Viral News | మూడు నెలల కిందట కోమాలోకి.. మ్యారేజ్‌కు రెండు రోజుల ముందే స్పృహలోకి వచ్చిన పెళ్లి కూతురు!

వైద్యుల నిర్లక్ష్యంతో కోమాలోకి వెళ్లిన ఓ యువతి.. తన పెళ్లికి రెండు రోజుల ముందే స్పృహలోకి వచ్చింది. మూడు నెలల తర్వాత ఆస్పత్రిలో కళ్లు తెరిచిన ఆమె.. తన కోసం ఎదురుచూస్తున్న ప్రియుడిని చూసి భావోద్వేగానికి గురైంది. చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Viral News | మూడు నెలల కిందట కోమాలోకి.. మ్యారేజ్‌కు రెండు రోజుల ముందే స్పృహలోకి వచ్చిన పెళ్లి కూతురు!

Viral News | వైద్యుల నిర్లక్ష్యం ఓ యువతి జీవితాన్ని తారుమారు చేసింది. ప్రేమించిన కుర్రాడిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని కలలు కన్న ఆమెను మంచానికే పరిమితం చేసింది. జలుబు కోసం తీసుకున్న చికిత్స ఆమెను కోమాలోకి నెట్టింది. దాదాపు మూడు నెలల పాటు కోమాలో ఉన్న ఆమె తమ పెళ్లి నిశ్చయించిన తేదీకి రెండు రోజుల ముందే కళ్లు తెరిచి స్పందించడం ఇప్పుడు అందర్నీ భావోద్వేగానికి గురిచేసింది.

తూర్పు చైనాలోని తైయాన్ ప్రాంతానికి చెందిన వాంగ్ రాన్‌రాన్(24) అనే యువతి, జాంగ్ షిరుయ్‌తో ఆరేళ్లు గాఢంగా ప్రేమించుకున్నాడు. తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించి వివాహబంధంతో ఒక్కటవ్వాలని గత ఏడాది చివరలో నిశ్చయించుకున్నారు. ఏప్రిల్ 25వ తేదీన పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యి.. అని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

అయితే ఈ ఏడాది జనవరిలో వాంగ్‌ స్వల్ప అస్వస్థతకు గురైంది. గొంతు నొప్పి రావడంతో సాధారణ జలుబుగా భావించి సమీపంలోని ఓ చిన్న క్లినిక్‌కు వెళ్లింది. అక్కడ వైద్యులు పరిశీలించి, ఒక ఇంజెక్షన్ వేశారు. కానీ ఇంజెక్షన్ వేసిన కొద్ది నిమిషాల్లో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నాలుక నిస్సత్తువగా మారడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమె పెద్దాస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లాక పలు పరీక్షలు చేసిన వైద్యులు ఆసిడోసిస్, శ్వాసకోశ వైఫల్యం వచ్చాయని గుర్తించారు. అలర్జిక్ షాక్ కారణంగా మెదడుకు నాలుగు నిమిషాలకు పైగా ఆక్సిజన్ అందలేదని.. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు.

తన ప్రేయసి కోమాలోకి వెళ్లడానికి కారణం క్లినిక్‌లోని వైద్యులే కారణమని జాంగ్ ఆరోపించారు. గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్లినప్పుడు డైరెక్ట్‌గా ఇంజెక్షన్ ఇచ్చారని తెలిపారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు ఎలాంటి పరీక్షలు చేయలేదని.. మెడికల్ హిస్టరీ గురించి కూడా అడగలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత పరిస్థితి క్షీణిస్తుంటే కనీసం అత్యవసర చికిత్స కూడా చేయలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై జాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తి డాక్టర్ కాదని.. ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన డాక్టర్‌కు కనీస అర్హతలు లేవని తేలింది. దీంతో ఆ క్లినిక్‌ను మూసివేసి, బాధిత కుటుంబానికి సుమారు 2 లక్షల చైనీస్ యువాన్లు పరిహారం చెల్లించిన తర్వాత పరారయ్యారు. కాగా ఇప్పటికే వాంగ్ చికిత్స ఖర్చుల కోసం 7 లక్షల యువాన్ల వరకు ఖర్చు చేశామని జాంగ్ తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యంతో తమ జీవితం చిన్నాభిన్నమైందని బాధపడుతున్న ఈ సమయంలో వాంగ్ ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. 92 రోజుల తర్వాత, తమ పెళ్లి నిశ్చయించిన తేదీకి రెండు రోజుల ముందు.. అంటే ఏప్రిల్ 23న వాంగ్ స్పృహలోకి వచ్చింది. కళ్లు తెరవగానే తన కోసం తాపత్రాయపడుతున్న జాంగ్‌ను చూసి భావోద్వేగానికి గురైంది. అయితే వాంగ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. కదిలే, మాట్లాడే స్థితిలో లేదని వైద్యులు వెల్లడించారు. అయినప్పటికీ వాంగ్ స్పృహలోకి రావడం తమలో ఎంతో ధైర్యం నింపిందని జాంగ్ తెలిపారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌‌మీడియాలో వైరల్‌గా మారింది.

Read More:

ఇదేం పోయేకాలం.. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో శ్మశానంలో పెళ్లి చేసుకున్న జంట!

నన్ను చదువుకోమంటే.. మీ స్కూల్ కూల్చేస్తా.. టీచర్‌కే వార్నింగ్ ఇచ్చిన పిల్లాడు..!