Telangana tour | ఈ దర్శనీయ ప్రాంతాలు తెలంగాణలోని నిగూఢ‌ ర‌త్నాలు.. అవేంటో చూద్దామా..!

Telangana tour : విహారయాత్ర, తీర్థయాత్ర అంటే ఇప్పుడు చాలామందికి సుదూర ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలు, సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలే గుర్తుకు వస్తాయి. కానీ మనకు దగ్గరలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా భావించనే భావించరు. మన దగ్గరల్లోని ఆలయాలను పుణ్యక్షేత్రాలుగా పరిగణించరు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ చాలామందికి తెలియ‌ని ర‌త్నాల లాంటి ద‌ర్శనీయ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 8 ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana tour |  ఈ దర్శనీయ ప్రాంతాలు తెలంగాణలోని నిగూఢ‌ ర‌త్నాలు.. అవేంటో చూద్దామా..!

Telangana tour : విహారయాత్ర, తీర్థయాత్ర అంటే ఇప్పుడు చాలామందికి సుదూర ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలు, సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలే గుర్తుకు వస్తాయి. కానీ మనకు దగ్గరలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా భావించనే భావించరు. మన దగ్గరల్లోని ఆలయాలను పుణ్యక్షేత్రాలుగా పరిగణించరు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ చాలామందికి తెలియ‌ని ర‌త్నాల లాంటి ద‌ర్శనీయ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 8 ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మల్లారం ఫారెస్ట్

ఇది ఉరుకులు, ప‌రుగుల ప‌ట్టణజీవ‌న‌శైలికి దూరంగా నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత‌మైన వాతావర‌ణంలో ఉన్నది. అనువైన ర‌వాణా సౌక‌ర్యం కూడా క‌లిగిన ఈ ప్రాంతానికి హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి కేవ‌లం 200 కిలోమీట‌ర్ల దూరం మాత్రమే. ఫారెస్ట్ ట్రెక్కులు, ప్రసిద్ధ బౌద్ధ దేవాల‌యాలు, వ్యూపాయింట్ ట‌వ‌ర్ ఇక్కడి ప్రత్యేక ఆక‌ర్షణ‌లు. అంతేగాక‌ వలస పక్షులు, జంతువులు 145 కోట్ల సంవ‌త్సరాల చరిత్ర క‌లిగిన పురాత‌న శిల మ‌న‌ల‌ను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్తాయి. ఆదిమ‌కాల‌పు ప‌రిస‌రాలు, స్వచ్ఛమైన గాలి, ప‌క్షుల కిల‌కిలారావాలు మ‌న‌ల‌ను మంత్రముగ్ధుల‌ను చేస్తాయి. ప్రకృతి ప్రేమికుల‌కు ఇంత‌కంటే ఇంకేం కావాలి…?

యెల్లేశ్వరగట్టు ద్వీపం

ఈ చూడ‌చ‌క్కని యెల్లేశ్వరగట్టు ద్వీపం నాగార్జున‌సాగర్ డ్యామ్ బ్యాక్ వాట‌ర్‌లో ఉన్నది. ఈ ద్వీపం మర్మ ద్వీపంగా ప్రసిద్ధి చెందింది. నాగార్జునసాగర్ డ్యామ్ బ్యాక్ వాటర్స్ మధ్యలో ఉన్న ఈ ద్వీపం చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటున్నది. చాలాకాలంగా మ‌రుగునప‌డిన ఈ ద్వీపానికి హైద‌రాబాద్ నుంచి మూడు గంట‌ల్లో చేరుకోవ‌చ్చు. దూరం 169 కిలోమీట‌ర్లు. ఈ ద్వీప శిఖ‌రానికి బోటు సౌక‌ర్యం ఉంటుంది. అక్కడ ఒక‌రాత్రి బ‌స‌చేయ‌డం వ‌ర్ణించ‌లేని అనుభూతి. రూ.1500 చెల్లిస్తే మ‌త్స్యకారులు అక్కడికి తీసుకెళ్తారు. రాత్రి బ‌స అక్క‌ర్లేద‌నుకునేవారు రూ.200 టికెట్‌తో వెళ్లిరావ‌చ్చు.

గౌతమేశ్వరాలయం

మంథనిలోని ఈ గౌతమేశ్వర ఆలయం గొప్ప చారిత్రకమైన‌ పురావస్తు, మతపరమైన ఆధారాలకు సాక్షీభూతంగా నిలిచింది. ఈ ఆల‌యం వేద అభ్యాసానికి పురాతన ఉదాహరణగా పరిగణించబడుతున్నది. నాడు అందంగా చెక్కబడిన ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరిన గోడలు, చెట్ల పొద‌లు క‌మ్మిన‌ శిల్పాలతో శిథిలావస్థలో ఉన్నది.

జన్నారం ఫారెస్ట్

ప్రకృతి ర‌మ‌ణీయ‌మైన ఈ అభయారణ్యాన్ని సందర్శించేందుకు శీతాకాలం అనువైనది. ఇక్కడ అట‌వీ జీవ‌రాశులను వీక్షించ‌డానికి జీప్ సఫారీల వంటి సౌక‌ర్యాలు ఉంటాయి. అడ‌వుల్లోని అరుదైన జంతువులను చూడటానికి బస వ‌స‌తి కూడా ఉంటుంది. హైదరాబాద్ నుంచి 290 కి.మీ దూరం, నిర్మల్ నుంచి 80 కి.మీ. దూరం ఉంటుంది. అక్కడి నుంచి 50 కి.మీల దూరంలో కడెం ప్రాజెక్టు ఉంటుంది. క‌డెం నుంచి మ‌రో మరో 30 కిలోమీటర్‌లు ప్రయాణిస్తే జ‌న్నారానికి చేరుకోవ‌చ్చు.

