Danam, Kadiyam disqualification case| దానం, కడియంలకు స్పీకర్ క్లీన్ చీట్.. అనర్హత పిటిషన్ల కొట్టివేత

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలకు భారీ ఊరట లభించింది. దానం, కడియం అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేస్తూ..వారికి క్లీన్ చీట్ ఇచ్చారు.

Danam, Kadiyam disqualification case| దానం, కడియంలకు స్పీకర్ క్లీన్ చీట్.. అనర్హత పిటిషన్ల కొట్టివేత

విధాత,హైదరాబాద్ :  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి  ఫిరాయించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలకు భారీ ఊరట లభించింది. దానం, కడియం అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేస్తూ..వారికి క్లీన్ చీట్ ఇచ్చారు. వారిపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలలో వాస్తవం లేదని, వారు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారంటూ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు.

దానం నాగేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు.., కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ. వివేకానందలు అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. వారి పిటిషన్లను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత అభియోగాలపై తగిన సాక్ష్యాధారాలు లేవని, వారు సాంకేతికంగా బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్నారంటూ తీర్పునిచ్చారు. దీంతో మొత్తం 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెలువడింది. 10మంది కూడా పార్టీ ఫిరాయించినట్లుగా ఆధారాలు లేవని, వారంతా ఇప్పటికి సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని తీర్పు నివ్వడం గమనార్హం. అనర్హత పిటిషన్ల విచారణ ప్రక్రియను తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి  12 వ తేదీకి ముందే స్పీకర్ ప్రసాద్ విచారణ పూర్తి చేసి, తీర్పునివ్వడం విశేషం. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

10మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ లో దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్ల విచారణ కొంత స్పీకర్ కు క్లిష్టంగా మారింది. దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం, కడియం కూతురు కావ్య సైతం ఎంపీగా పోటీ చేసి గెలువడం..ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తన కూతురు విజయం కోసం శ్రీహరి పనిచేయడంతో వారిద్దరి అనర్హత విచారణ స్పీకర్ కు క్లిష్టతరమైంది. అయితే స్పీకర్ మాత్రం దానంపై అనర్హత పిటిషన్ ఆయన ఎంపీగా పోటీ చేయకముందే దాఖలైందని, దానం, కడియంల వేతనం బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి వెలుతుందని, సాంకేతికంగా వారిద్దరు ఇప్పటికి బీఆర్ఎస్ సభ్యులేనని స్పీకర్ భావించి వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. అయితే 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ ఏకపక్షంగా కొట్టివేశారని భావిస్తున్న  బీఆర్ఎస్ పార్టీ  స్పీకర్ తీర్పును సుప్రీం  కోర్టులో సవాల్ చేయనున్నట్లుగా తెలుస్తుంది.

స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేసిన వ్యక్తికి స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం ప్రజాస్వామ్యపై దాడి అని వ్యాఖ్యానించారు. అలాగే ప్రజాతీర్పును అవమానించడం అని, ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అనర్హత పిటిషన్ కొట్టివేతపై దానం నాగేందర్ స్పందిస్తూ…నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పటికి సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే ఉన్నానని, నాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గాని, ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీగాని పిటిషన్ దాఖలు చేయలేదని, కనీసం వివరణ కూడా అడుగలేదని, విప్ కూడా జారీ చేయలేదని గుర్తు చేశారు. కేవలం కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా నాపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారని, పిటిషన్ దాఖలు చేసిన వారికి ఎలాంటి అధికారం కూడా లేదన్నారు. అనవసరంగా ఆరునెలలుగా నాపై అనర్హత కోసం స్పీకర్ పై ఒత్తిడి చేశారని ఆరోపించారు. స్పీకర్ పరిధిలో నేను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఇప్పటికి నా వేతనం కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లోనే జమ అవుతుందని గుర్తు చేశారు.