మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఎస్పీ కార్యాలయం వద్ద మంగళవారం (16.6.2026) ఇద్దరు మహిళలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీనికి సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ వీడియోల్లో.. ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, కిందపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, వారిద్దరినీ విడదీసేందుకు చుట్టుపక్కలవారు ప్రయత్నించడం కనిపిస్తున్నది. గొడవకు ముందు ఆ ఇద్దరు మహిళలూ పోలీసుల ముందే తీవ్ర వాగ్వాదానికి దిగారని చుట్టుపక్కలవారు చెబుతున్నారు. కాసేపటికే ఇద్దరూ జుట్లు పట్టుకొని, తన్నుకున్నారు. దీంతో వారి చుట్టూ పెద్ద సంఖ్యలో జనం పోగుపడ్డారు. వారిలో కొందరు వారిని విడదీసేందుకు ప్రయత్నించగా.. ఈ హైవోల్టేజ్ డ్రామాను తమ ‘మొబైల్స్‌లో భద్రపర్చుకునేందుకు’ మరికొందరు ఆ ఘర్షణను రికార్డ్ చేసుకోవడం కనిపిస్తున్నది. వాటిని తర్వాత సోషల్ మీడియాలో పెట్టగా.. అది వైరల్‌గా మారింది.
ఇంతకీ వారిద్దరూ అంతలా ఎందుకు తన్నుకున్నారో వెంటనే తెలియరాలేదు. పోలీసులు జోక్యం చేసుకుని, వారిద్దరినీ విడదీశారు. అనంతరం ప్రశ్నించేందుకు వారిద్దరినీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రతివారం ఎస్పీ కార్యాలయంలో ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసుకుంటూ ఉంటారు. ఇదే కార్యక్రమానికి ఆ మహిళలు ఇద్దరూ వచ్చారని పోలీసు అధికారులు చెప్పారు.
విద్యారైక్వార్ అనే మహిళకు క్రిమినల్స్‌తో సంబంధాలు ఉన్నాయని తీవ్రంగా గాయపడిన మహిళ ఆరోపించింది. విద్య.. యూట్యూబర్‌నని చెప్పుకొంటున్నది. తాజా ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మహిళకు వ్యతిరేకంగా కొద్ది రోజుల క్రితం ఒక వీడియోను విద్య పోస్ట్ చేసింది. అందులో వాస్తవాలను వక్రీకరించారంటూ గాయపడిన మహిళ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. విద్య కూడా అదే సమయానికి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
