C.M. REVANTH REDDY | ప్రభుత్వాన్ని పడగొడుతామన్నోళ్లే కనిపించకుండా పోయారు … కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజలు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్నిపడుగొడుతామని అచ్చోసిన అంబోతుల్లా..మైసమ్మ దున్నపోతుల్లా మాట్లాడినోళ్లు ఇప్పుడు కనిపించకుండా పోయారని, మూడు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడుతామని బీఆరెస్‌, బీజేపీలు చెరోవైపు మాట్లాడుతుంటే మేం నిలబెడుతామని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

C.M. REVANTH REDDY | ప్రభుత్వాన్ని పడగొడుతామన్నోళ్లే కనిపించకుండా పోయారు … కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకే ఎమ్మెల్యేల చేరికలు
నిరుద్యోగులు రోడ్డెక్కకుండా ప్రభుత్వానికి సమస్యలు చెప్పండి
హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపొందించేందుకు ప్రణాళికలు
మహేశ్వరంలో అద్భుత నగర నిర్మాణం..స్పోర్ట్స్ యూనివర్సిటీ..హెల్త్ హబ్‌లు
నగరాభివృద్ధిలో మైలురాళ్లు… మెట్రో విస్తరణ..ఆర్‌ఆర్‌ఆర్‌
ప్రపంచ పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లా
మరింత పెరుగనున్న భూముల ధరలు

విధాత, హైదరాబాద్ : ప్రజలు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్నిపడుగొడుతామని అచ్చోసిన అంబోతుల్లా..మైసమ్మ దున్నపోతుల్లా మాట్లాడినోళ్లు ఇప్పుడు కనిపించకుండా పోయారని, మూడు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడుతామని బీఆరెస్‌, బీజేపీలు చెరోవైపు మాట్లాడుతుంటే మేం నిలబెడుతామని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీని రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్ మెట్ లష్కర్‌గూడ తాటివనంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మా ప్రభుత్వం పనైపోయిందని, కూలిపోతుందని అన్నోళ్లూ ఇప్పుడు కనిపించుకుండా పోయారని, రోజూ వారి పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోయినారోనని లెక్క పెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆరు నెలల కాలంలో సగం ఎన్నికల కోడ్‌తోనే గడిచిపోయిందని ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెడుతున్నామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలు మేం చేస్తుంటే మా కాళ్లలో కట్టబెడుతూ పదేళ్లలో ఏమి చేయనోళ్లు..ఓడినోళ్లు..ఫామ్‌హౌస్‌లో ఉన్నోళ్లు మేమేం చేస్తాలేమని, మా ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని మండిడ్డారు. మా పార్టీ ప్రభుత్వాలు హైదరాబాద్‌కు భారీ పరిశ్రమలు, ఔటర్‌, ఇంటర్నేషనల్‌ ఏయిర్ పోర్టు, ఫార్మా, ఐటీ కంపనీలను తీసుకొచ్చిందన్న సంగతి మరువరాదన్నారు. డ్రగ్స్‌, గంజాయి తప్ప గత ప్రభుత్వ పాలకులు ఇంకేమి చేయలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చేస్తున్నామన్న ఆలోచనతోనే ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, ఎగ్గే మల్లేశం వంటి వారు కాంగ్రెస్‌లోకి వచ్చారన్నారు. ప్రకాష్ గౌడ్, ఎగ్గే మల్లేశంలకు మేము ఏం ఇవ్వగలమని, మా ఆలోచన విధానం, చేస్తున్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరుతున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్‌బీఐకే అప్పు ఇచ్చే స్థాయి ఉన్న ఎగ్గే మల్లేశం వంటి వారికి మేం ఏం ఇస్తామని, నా అంగీ లాగు అమ్మినా ఏం రాదన్నారు. మాది మూడు నెలల్లో పడిపోయే ప్రభుత్వం కాదని, మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే రీతిలో పదేళ్లు కొనసాగే ప్రభుత్వమని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జడ్పీటీసీ నుంచి సీఎం వరకు నేనేమి మారలేదని, వచ్చినోళ్లందరికి కలుస్తునే ఉన్నానన్నారు. పదేళ్లు చేయనోడు ఉన్నదంతా అమ్ముకుని ఊడ్చుకుపోయినోడు రాష్ట్రాన్ని 7లక్షల కోట్ల అప్పుల పాలు చేసినోడు..మాట్లాడుతున్నాడని, వాళ్లు చేసిన అప్పులకు ప్రతి నెల 7వేల కోట్ల రూపాయల వడ్డీలు కడుతున్నామని, ఏడాదికి 72వేల కోట్ల వడ్డీ కట్టాల్సివస్తుందని పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సంసారం అప్పుల పాలైందని మీకు వివరిస్తే వెనుకాముందు ఆలోచన చేస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా పనిచేయాలన్నారు.

