Bronze Age Ancient Village Video | చెరువులో నీటి కింద 3 వేల ఏళ్ల క్రితం నాటి కంచు యుగపు గ్రామం! (వీడియో)

మూడు వేల ఏళ్ల క్రితం నాటి.. కంచు యుగపు గ్రామాన్ని ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. విశేషం ఏమిటంటే.. ఈ గ్రామం.. సరస్సు నీటిపైన నిర్మించినదని లభించిన అవశేషాలను బట్టి నిర్ధారించారు.

  • By: TAAZ |    trending |    Published on : Oct 28, 2025 9:22 PM IST
Bronze Age Ancient Village Video | చెరువులో నీటి కింద 3 వేల ఏళ్ల క్రితం నాటి కంచు యుగపు గ్రామం! (వీడియో)

Bronze Age Ancient Village Video | సెంట్రల్‌ ఇటలీలోని లేక్‌ మెజ్జానో (Lake Mezzano)లో ఆర్కియాలజిస్టులు ఒక అద్బుతాన్ని కనుగొన్నారు. వేల సంవత్సరాలపాటు నీటిలో మునిగిపోయి ఉన్న ఒక గ్రామం అవశేషాలను వెలికి తీశారు. ఈ గ్రామం.. 3వేల ఏళ్ల క్రిందటి కంచు యుగం నాటిదని గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం లాజియోలోని వలెంటానో పట్టణ సమీపంలో ఉంది. అత్యంత పురాతన ఈ ఆవాసం చుట్టూ ఆరు వందలకుపైగా చెక్క పోస్టులను (స్తంభాలు) అండర్‌వాటర్‌ ఆర్కియాలజిస్టులు అధ్యయనం చేశారు. అయితే.. ఇప్పటి వరకూ లభించినవి లోతైన చరిత్రకు ట్రైలర్‌ మాత్రమేనని అంటున్నారు. ఈ అవశేషాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.

అధ్యయనంలో భాగంగా ఆరు వందలకు పైగా చెక్క స్తంభాలను అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ ఆర్కియాలజిస్టులు గుర్తించారు. 2025వ సంవత్సరం ప్రారంభంలో నిర్వహించిన తొలి దశ తవ్వకాల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయాన్ని విట్రెబో, సదరన్‌ ఇటూరియా ప్రాంతాల పురావస్తు, కళలు, భూ సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రామం క్రీస్తుపూర్వం 1700 నుంచి 1150 మధ్యకాలంలో నిర్మించినట్టు పురావస్తు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఆ కాలంలో సరస్సు నీటిపై చెక్క స్తంభాలను ఆధారం చేసుకుని ఇళ్లు నిర్మించేవారు. వీటిని పైల్‌ డ్వెల్లింగ్స్‌ అని పిలుస్తారు. ఇప్పటి వరకూ పరిశోధకులు సరస్సు అడుగున మూడో వంతు ప్రాంతంలో ఎనిమిది అడుగుల నుంచి 32 అడుగుల లోతులో చెక్కలను గుర్తించారు.

ఈ సరస్సు అగ్నిపర్వతం కారణంగా ఏర్పడిన వాల్కొనిక్‌ బేసిన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే సరస్సు మట్టిలోని ఖనిజాలు ఆ స్తంభాలను వేల సంవత్సరాలపాటు కాపాడగలిగాయని అంటున్నారు. సరస్సు నీటి స్థాయిలో మార్పులు.. భూకంపాలు, వాతావరణ మార్పులు లేదా వివిధ భౌగోళిక పరిణామాల కారణంగా చోటు చేసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ కాలంలో ప్రజలు ఇళ్లను ఎలా నిర్మించేవారు? నీటిపై నిర్మాణాలు ఎలా నిలబడేవి? ప్రకృతి పరంగా చోటుచేసుకున్న మార్పులను నాటి ప్రజలు ఎలా ఎదుర్కొనేవారు అనే అంశాలపై శాస్త్రజ్ఞులు పరిశోధిస్తున్నారు. ఇది ఐరోపా కంచు యుగం నాటి గ్రామీణ జీవన విధానాన్ని అర్థం చేసుకోవడంలో కీలక మలుపు అవుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Solar Storm | 14వేల ఏళ్ల నాటి స్థాయిలో సౌర తుఫాను మళ్లీ వస్తుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
What Causes Earthy Smell After Rain ? | వర్షం పడ్డాక మంచి వాసన ఎందుకో తెలుసా?
Zanclean Mega Flood | ఒక మహావరద మధ్యధరా సముద్రాన్ని సృష్టించిందా?
Tectonic Interactions | మీరు నమ్మలేరు.. రెండు ముక్కలుగా చీలనున్న భారతదేశం!