పుతిన్ ‘పూప్ సూట్‌కేస్’ రహస్యం… అలాస్కా సమ్మిట్‌లో ఆసక్తికర కథ
అలాస్కా సమ్మిట్‌లో పుతిన్ బాడీగార్డులు వెంట తీసుకెళ్లిన “పూప్ సూట్‌కేస్” వెనుక రహస్యం ఏమిటి? ఆరోగ్య రహస్యాలు కాపాడటమేనా? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ భద్రతా చర్యపై పూర్తి వివరాలు.

అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాడీగార్డులు ఒక విచిత్రమైన బ్యాగును మోసుకెళ్లారు. అది సాధారణ బ్యాగు కాదు. “పూప్ సూట్కేస్” అని పిలిచే ప్రత్యేక బ్యాగ్. ఇందులో పుతిన్ వ్యక్తిగత విసర్జితాలు (హ్యూమన్ వేస్ట్) సేకరించి రష్యాకు తీసుకెళ్లారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ జాగ్రత్త వెనుక ఉద్దేశ్యం పుతిన్ ఆరోగ్య సమాచారం విదేశీ గూఢచార సంస్థలకు దొరకకుండా కాపాడడమే. ఎందుకంటే శరీర వ్యర్థాలను సేకరించి పరీక్షిస్తే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సున్నితమైన వివరాలు తెలిసే అవకాశం ఉందనే భయంతో ఈ చర్య తీసుకుంటారని ఫ్రెంచ్ పత్రిక పారిస్ మ్యాచ్లో జర్నలిస్టులు రెజిస్ జెంటే, మిఖాయిల్ రూబిన్ పేర్కొన్నారు. పుటిన్‌తో పాటు తిరిగే ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ (FPS) బాడీగార్డులు ప్రత్యేక సంచుల్లో ఆ వ్యర్థాలను భద్రపరచి, సూట్‌కేస్‌లో తీసుకెళ్తారని వారు వివరించారు.
ఈ విచిత్రమైన భద్రతా చర్య కొత్తది కాదు. ఇప్పటికే 2017లో ఫ్రాన్స్ పర్యటనలోనూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. వియన్నా పర్యటనలో పుతిన్ పోర్టబుల్ టాయిలెట్ ఉపయోగించినట్లు కూడా జర్నలిస్ట్ ఫరీదా రుస్తమోవా వెల్లడించారు. ఆమె సమాచారం ప్రకారం, 1999లో తన అధికారం ప్రారంభమైనప్పటి నుంచే పుతిన్ ఈ అలవాటును కొనసాగిస్తున్నారట.
ఇకపోతే 72 ఏళ్ల పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. 2023లో కజకిస్తాన్‌లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన కాళ్లు అసంకల్పితంగా కదిలించినట్లు కనిపించడంతో న్యూరాలజికల్ సమస్య ఉందని, పార్కిన్‌సన్స్ డిసీజ్ ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సంవత్సరం బెలారస్ అధ్యక్షుడు లూకషెంకోతో భేటీ సమయంలో కూడా ఆయన కుర్చీలో వణికినట్లు గమనించారని వార్తలు వచ్చాయి. 2022లో పుతిన్ కిందపడి దుస్తులు పాడు చేసుకున్నారని టెలిగ్రామ్ ఛానెల్స్‌లో వచ్చిన రూమర్లను క్రెమ్లిన్ అధికారికంగా ఖండించింది.
అమెరికా పర్యటనలో పుతిన్ బాడీగార్డులు మోసుకెళ్లిన “పూప్ సూట్‌కేస్” ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆరోగ్య ఊహాగానాల మధ్య ఈ జాగ్రత్త వెనుక నిజం ఒకటే – పుతిన్ ఆరోగ్యంపై ఏ సమాచారమూ విదేశాలకు చేరకుండా కాపాడుకోవడం.