దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చెబుతున్నదేంటి?
దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు చాలా గట్టి గుణపాఠాలనే అందిస్తున్నాయి. వాటి నుంచి ప్రజలు ప్రత్యేకించి ప్రభుత్వాలు నేర్చుకుంటే.. ఇకపై జరిగే ప్రమాదాల్లో మృతుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు!
నిత్యం రోడ్డు ప్రమాదాల వార్తలు పత్రికల్లో, మీడియాలో వస్తూనే ఉంటాయి. అందులో ఒకటి రెండు మరణాలు చేటుచేసుకున్న ఘటనలు.. ఆ రోజుకు లేదా మరుసటి రోజుకు మనమే కాదు.. ప్రభుత్వాలు కూడా మర్చిపోతాయి. కర్నూలు బస్సు దగ్ధం వంటి ఘటనలు కొన్నాళ్లు మెదులుతూ ఉంటాయి.. ఆ తర్వాత అవి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాయి. తీవ్రమైన ప్రమాదాలు, పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నప్పుడు కొంత హడావుడి ఉంటుంది. మీడియాలో చర్చలు రచ్చ చేస్తాయి. వీలుంటే రాజకీయాలతో కూడా ముడిపెట్టేస్తారు! అక్కడే ఖేల్ ఖతం.. దుక్నం బంద్!
కానీ.. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు చాలా గట్టి గుణపాఠాలనే అందిస్తున్నాయి. వాటి నుంచి ప్రజలు ప్రత్యేకించి ప్రభుత్వాలు నేర్చుకుంటే.. ఇకపై జరిగే ప్రమాదాల్లో మృతుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు! లేదంటే.. వాహనాలకు ఎన్ని పూజలు చేసినా ఎందుకూ పనికిరావు! విచిత్రం ఏమిటేంట.. దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గత రెండు దశాబ్దాల కాలంలో కేవలం పదిశాతమే పెరిగాయి. కానీ.. మరణాల సంఖ్య మాత్రం అమాంతం 80 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగం.. నాణ్యమైన రోడ్లు లేకపోవడం సహా మొత్తంగా వ్యవస్థీకృత వైఫల్యాలను ఈ డాటా చాటుతున్నది.
2023లో ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటే.. లక్షన్నర మంది ఆ ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. ఈ సంఖ్య గత 19 ఏళ్లలోనే అత్యధికం. 2005 తర్వాత ప్రమాదాల సంఖ్యలోపదిశాతమే పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాలు మాత్రం 80 శాతం పెరగడం ఆందోళన కల్గించడమే కాదు.. వ్యవస్థలో లోపాలను వెంటనే పరిశీలించి, తక్షణమే సరిదిద్దాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం అనేది అతిపెద్ద కారణంగా ఉంది. తదుపరి స్థానంలో మద్యం తాగి వాహనాలు నడిపినప్పుడు చోటు చేసుకునే మరణాలు ఉన్నాయి. నాణ్యత లేని రోడ్ల డిజైన్, సరైన పర్యవేక్షణ లోపించడం వల్లే హైవేలలో చోటు చేసుకునే ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నదని నిపుణులు చెబుతున్నారు. ఎంత వేగంగా రోడ్లు నిర్మించామనే అంశంలో చూపిన శ్రద్ధ.. ఎన్ని భద్రతా ప్రమాణాలతో నిర్మించాలనే అంశంలో చూపకపోవడమే దీనికి ప్రధాన కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2021 నుంచి 2023 వరకూ దేశంలో మొత్తం చోటుచేసుకున్న మరణాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయినవారు 2.9 శాతంగా ఉన్నారు. అంటే టీబీ, మలేరియాతో చనిపోయేవారికంటే అత్యధికం అన్నమాట.
ఇటీవల చేవెళ్ల వద్ద ఒక గ్రావెల్స్ టిప్పర్.. బస్సును ఢీకొన్న ఘటనలో 19 మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది ఆ గ్రావెల్ కింద కూరుకుపోయి ఊపిరాడక చనిపోయినవారే. అంతకు ముందు కర్నూలు వద్ద రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఈడ్చుకెళ్లిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమై.. 19 సజీవ దహనమయ్యారు. తాజాగా 2025 నవంబర్ 3వ తేదీన జైపూర్ జిల్లా హర్మదా వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక డంపర్ ట్రక్.. 17 వాహనాలను ఢీకొట్టుకుంటూ పోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. ఇవన్నీ భారతదేశపు డ్రైవింగ్ ధోరణలు, ట్రాఫిక్ కల్చర్ మీద మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ విడుదల చేసిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క 2023లోనే దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో లక్షన్నరకుపైగా ప్రజలు దుర్మరణం పాలయ్యారు. గడిచిన 19 ఏళ్ల కాలంలో ఇంతటి సంఖ్యలో మరణాలు ఇదే మొదటిసారి. 2005–2023 మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు పదిశాతం మాత్రమే పెరిగాయి. కానీ.. మరణాలు మాత్రం సుమారు 80 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. దీన్ని గమనిస్తే యాక్సిడెంట్లు ఎంత ఘోరంగా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటిలోనూ ప్రధాన కారణంగా అతివేగమే కనిపిస్తున్నది. 2022లో హైవేలపై 1.10 లక్షలకు పైగా ప్రమాదాలు అతి వేగం కారణంగా చోటు చేసుకున్నవే. ఈ ప్రమాదాల్లో సుమారు 50 వేల మంది చనిపోయారు. 2009లో రోడ్డు ప్రమాదాల్లో 45శాతం అతివేగం కారణంగా చోటుచేసుకున్నవేనని కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. డ్రైవర్లలో కనీస డ్రైవింగ్ సెన్సిబిలిటీలు సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. 2023లో 3వేలకుపైగా మరణాలు మద్యం తాగి వాహనం నడపడం వల్లే జరిగాయి. మరో పదివేల మరణాలు రాంగ్‌వేలో వాహనాలను నడిపించడంతో జరిగాయి. జైపూర్ రోడ్డు ప్రమాదం ఘటనలో లారీ నడిపిన డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు కూడా ధృవీకరించారు.
ఎందుకు భారతీయులు రోడ్లపై వాయువేగంతో దూసుకుపోతుంటారు? ఒక సమస్య ఏంటంటే.. ఒకే రోడ్డుపై పాదచారులు, బైకర్లు, చిన్న కార్లు, భారీ వాహనాలు.. పోటీ పడుతూ పోతూ ఉంటాయి. సుమారు 60 లక్షల కిలోమీటర్ల పొడవున ఉన్న రహదారులతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి నెట్‌వర్క్‌గా చెప్పుకొనే భారతేదేశంలో ఎందుకీ దుస్థితి? భిన్నమైన పరిస్థితుల మధ్య భద్రమైన ప్రయాణాన్ని అందించడంలో మౌలిక వ్యవస్థ వైఫల్యమే ఇందుకు కారణంగా కొందరు నిపుణులు చెబుతున్నారు. వేగంగా రోడ్లను విస్తరిస్తున్నా.. సేఫ్టీ ఇంజినీరింగ్.. అంటే తగిన సిగ్నల్స్, పేలవమైన రోడ్డు డిజైన్, నిర్మాణంలో అవకతవకలు, వాటిపై కొరవడుతున్న తనిఖీలు అన్నీ కలిసి.. ఈ దుస్థితికి కారణమవుతున్నాయని బీబీసీ వెబ్‌సైట్‌లో ఒక నివేదిక పేర్కొంటున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram