Humanoid Robot | సాధారణ మనిషిలాగే విమానం ఎక్కి వెళ్లిన రోబో.. అమెరికాలో విచిత్ర ఘటన!
Humanoid Robot | అమెరికాలో ఓ హ్యూమనాయిడ్ రోబో సాధారణ మనిషిలాగానే విమానం ఎక్కి తన గమ్యస్థానానికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రోబో కారణంగా విమానం ఓ గంట ఆలస్యంగా బయల్దేరాల్సి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Humanoid Robot | అమెరికాలో ఓ హ్యూమనాయిడ్ రోబో సాధారణ మనిషిలాగానే విమానం ఎక్కి తన గమ్యస్థానానికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్ నుంచి శాన్ డియాగోకు ఒంటరిగా ప్రయాణించిందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోబో కారణంగా విమానం ఓ గంట ఆలస్యంగా బయల్దేరాల్సి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. డల్లాస్‌కు చెందిన ‘ఎలైట్ ఈవెంట్ రోబోటిక్స్’ సంస్థ రూపొందించిన ‘బీబాప్’ అనే హ్యూమనాయిడ్ రోబోను ఒక ప్రదర్శన కోసం తరలించాల్సి ఉంది. అయితే ఆ రోబో దాదాపు 32 కిలోల బరువు ఉండటంతో దాన్ని సాధారణ లగేజీలా పంపించడానికి వీలుకాలేదు. దీంతో సంస్థ సిబ్బంది దానికి విమానంలో ప్రత్యేకంగా ఒక సీటును బుక్ చేశారు. బీబాప్ రోబోను సాధారణ ప్రయాణికుడిలా ఒక సీటులో కూర్చోబెట్టి, సీట్ బెల్ట్ పెట్టి గమ్యస్థానానికి పంపించారు.
అయితే విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో విమాన సిబ్బంది సదరు బీబాప్ హ్యూమనాయిడ్ రోబోపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అందులో ఉపయోగించిన లిథియం బ్యాటరీల గురించి ఆరా తీశారు. విమాన భద్రతా నియమాల ప్రకారం లిథియం బ్యాటరీల పరిమాణం, సామర్థ్యంపై కఠిన నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను అతిక్రమించి రోబో బ్యాటరీ సామర్థ్యం ఉండటంతో బ్యాటరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి గంటకు పైగానే సమయం పట్టింది. విమాన ప్రయాణం ఆలస్యం కావడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘రోబోలో ఉన్న లిథియం బ్యాటరీ విమాన ప్రయాణ నిబంధనలకు అనుగుణంగా లేదు. భద్రత దృష్ట్యా దాన్ని తొలగించాల్సి వచ్చింది. అందుకే విమానం బయల్దేరడానికి ఆలస్యం జరిగింది. ‘ అని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తన ప్రకటనలో తెలిపింది.
కాగా, ఒక హ్యూమనాయిడ్ రోబో విమానంలో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించిందనే వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘రోబోకు ఫస్ట్ క్లాస్ టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది’ అని ఒకరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. ‘ఈ రోబోలు ముందు మన ఉద్యోగాలు తీసుకున్నాయి. ఇప్పుడు మన సీట్లు కూడా లాక్కుంటున్నాయి’ అని మరొకరు కామెంట్ చేశారు.
అయితే, రోబోను విమానంలో పంపించడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. రోబోలను తరలించేందుకు అనేక మార్గాలు ఉంటాయని.. కానీ ప్రత్యేకంగా విమానంలో టికెట్ తీసుకొని పంపించడం అనేది కేవలం పబ్లిసిటీ కోసమే అని అభిప్రాయపడ్డారు.
Read More:
Viral Video | తలలో కత్తి దిగినా తాపీగా ఫోన్ చూసుకుంటూ హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. వీడియో వైరల్
మూడు నెలల కిందట కోమాలోకి.. మ్యారేజ్‌కు రెండు రోజుల ముందే స్పృహలోకి వచ్చిన పెళ్లి కూతురు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram