Desert Gold Treasure Discovery | ఇండియాకు వస్తూ మాయమైన 16వ శతాబ్దపు బంగారు నౌక ‘బోమ్ జీసస్’ రహస్యం.. గోవాకు తెస్తున్నదేంటి?

వజ్రాల కోసం తవ్వకాలు జరిపిన మైనర్స్‌కు.. ఏకంగా 500 ఏళ్లనాటి బంగారం, నిధులు, నిక్షేపాలతో కూడిన నౌక కనిపించింది. నమీబ్‌ ఎడారిలో ఇసుక కప్పేసిన ఈ శిథిల నౌకలో వేల కొద్దీ బంగారు నాణేలు, ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులు, రాజుల కాలపు సంపద కనిపించాయి. ఈ నౌక ఎప్పుడో 1533లో పోర్చుగల్‌ దేశం నుంచి బయల్దేరి అదృశ్యమైన ‘బోమ్‌ జీసస్‌’గా శాస్త్రవేత్తలు గుర్తించారు. చూడటానికి ఇది ఓ పురావస్తు ఆవిష్కరణలా కనిపిస్తున్నా.. ప్రపంచ వాణిజ్య చరిత్రను కళ్లముందు నిలబెట్టే ప్రత్యక్ష ‘టైమ్‌ క్యాప్య్సూల్‌గా దీనిని అభివర్ణిస్తున్నారు.

  • By: TAAZ |    viral-news |    Published on : Jan 06, 2026 7:14 PM IST
Desert Gold Treasure Discovery | ఇండియాకు వస్తూ మాయమైన 16వ శతాబ్దపు బంగారు నౌక ‘బోమ్ జీసస్’ రహస్యం.. గోవాకు తెస్తున్నదేంటి?

Desert Gold Treasure Discovery | అది 2008 ఏప్రిల్‌. నమీబియా (Namibia) ప్రభుత్వం, వజ్రాల సంస్థ డీబియర్స్‌ సంయుక్తంగా నెలకొల్పిన (joint enterprise) నమ్‌డెబ్‌ (Namdeb) నిర్వహించే హైసెక్యూరిటీ డైమండ్‌ మైనింగ్‌ ప్రాంతం అది. అక్కడ వజ్రాల కోసం గనికార్మికులు ఇసుకను తొలగిస్తుంటే.. మొదట కలప కనిపించింది. తర్వాత లోహాలు కనిపించాయి. ఆఖరుగా కనిపించింది చూసి కార్మికులు నివ్వెరపోయారు. అది బంగారం!! ఏం జరుగుతున్నదో ఏం బయటకు వస్తున్నదో మొదట వారికి అర్థం కాలేదు. వాళ్లు వెతికేందుకు వచ్చింది వజ్రాల కోసం. కానీ దొరికింది మాత్రం ఏకంగా ప్రపంచ సముద్ర వాణిజ్య చరిత్ర! ఒక్కసారిగా అక్కడంతా హల్‌చల్‌! గంటల వ్యవధిలోనే ఆ ప్రాంతాన్ని అధికారులు మూసివేశారు. ఇతరుల రాకపోకలు నిషేధించారు. ఇక తవ్వకాలు మొదలయ్యాయి. రోజులు వారాలయ్యాయి. ఆ వ్యవధిలో ఆఫ్రికా ఖండంలోనే అత్యంత గొప్ప మారిటైమ్‌ డిస్కవరీ ఒకటి ప్రపంచపు వెలుగులోకి వచ్చింది. దాదాపు ఐదు శతాబ్దాలుగా ఎవరికీ తెలియని, ఎవరూ తాకని, ఉన్నది ఉన్నట్టుగా యథాతథ స్థితిలో!

సముద్రాల్లో తిరిగే నౌక.. మరి ఎడారిలో ఎలా?

మీరు ముందు చదివినట్టు.. ఈ నౌక నమీబ్‌ ఎడారి ప్రాంతంలో లభ్యమైంది. అదేంటి? నౌకలు, పడవలు సముద్రాల్లో తిరుగుతాయి కదా! కానీ.. శిథిలమైన నౌక దొరికిన ప్రాంతం.. సముద్ర తీరానికి వందల మీటర్ల దూరంలో ఉంది. శాస్త్రవేత్తలు కూడా కొంత అయోమయానికి గురయ్యారు. ముందు దాన్ని పరిశోధించే పని పెట్టుకున్నారు. పరిశోధనల్లో ఏతా వాతా తేలిందేంటంటే.. కొన్ని శతాబ్దాల కాల క్రమంలో బలమైన గాలులతో కూడిన ఇసక.. తీరాన్ని మెల్లగా ముందుకు నెట్టివేసింది. సముద్ర తీర ప్రాంతం ఎడారిగా మారిపోయింది. అదే కాలక్రమంలో ఆ నౌక కొంచెం కొంచెంగా ఇసుకలో సమాధి అయిపోయింది. 2014లో వచ్చిన ఒక శాస్త్రీయ అధ్యయనం.. ఈ ప్రాంతంలో అత్యంత పొడివాతావరణం ఉండటం కారణంగానే నౌకకు సంబంధించిన కలప, తాళ్లు, వస్త్రాలు చెదిరిపోకుండా ఉన్నాయని తేల్చింది.

