young india residential schools । ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్
తెలంగాణలోని 10వేల పాఠశాలల్లో 34లక్షల మంది చదువుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావిస్తున్న పరిస్థితికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా వ్యవస్థను తయారు చేస్తామన్నారు.

- రూ.125 కోట్లతో.. 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
- ఈ నెల 11న పనులు ప్రారంభిస్తాం
- రెండుసార్లు సీఎంను చేసినా ఉద్యోగాలివ్వని కొరివి దయ్యం
- ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
young india residential schools । రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.125కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ-2024 ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 11న వీటికి సంబంధించిన పనులు ప్రారంభించుకోబోతున్నామని వెల్లడించారు. ‘మిమ్మల్ని చూస్తోంటే దసరా పండగ మూడు రోజుల ముందే వచ్చినట్లుంది’ అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
పదేళ్లు ఏలిన వారు పది నెలల తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ అవకాశం తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వరన్నారు. గత పదేళ్లలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ .. పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వాళ్లు సలహాలు ఇవ్వరు… కానీ మేం చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని ఆరోపించారు. ఇవాళ్టి కార్యక్రమం జరగొద్దని కుట్రలు చేశారని మండిపడ్డారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గత పదేళ్లు కోరి కొరివిదెయ్యాన్ని తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆ కొరివి దెయ్యాన్ని రెండుసార్లు సీఎంను చేసినా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ మూడేళ్లు ఆలస్యంగా 2017లో ఇచ్చారన్నా రు. నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్ల తరువాత 2019 నియామకాలు జరిపారని ఆరోపించారు.
తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు యువతకు చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఉద్యోగ నియామకాలు చేపట్టామని రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 90రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 టీచర్ పోస్టులకు నియామక పత్రాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర కీలకమని సీఎం రేవంత్ చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో 34వేల మంది టీచర్ల బదిలీలతో పాటు 21వేల మంది టీచర్లకు పదోన్నతులు అందించామన్నారు.
తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీపై ఉందని నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులకు సీఎం తెలిపారు. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు, తెలంగాణ పునర్మిర్మాణానికి మీవంతు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. నాతో పాటు ఇక్కడున్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్ళమేనన్నారు. తెలంగాణలోని 10వేల పాఠశాలల్లో 34లక్షల మంది చదువుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావిస్తున్న పరిస్థితికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా వ్యవస్థను తయారు చేస్తామన్నారు. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టామన్నారు. తెలంగాణలో ప్రతి ఏటా 1లక్షా 10వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు కానీ ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.