పింఛన్ కోసం కుర్చీ ఊతకర్రగా వృద్ధురాలి తిప్పలు

కుర్చీని ఊతకర్రగా చేసుకుని పోస్టాఫీస్‌కు వచ్చిన వృద్ధురాలు – సూర్యాపేటలో పింఛన్ కోసం పడిన తిప్పలు వైరల్. ఫేస్ రికగ్నైజేషన్‌పై విమర్శలు.

పింఛన్ కోసం కుర్చీ ఊతకర్రగా వృద్ధురాలి తిప్పలు

విధాత : పింఛన్ డబ్బుల కోసం వృద్దులు పడుతున్న తిప్పలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో పింఛన్ కోసం ఓ వృద్ధురాలు తన నివాసం నుంచి పోస్టాఫీస్ కు వెళ్లేందుకు నానా పాట్లు పడింది. సరిగా నిలుచులేని నడుం వంగిపోయిన వృద్ధురాలు రోడ్డుపై ఓ కుర్చీని ఊతకర్రగా చేసుకుని పోస్టాఫీస్ వద్దకు పింఛన్ కోసం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. పింఛన్ కోసం వృద్దులు పడుతున్న ఇబ్బందులకు ఈ ఘటన ఓ నిలువెత్తు నిదర్శనమని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానాన్ని తొలగించి, ఫేస్‌ రికగ్నైజేషన్‌కు తీసుకురావంతో ముఖం స్కాన్‌ అవ్వక కూడా రోజంతా పోస్టాఫీసు వద్దే పడిగాపులు కాయాల్సి వసున్నదని దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో వారం రెండు వారాల పాటు పింఛన్ ఇచ్చేవారని..ఇప్పుడు మూడు నాలుగు రోజులే ఇస్తుండటం కూడా సమస్యగా తయారైందంటున్నారు. వృద్ధులకు ఇళ్లకు వెళ్లి పింఛన్ ఇచ్చే విధానం అమలు చేస్తే బాగుంటుందన్నారు.