1533లో మాయమైన ‘బోమ్‌ జీసస్‌’

బోమ్‌ జీసస్‌గా గుర్తించిన ఈ నౌక యుద్ధ నౌక కాదని, ఒక వాణిజ్య నౌక అని అందులో లభ్యమైన వస్తువులు విస్పష్టంగా చెబుతున్నాయి. అందులో పదహారవ శతాబ్దం నాటి పోర్చుగీసు, స్పానిష్‌ బంగారు నాణేలు (spanish gold) లభించాయి. జర్మనీకి చెందిన ఫగ్గర్‌ (Fugger) బ్యాంక్‌ ముద్ర ఉన్న 22 టన్నుల రాగి దిమ్మెలు, పశ్చిమ ఆఫ్రికా తీరం నుంచి తీసుకువచ్చినట్టు భావిస్తున్న 40 వరకూ ఏనుగు దంతాలు, వివిధ దేశాల ఆనాటి కరెన్సీ నోట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఏనుగు దంతాలను డెలివరీకి సిద్ధంగా ప్యాక్‌ చేసినట్టు ఉన్నాయి. వీటిని భారత తీర ప్రాంతం గోవాకు తీసుకువచ్చేందుకు ఉద్దేశించినట్టు భావిస్తున్నారు.  పోర్చుగీస్‌, అరబ్‌, భారత వ్యాపారుల మధ్య ఏనుగు దంతాల క్రయవిక్రయాలు కీలకంగా ఉండేవి. ఇవన్నీ పరిశీలించి, పరిశోధించిన శాస్త్రవేత్తలు ఇది 1533లో లిస్బన్‌ నుంచి బయల్దేరిన పోర్చుగీసు నౌక ‘బోమ్‌ జీసస్‌’ అని ధృవీకరించారు. వాణిజ్యం కోసం 1533లో ప్రయాణం ప్రారంభించిన ఈ నౌక.. కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ దాటి తర్వాత అదృశ్యమైంది. ఆ నౌకలో ప్రయాణిస్తున్నవారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా బతికి బట్టకట్టిన ఆనవాళ్లు లేవు. అసలా నౌకకు సంబంధించిన సమాచారమేదీ కూడా లిస్బన్‌కు అందలేదు.

ఆనాటి గ్లోబలైజేషన్‌కు తార్కాణం?

ఈ నౌకలో కనిపించిన సరుకు సరంజామాను గమనిస్తే.. యూరప్‌, ఆఫ్రికా, హిందూ మహాసముద్రం అప్పటికే ఒక నెట్‌వర్క్‌గా పనిచేస్తున్నట్టు అవగతమవుతున్నదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.
ఇది ఒక శిథిల నౌక మాత్రమే కాదని, ప్రపంచీకరణ మొదటి దశకు చెందిన ‘సీల్‌ చేసిన టైమ్‌ క్యాప్స్యూల్‌’ అని AIMURE డైరెక్టర్‌ డాక్టర్‌ బ్రునో వెర్జ్‌ అభివర్ణించారు.

ప్రయాణించింది 300 మంది కానీ.. దొరికింది ఒక చిన్న ఎముక

నౌక బయల్దేరిన సమయంలో అందులో అన్ని రకాల సిబ్బంది సహా 300 మంది ఉన్నారని తెలుస్తున్నది. కానీ.. పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించగలిగింది మాత్రం చీకిపోయిన ఒక షూలో చిక్కుకుపోయిన కాలి వేలి ఎముక ఒక్కటే. మరి నౌకలోని వారంతా ఏమైపోయారు? కొందరైనా తీరానికి చేరుకున్నారా? అలా చేరుకున్నవారు అక్కడికి 25 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆరెంజ్‌ నదివైపు వెళ్లి ఉంటారా? ఏది చెప్పడానికీ ఆధారాలు లేవు. వారివేనని చెప్పే ఒక్క సమాధి కూడా లేదు. వారు వాడిన వస్తువులు ఎక్కడా లభించనూ లేదు. ఇప్పటికీ ఇది ఇంకా ఒక పెద్ద రహస్యమే!

ఆ బంగారం ఇప్పుడు ఎవరిది?

నౌకలో భారీగా బంగారం దొరికింది. వాస్తవానికి ఈ నౌక పోర్చుగల్‌ది. కానీ.. దొరికింది మాత్రం నమీబియా భూభాగంలో. ఇలాంటి అంశాల్లో యునెస్కో ఒక పరిష్కారం చూపింది. UNESCO 2001 కన్వెన్షన్ ప్రకారం ఇది నమీబియా ఆస్తిగానే పరిగణించాలి. దీని ప్రకారం పోర్చుగల్‌ కూడా ఈ ఆస్తి, పురా సంపదపై ఎలాంటి క్లెయిమ్‌ దాఖలు చేయలేదు. అద్భుతమైన ఈ సంపద, వస్తువల కోసం నమీబియా ఒక శాశ్వత మ్యూజియం, ఒరాంజెమండ్‌లో మారిటైమ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నమీబియా ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి..

Telangana Middle Class Housing | గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లకు 2,685 దరఖాస్తులు.. ఇదీ మిడిల్ క్లాస్ ఇండ్ల డిమాండ్‌!
Tribal Cultural Revival Explained | మేడారంలో ఆదివాసీ సాంస్కృతిక పునర్జీవనం