Papikondalu Tour | వేసవిలో పర్యటించేందుకు తెలుగు రాష్ట్రాల పరిధిలో చాలా ప్రదేశాలే ఉన్నాయి. సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా పర్యాటకులు హిల్ స్టేషన్లు, చల్లని ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. వారంతా పాపికొండలు టూర్‌కు వెళ్లి రావొచ్చు. సమ్మర్‌లో ప్రయాణి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
Papikondalu Tour | వేసవిలో పర్యటించేందుకు తెలుగు రాష్ట్రాల పరిధిలో చాలా ప్రదేశాలే ఉన్నాయి. సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా పర్యాటకులు హిల్ స్టేషన్లు, చల్లని ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. వారంతా పాపికొండలు టూర్‌కు వెళ్లి రావొచ్చు. సమ్మర్‌లో ప్రయాణి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పాపికొండల పర్యటనకు వెళ్లి రావాలనుకునే వారి కోసం ఏపీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. రాజమండ్రి నుంచి పాపికొండల వరకు నదిలో క్రూయిజ్‌లను ఏర్పాటు చేసింది. రాజమండ్రి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని గోదావరి నది మధ్యలో పాపికొండలు ఉన్నాయి. లగ్జరీ క్రూయిజ్ బోట్‌లలో అందాలను వీక్షించి రావొచ్చు.
పాపి కొండలు తూర్పు కనుమల్లో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడకు అరుదైన వలస పక్షులు సహా అనేక రకాల వృక్షజాతులు, జంతువులకు నిలయంగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రకృతి అందాలను కనుమరుగయ్యే పరిస్థితులున్నాయి. ఏపీ టూరిజం అందిస్తున్న ప్యాకేజీలో గండిపోచమ్మ దేవాలయం, పాపికొండలు, పేరంటపల్లి ఆశ్రమం, దేవాలయం తదితర ప్రాంతాలను వీక్షించి రావొచ్చు. పర్యటన అంతా బోటులోనే సాగుతుంది. ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ ఏరియా, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలను చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బ్రేక్ ఫాస్ట్, మినరల్ వాటర్, శాఖాహార భోజనం వంటివన్నీ అందిస్తారు.
ప్రయాణం ఒక రోజు మాత్రమే ఉంటుంది. ప్రయాణం రోడ్డు మార్గంలో ఉదయం 7.30 గంటలకు మొదలవుతుంది. మొదట పట్టిసీమ రేవు, పోలవరం రేవు, పురుషోత్తపట్నం రేవులోని బోట్ల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తారు. అనంతరం 9 గంటల సమయంలో బోట్‌లో అల్పాహారం, ఆపై గోదావరిలో ప్రయాణం మొదలవుతుంది. 10.30 గంటలకు గండిపోచమ్మ ఆలయానికి చేరుకుని.. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటలకు బోట్‌లోనే శాకాహార భోజనం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు పాపికొండల వరకు చేరుతారు.
ప్రయాణంలో ప్రకృతి అందాలను అస్వాదించేందుకు అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం జిల్లా పేరంటపల్లి గ్రామానికి బోటు చేరుతుంది. అక్కడ రామకృష్ణ ముని ఆశ్రమం, వీరేశ్వర స్వామి దేవాలయం, శివుడిని దర్శనం చేసుకుంటారు. 3.30 గంటలకు పట్టిసీమ రేవు, పోలవరం రేవు, పురుషోత్తపట్నం రేవుకు పడవలో తిరుగు ప్రయాణమవుతారు. రాత్రి 7.30 గంటలకు రోడ్డు మార్గంలో రాజమండ్రికి వెళ్తారు. రాత్రి 8.30 గంటలకు పర్యాటకులు రాజమండ్రి చేరడంతో ప్రయాణం ముగుస్తుంది. ఏపీ టూరిజం బోట్ ప్రయాణం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 వరకు మాత్రమే ఉంటుంది. పాపికొండలు టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునేందుకు tourism.ap.gov.in/tours వెబ్‌సైట్‌తో పాటు aptourismrajahmundri.com వెబ్‌సైట్‌లోనూ సంప్రదించవచ్చు.