దేవరకొండ కోట

రాష్ట్రంలో అద్భుత‌మైన‌ నిర్మాణ సౌంద‌ర్యంగ‌ల‌, నిగూఢ ర‌త్నాలు క‌లిగిన అపురూప క‌ట్టడంగా దేవ‌ర‌కొండ కోటను చెప్పవ‌చ్చు. నల్గొండలోని దేవరకొండ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ కోట ఉన్నది. కోటలోని ప్రతి మూలలో అక్కడి పాలకుల ధైర్యసాహసాలు, పోరాట ప‌టిమ‌లు, విజయాలకు సంబంధించిన గాథ‌లు కనిపిస్తాయి. ఇవ‌న్నీ సంద‌ర్శకుల‌ను చారిత్రిక పుటల్లోకి తీసుకెళ్తాయి. ఈ కోటపై నుంచి ప‌రిస‌రాల్లోని ఏడు కొండలను, భారీ బండరాళ్లను, ద‌ట్టమైన‌ అడవిని ద‌ర్శించ‌వ‌చ్చు. హైద‌రాబాద్ నుంచి 117 కిలోమీట‌ర్ల దూరంలో ఈ కోట ఉన్నది. నాగార్జున‌సాగ‌ర్ దారిగుండా మూడు గంట‌ల్లో చేరుకోవ‌చ్చు. న‌ల్లగొండ టౌన్ నుంచి కేవ‌లం గంట స‌మ‌యం మాత్రమే ప‌డుతుంది.

నగునూరు కోట

రాష్ట్రంలోని కాకతీయ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన కోటలలో న‌గునూరు కోట కూడా ఒకటి. ఈ కోట 12వ‌, 13వ‌ శ‌తాబ్దాల‌కు చెందిన ప‌లు ఆల‌యాల‌కు నిల‌యం. కోట లోపల కల్యాణి, చాళుక్య, కాకతీయుల కాలం నాటి అనేక‌ శిథిలమైన దేవాలయాలు ఉన్నాయి. మధ్యయుగకాలంలో ఈ కోట‌ రాజకీయ, మతపరమైన కార్యక్రమాల‌కు కేంద్రంగా విల‌సిల్లిన‌ద‌ని ఇక్కడ లభించిన శాసనాలను బ‌ట్టి తెలుస్తున్నది. ఈ న‌గునూరు కోట జగిత్యాల పట్టణానికి సమీపంలో ఉన్నది. క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రానికి 61 కిలోమీట‌ర్ల దూరంలో, జ‌గిత్యాల దాదాపు 11 కి.మీ దూరంలో ఉన్న ఈ కోటకు రోడ్డు మార్గంలో చేరుకోవ‌చ్చు.

పాకాల చెరువు

పాకాల చెరువు క్రీ.శ.1213 నాటిది. ఇది పూర్తిగా ఈ మానవ నిర్మిత సరస్సు. అభయారణ్యం లోపల ఉన్నది. ఈ చెరువు వీక్షణం ఒక కొత్త అనుభూతినిస్తుంది. అక్కడికి చేరుకోగానే మీకు ప్రకృతి ర‌మ‌ణీయ‌మైన‌ మలుపుల రోడ్లు, అంతులేని విశాల‌మైన‌ పచ్చని ప్రదేశాలు, రోడ్‌సైడ్ స్టాల్స్, స్నేహపూర్వక మ‌నుషులు స్వాగతం పలుకుతారు. ఈ చెరువును పూర్తిగా వీక్షించాలంటే రూ.300 ఇచ్చి బోట్‌లో వెళ్లవ‌చ్చు. అక్కడికి వెళ్లేవారికి పాకాల‌లోని హ‌రిత హోట‌ల్‌లో వ‌స‌తి సౌక‌ర్యం కూడా ఉన్నది. ఈ చెరువుకు చేరుకోవ‌డానికి హైద‌రాబాద్ నుంచి నాలుగు గంట‌లు, వ‌రంగ‌ల్ నుంచి 30 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది.

ఖిలా ఘన్‌పూర్

ఖిలా ఘన్‌పూర్ రాష్ట్రంలోని అత్యంత చారిత్రక‌త క‌లిగిన ప్రదేశాల‌లో ఒక‌టి. మహబూబ్‌నగర్ సమీపంలో ఉన్న ఈ కోట గురించి చాలా త‌క్కువ మందికి మాత్రమే తెలుసు. మీరు మీ విలువైన స‌మ‌యాన్ని ప్రకృతి అందాల న‌డుమ ప్రశాంతంగా గ‌డుపాల‌ని చూస్తున్నట్లయితే.. త‌ప్పక అన్వేషించాల్సిన ప్రదేశం ఇదే. కింద నుంచి ఈ కోటపైకి వెళ్లడానికి రెండు గంటల స‌మ‌యం ప‌డుతుంది. కోటపైకి ఎక్కేస‌రికి బాగా అల‌సిపోయిన‌ప్పటికీ.. దానిపై నుంచి అంద‌మైన ప్రకృతిని వీక్షించ‌గానే మీ అల‌స‌ట మ‌టుమాయం అవుతుంది. కోట‌పై నుంచి ఘన్‌పూర్ చెరువు క‌డు సుంద‌ర‌ దృశ్యంగా క‌నిపిస్తుంది.