shubhanshu shukla | ‘పసిపిల్లాడిలా నడక నేర్చుకుంటున్నాను’.. అంతరిక్షం నుండి పుడమికి తొలి సందేశం పంపిన శుక్లా
గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, భారత తొలి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర సందర్శకుడు, రెండో భారత వ్యోమగామి, అంతరిక్షం నుండి మాట్లాడిన తొలిమాటలివి.

shubhanshu shukla | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న ఆక్సియమ్4 మిషన్ ద్వారా నింగికెగిసిన కొన్ని గంటల తర్వాత కక్ష్యలో తిరుగుతూ, శుభాంశు భూమికి తన మొదటి సందేశాన్ని వినిపించాడు. 44ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శూన్యాకాశంలోకి అడుగుపెట్టిన తొలి వ్యోమగామి శుభాంశు శుక్లా. “ అందరికీ అంతరిక్షం నుండి నమస్కారం. నాతోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఇలా ఉండటం చాలా ఉద్వేగానికి గురిచేస్తోంది. ఇది గొప్ప ప్రయాణం. రాకెట్లోని క్యాప్సూల్లో కూర్చున్నప్పుడు నా మదిలో ఒకటే బలమైన ఆలోచన.. మనం వెళ్లాల్సిందే.” అని శుక్లా ఉత్సాహంగా తెలిపారు. ప్రయాణం మొదలైనప్పుడు ఒక్కసారిగా సీటు వెనక్కి బలంగా అతుక్కుపోయినట్లైంది. కాసేపటికి ఏం లేదు. అంతా నిశ్శబ్దం. నేను గాల్లో తేలుతున్నానని శుభాంశు తన తొలి అంతరిక్ష ప్రయాణ అనుభవాన్ని వివరించారు. స్పేస్ ఎక్స్ – ఫాల్కన్ 9 రాకెట్కు అనుసంధానించబడిన డ్రాగన్ వ్యోమనౌకలో ఉన్న ఈ బృందం, నిన్న కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుండి ఆకాశానికెగిరింది.
నేనిప్పుడు పసిపిల్లాడిలా నడక నేర్చుకుంటున్నాను. అంతరిక్షంలో ఎలా తినాలో కూడా నేర్చుకుంటానున్నాను అంటూ నవ్వాడు. సూక్ష్మభారరహిత స్థితి గురించి యథాలాపంగా మాట్లాడుతూ, ఒక్కసారిగా శూన్యంలోకి నెట్టివేయబడ్డప్పుడు నాకేం గొప్పగా అనిపించలేదు. నేను పూర్తిగా నిద్రలో మునిగిపోయానని నా మిత్రులు చెప్పారన్నాడు. ఈ యాత్రలో శుభాంశుతో పాటు మరో ముగ్గురు, కమాండర్ పెగ్గీ విట్సన్, నాసా మాజీ వ్యోమగామి, హంగరీ నుండి టైబర్ కపూ, స్లావొజ్ ఉజ్నాన్స్కీ పోలండ్ నుండి పాల్గొటున్నారు. ఈ ప్రయోగాన్ని వేలాదిమంది భారతీయులతో పాటు, శుక్లా కుటుంబసభ్యులు, ఇతర వ్యోమగాముల కుటుంబసభ్యులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. రాకెట్ ఎల్సి–39ఏ లాంచ్ప్యాడ్ మీది నుండి లేవగానే అందరూ చప్పట్లతో పెద్దపెట్టున హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. అన్నట్లు ఇదే లాంచ్ప్యాడ్ నుండి 1969లో అపోలో11 రాకెట్ చంద్రుడి మీదకు బయలుదేరింది.
ఈ ప్రయాణం ద్వారా అంతరిక్ష అంతరిక్ష కేంద్రాన్ని చేరుకునే మొదటి భారతీయుడిగా, 1984లో భారత సోవియట్ మిషన్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేసిన రాకేశ్ శర్మ తర్వాత రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నిజానికి మే 29నే బయలుదేరాల్సిన ఈ రాకెట్ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల, వాతావరణ సంబంధిత అడ్డంకుల వల్ల వాయిదా పడింది.