ఓట్ల కోసం హిందువులను బీజేపీ భయపెడుతున్నదా?

మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా భారత్‌ ఎదిగిందని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకొన్నారు. దీనికి ప్రధాని నాయకత్వమే కారణమని కీర్తించారు

ఓట్ల కోసం హిందువులను బీజేపీ భయపెడుతున్నదా?

కొత్తగా మోదీ ప్రసంగంలోకి పాకిస్థాన్‌
దానితోపాటే సర్జికల్‌ స్ట్రయిక్స్‌, తాజాగా గోధ్రా
పదేళ్లలో ఏం చేశారో చెప్పని కమలనాథులు
విమర్శలతో ఎదురుదాడికే ప్రసంగాలు పరిమితం!

(విధాత ప్రత్యేకం)

మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా భారత్‌ ఎదిగిందని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకొన్నారు. దీనికి ప్రధాని నాయకత్వమే కారణమని కీర్తించారు. మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, కనుక బలమైన నేత అయిన మోదీకే పట్టం కట్టాలని ఎన్నికల ముందు వరకు ఊదరగొట్టారు. రెండు దశల పోలింగ్‌ ముగిసి గతం కంటే తక్కువ పోలింగ్‌ నమోదు కావడంతోపాటు, ప్రధాని సహా ఆ పార్టీ నేతలు చేస్తున్న భావోద్వేగ ప్రచారానికి ప్రజలు పెద్దగా స్పందించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యయి. వీటిని బేరీజు వేసుకున్న తర్వాత ఈసారి ఫలితాలు ఆశాజనకంగా ఉండవనే అంచనాకు కమలనాథులు వచ్చి ఉంటారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నది. అందుకే రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి దాయాది దేశం పాకిస్థాన్‌ తహతహలాడుతున్నదని కొత్త పాట మొదలుపెట్టారని అంటున్నారు.

ప్రధాని స్థాయికి తగునా?

నిజానికి పాకిస్థాన్‌ తన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను చక్కదిద్దుకునే పరిస్థితిలో లేదు. ఇలాంటి స్థితిలో భారతదేశ ఎన్నికల రాజకీయాలను పాకిస్తాన్‌ శాసిస్తుందనే విధంగా మోదీ మాట్లాడటం.. ఆయనలోని ఆందోళనకు అద్దంపడుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘గతంలో ఉగ్రదాడుల తర్వాత కాంగ్రెస్‌ నేతృత్వంలోని పిరికి ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై పెడబొబ్బలు పెట్టేది. కానీ ఇప్పడు ఆ రోజులు పోయాయి. మన సర్జికల్‌ స్ట్రైక్స్‌తో అల్లాడిపోయిన దాయాది దేశం సహాయం కోసం ఏడుస్తూ కేకలు పెడుతున్నది. అది మా ప్రభుత్వం ఘనత’ అని గొప్పగా చెప్పుకొనే ప్రయత్నం చేశారు.

అలాంటి ప్రధాని భారతదేశాన్ని తక్కువ చేసే విధంగా గతంలో ఏ ప్రధాని చేయని విధంగా పాకిస్థాన్‌ లాంటి దేశం భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నదని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల వల్ల కేంద్రంలోని ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నదని భావించి బీజేపీకి సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టారు. రెండోసారి అంతేకంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. కానీ ప్రజలు నమ్మకాలను మోదీ వమ్ము చేశారనే వాదనలున్నాయి. అవి నిజమే అన్నట్టు బీజేపీ నేతల వ్యాఖ్యలుంటున్నాయి. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు చూసి జనాలకు విసుగు వస్తున్నదంటే అతిశయోక్తి కాదు.

పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఏం చేశామో చెప్పకుండా ఇంకా సాధారణ ఎన్నికలు మొదలు ఉప ఎన్నికల వరకు పాకిస్థాన్‌ జపం చేసి, జనాలను రెచ్చగొట్టేలా ప్రధాని సహా ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారంటే వాళ్లు పదేళ్లలో చేసింది ఏమీ చేయలేదని పరోక్షంగా అంగీకరించినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తమ మ్యానిఫెస్టోలో జిజియా పన్ను (వారసత్వ సంపదప పన్ను), గోవధ గురించి ప్రస్తావించింది. ఇది మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు క్రూర పాలనను తలపింపజేస్తున్నదని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ హయాంలో శాంతిభద్రతలను కాపాడటానికి బుల్జోజర్ల అవసరం రాలేదని ఆదిత్యనాథ్‌ పరిపాలనపై నాలుగు రోజుల కిందట సెటైర్‌ వేసింది ఇందుకోసమే కదా!

పాకిస్థాన్‌, గోధ్రా ప్రస్తావన వెనుక!

బీహార్‌, జార్ఖండ్‌ సభల్లో ప్రధాని మోదీ 2002 నాటి గోధ్రా రైలు దమనకాండ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. నాటి ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేయాలని నాటి ప్రధాని వాజపేయి అన్నది నిజం కాదా? ఇదే మోదీకి వాజపేయి రాజధర్మాన్ని బోధించింది వాస్తవం కాదా? ఇంకా మతం, పాకిస్థాన్‌ అంశాల ఆధారంగానే ఓట్లు అడుక్కునే స్థితికి బీజేపీ దిగజారడటం దేనికి సంకేతం? అని వారు ప్రశ్నిస్తున్నారు. సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో ఏం చేసిందో తెలుసు. మొదటి రెండు దశల పోలింగ్ తర్వాత మూడ్‌ ఆఫ్‌ నేషన్‌ ఈసారి అధికారపార్టీకి వ్యతిరేకంగా ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ శశి థరూర్‌ పీటీఐ వార్తా సంస్థ సంపాదకులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్నది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అలాంటి ప్రభుత్వాలు ఏర్పడితే ప్రధాని పదవిని ఎవరు చేపట్టినా నిరంకుశ నిర్ణయాలు ఉండవన్నారు. సంకీర్ణ సర్కారుల హయాంలోనే దేశ ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉందన్నారు. దీనికి మాజీ ప్రధానులు వాజపేయి, మన్మోహన్‌ నేతృత్వంలోని ప్రభుత్వాల పాలనను, నిర్ణయాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఇవి ఆలోచించే విధంగా ఉన్నాయి.

ప్రజలు కోరుకుంటున్నదేంటి?

ఎందుకంటే మోదీ ప్రభుత్వం రెండుసార్లు సంపూర్ణ మెజారిటీ ఇస్తే నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చింది. అన్ని రాష్ట్రాల, ప్రజల అభిప్రాయలను పరిగణనలోకి తీసుకోకుండా సీఏఏను అమలు చేస్తామని ప్రకటించింది. ఒక ముస్లింలకు తప్పా ఇతర దేశాల్లోని ఇతర మతాల వారికి పౌరసత్వం ఇస్తామని చెబుతున్నది. ఇదంతా ముస్లింలను బూచిగా చూపెట్టి హిందువులను భయపెట్టి ఓట్లు రాబట్టుకునే ఎత్తుగడగా కనిపిస్తున్నదని చెబుతున్నారు. ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదని, పారదర్శకమైన, చట్టబద్ధమైన పాలనను మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే రెండుసార్లు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి సమస్యలను కోరితెచ్చుకున్న ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నట్టు తెలుస్తోందని వారు అంచనా వేస్తున్నారు.