రోడ్డెక్కడం కాదు..ప్రభుత్వానికి విన్నవించండి

నిరుద్యోగులు కొందరు పరీక్షలు వాయిదా వేయాలంటున్నారని, పరీక్షలకు సంబంధించిన నిరుద్యోగ సమస్యల పరిష్కార బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పిల్లలు రోడ్డెక్కడం కన్నా మీ సమస్యలు ఏమైనా ఉంటే మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందన్నారు. మంత్రులను కలవాలని మీ సమస్యలు ఏమున్నా వారు, ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి మరింత ముందుకు..మహేశ్వరంలో అద్భుత నగరం

రంగారెడ్డి జిల్లాలో ఔటర్‌, ఫార్మా, ఐటీ కంపనీలతో భూముల విలువ పెరిగిందని, 100కోట్లకు ఎకరం విలువకు చేరిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మా ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల హైదరాబాద్ చుట్టు త్రిబుల్ ఆర్ నిర్మించబోతుందని, రేడియల్ రోడ్లు కూడా వేస్తామని దాంతో ఈ ప్రాంతంలో భూముల విలువలు మరింత పెరుగుతాయన్నారు. నూతనంగా మెట్రో రైలు విస్తరణకు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్‌, ఎల్భీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, ఎల్బీ నగర్ ఒవైసీ హస్పిటల్‌, చాంద్రాయణ గుట్ట, అంతర్జాతీయ ఏయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మించబోతున్నామన్నారు. ఫార్మా కంపనీల కోసం మహేశ్వరం ప్రాంతంలో 25వేల ఎకరాల భూసేకరణ జరిగిందని, కాలుష్య కారణాలతో ఫార్మా స్థానంలో అక్కడ యూనివర్సిటీలు, ఐటీ, ఎలక్ట్రికల్ కార్ల, బ్యాటరీల పరిశ్రమలు, స్పోర్ట్సుయూనివర్సిటీ,, మెడికల్ హెల్త్ హబ్‌, మెడికల్ టూరిజంను స్థాపించేందుకు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రణాళికలు వేస్తున్నారన్నారు. సైబరాబాద్ తరహాలో మహేశ్వరంలో న్యూయార్కు మాదిరిగా కొత్త అద్భుత నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. రామోజీ ఫిల్మీసిటీకి ప్రత్యామ్నాయంగా రాచకొండ ప్రాంతంలో ఫిల్మీసిటీ నిర్మిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రపంచ పర్యాటక క్షేత్రంగా, ఉద్యోగ, ఉపాధి కేంధ్రంగా మారబోతుందన్నారు.

కుల, చేతి వృత్తుల కుటుంబాలకు కాంగ్రెస్ చేయూత

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే కులవృత్తులు, చేతి వృత్తులకు గౌరవం దక్కుతుందన్న భావనతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. గౌడ సామాజిక వర్గం నుంచి ఎందరో నాయకులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమమయ్యారన్నారు. రంగారెడ్డిజిల్లాలో అంతర్జాతీయ ఏయిర్ పోర్టు, ఔటర్‌రింగ్ రోడ్డు, ఐటీ, ఇతర పరిశ్రమలు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులతో అభివృద్ధికి పునాదులు పడ్డాయని, దేవేందర్‌గౌడ్ వంటివారు చేసిన కృషి విస్మరించలేనిదన్నారు. గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్‌ను మంత్రిగా, మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎమ్మెల్సీగా చేశామని, శ్రీకాంత్‌గౌడ్‌ను కార్పోరేషన్ చైర్మన్‌ చేశామన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్‌ను, మధుయాష్కిని క్యాంపెయినర్ చైర్మన్‌గా చేశామన్నారు. గీత కార్మికుల కోసం ఎవరెస్టు అధిరోహించిన మాలోతు పూర్ణ బృందం రూపొందించిన కాటమయ్య రక్షణ కవచం పేరుతో 10వేల కిట్ల పంపిణీ ప్రారంభించుకున్నామన్నారు. కులవృత్తులు, చేతి వృత్తులు అడుగంటిపోతున్న క్రమంలో వారి కుటుంబాల పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించేందుకు ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం దివంగత సీఎం వైఎస్సార్ ప్రభుత్వ హయంలో తెచ్చారని, పేదలకు కార్పోరేట్ వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ తీసుకురాగా మా ప్రభుత్వం 10లక్షలకు పెంచిందన్నారు. గత ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో చాల మంది పిల్లలు ఇబ్బంది పడ్డారని ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామన్నారు. తాటి, ఈత వనాల ఏర్పాటుకు గ్రామాల్లో అందుబాటులో ఉన్నచోట భూ కేటాయింపు చేస్తామన్నారు. 75వ వనమహోత్సవంలో భాగంగా నూతన రహదారుల వెంట తాటి, ఈత చెట్లలో నాటాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. గ్రామాల్లో చెరువు గట్ల మీద తాటి, ఈత చెట్లను పెంచాలని సూచించారు. ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల మరమ్మతులు చేశారో ఆ చెరువుల వెంట, సాగునీటి ప్రాజెక్టులు, కాలువల వెంట తాటి, ఈత చెట్లను పెంచేలా చర్యలు తీసుకుని గీత వృత్తి పరిరక్షణకు సహకరిస్తామని చెప్పారు. అందరికి ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో కుల వృత్తులు జీవనాధారంగా మారుతాయన్నారు. గీత, చేనేత, రజక, వడ్డెర తదితర వర్గాలన్ని తమ పిల్లలను బాగా చదివించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.