మిస్తామని మాజీ మంత్రి, బీఆరెస్‌ సీనియ‌ర్ నేత కొప్పుల ఈశ్వ‌ర్ హెచ్చ‌రించారు. నిరుపేద వ‌ర్గాల‌కు చెందిన ఎంతో మంది విద్యార్థులు గురుకులాల్లో చ‌దువుకుని, ఉన్న‌త‌స్థాయికి ఎదుగుతున్నార‌ని పేర్కొన్నారు

గురుకుల పాఠశాలలు రద్దు చేస్తే ఉద్యమిస్తాం … మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణలో పేద విద్యార్థులకు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్న గురుకుల పాఠ‌శాల‌ల‌ను ర‌ద్దు చేస్తే ఉద్య‌మిస్తామని మాజీ మంత్రి, బీఆరెస్‌ సీనియ‌ర్ నేత కొప్పుల ఈశ్వ‌ర్ హెచ్చ‌రించారు. నిరుపేద వ‌ర్గాల‌కు చెందిన ఎంతో మంది విద్యార్థులు గురుకులాల్లో చ‌దువుకుని, ఉన్న‌త‌స్థాయికి ఎదుగుతున్నార‌ని పేర్కొన్నారు. అలాంటి గొప్ప గురుకులాల‌ను నిర్వీర్యం చేయొద్ద‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఈశ్వ‌ర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కొప్పుల ఈశ్వ‌ర్ మీడియాతో మాట్లాడారు. గ‌తంలో తాను ఐదేండ్ల పాటు ఎస్సీ వెల్ఫేర్ మంత్రిగా ప‌ని చేశానని, చాలా ఏండ్ల పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల పిల్ల‌లు విద్యకు దూరంగా ఉన్న పరిస్థితి చూశామన్నారు. చ‌దువుకోవాల‌నే ఆస‌క్తి ఉన్నా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌లేని ప‌రిస్థితి ఉండేదని, అత్యంత నిరుపేద‌లకు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నే ఉద్దేశంతో కోట్ల రూపాయల ఖర్చుతో గురుకుల పాఠ‌శాల‌లను ఏర్పాటు చేశామని, ఫ‌లితాలు కూడా అద్భుతంగా వ‌చ్చాయ‌ని కొప్పుల ఈశ్వ‌ర్ తెలిపారు. అయితే మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి గురుకులాలను రద్ధు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

గురుకులాల్లో చ‌దువుకునే ఒక్కో విద్యార్థిపైన ల‌క్షా 20 వేలు ఖ‌ర్చు చేసి ఉన్న‌త విద్య‌ను అందించామని, 2014 నాటికి గురుకులాల్లో 3575 మంది టీచ‌ర్లు ఉండేవని, 917 గుకులాలు ఏర్పాటు అయ్యాక 17 వేల‌కు పైగా టీచ‌ర్ల‌ను రిక్రూట్‌మెంట్ చేశామని, గ్రామీణ ప్రాంత విద్యార్థుల‌కు మంచి విద్య‌ను అందించే ప్ర‌య‌త్నం జ‌రిగిందని ఈశ్వ‌ర్ తెలిపారు. 1976లో ఆనాడు ఉన్న‌టువంటి నాయ‌కులు పీవీ న‌ర్సింహారావు ఆలోచ‌నా మేర‌కు గురుకులాలు ఏర్పాటు చేశారని, 2014 నాటికి తెలంగాణ‌లో 298 గురుకుల పాఠ‌శాల‌లు అర‌కొర సౌక‌ర్యాల‌తో ఉండేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత నాటి సీఎం కేసీఆర్ గురుకులాల వ‌ల్ల నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నే ఉద్దేశంతో గురుకులాల సంఖ్య‌ను పెంచి ఎస్సీల‌కు 134 ఉంటే 238కి పెంచారని, బీసీల‌కు 19 ఉండగా.. 261కి పెంచారని, మైనార్టీల‌కు 12 ఉంటే 204కు పెంచారని, ఎస్టీ వ‌ర్గాల కోసం 96 ఉండే.. 261కు పెంచి ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. మొత్తంగా అన్ని వ‌ర్గాల‌కు 2014నాటికి ఉన్న 298గురుకులాలకు 619 కొత్తగా జతచేసి 917 గురుకుల విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేశామ‌ని ఈశ్వ‌ర్ గుర్తు చేశారు.