Indiramma Housing Scheme | త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు..! తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి..!!
Indiramma Housing Scheme | రాష్ట్రంలోని నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల( Indiramma Housing Scheme ) కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కూడా ఈ పథకం అమలుకు, లబ్దిదారుల ఎంపికకు విధివిధానాలు రూపొందిస్తూ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన యాప్ కూడా ఫైనల్ అయింది. రెండు, మూడు మార్పులు చేర్పులతో త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ పథకం అమలుకు తెల్ల రేషన్ కార్డు( White Ration Card )ను తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం.

Indiramma Housing Scheme | తెలంగాణ( Telangana )లో ఆరు గ్యారెంటీల నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ( Congress Party ).. ఒక్కో గ్యారెంటీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన గ్యారెంటీ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం( Indiramma Housing Scheme ). ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో నిరుపేదలకు ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక విధానంపై కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) తీవ్ర కసరత్తు చేస్తోంది. తాజాగా లబ్దిదారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) పరిశీలించారు. కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇక యాప్ తెలుగు, ఇంగ్లీష్ వర్షన్‌లో ఉండాలని అధికారులకు సూచన చేశారు. ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, రాజకీయ పార్టీలు( Political Parties ), ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు( Indiramma Houses ) కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగులో కూడా యాప్‌ను రూపొందించాలని పొంగులేటి సూచించడంతో.. ఈ పథకాన్ని మొదట రూరల్ ప్రాంతాల్లోనే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు..? ఏయే ధృవపత్రాలు కావాలి..? ఈ పథకం విధివిధానాలు ఏంటో తెలుసుకుందాం..
అర్హులు ఎవరంటే..?
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,00 ఇండ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ పథకం కేవలం దారిద్ర్య రేఖకు దిగువ( BPL )న ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే తెల్ల రేషన్ కార్డు( White Ration Card ) ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా మహిళల పేరు మీదనే ఇల్లు మంజూరవుతుంది. సొంత జాగ ఉండి కిరాయి ఇండ్లలో కానీ, కచ్చా ఇండ్లలో కానీ నివసిస్తున్న వారు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులు. గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులను గుర్తించనున్నారు.
కొత్త ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు..
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ. 5 లక్షలు ఇస్తారు.
ఇంటి నిర్మాణానికి నిధుల మంజూరు ఇలా..
గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం( Double Bed Room Houses ) అపార్ట్‌మెంట్ల మాదిరిగా కాకుండా.. లబ్ధిదారుల సొంత జాగాలో మెుత్తం 4 దశల్లో ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. కనీసం 400 చదరపు అడుగుల వైశాల్యంలో స్లాబు నిర్మా ణం, అందులో వంటగది( Kitchen ), మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పునాదులు పూర్తయ్యాక లక్ష, రూఫ్ లెవల్‌కి వచ్చాక మరో లక్ష, స్లాబ్ వేశాక రూ. 2 లక్షలు, మొత్తం పూర్తయ్యాక మిగిలిన లక్ష చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
ఏయే ధృవపత్రాలు అవసరం..?
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మహిళలను ప్రామాణికంగా చేయనున్నారు. కాబట్టి సదరు మహిళకు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్( Bank Pass Book ), పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలను అడిగే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఆ కుటుంబానికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డు( White Ration Card )ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.