BRS | 23 ఏళ్ల తర్వాత ఒక్క లోక్‌సభ ఎంపీలేని బీఆర్‌ఎస్‌

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27 న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్నడూ లేనివిధంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూసింది.

BRS | 23 ఏళ్ల తర్వాత ఒక్క లోక్‌సభ ఎంపీలేని బీఆర్‌ఎస్‌

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27 న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్నడూ లేనివిధంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూసింది. 2001 నుంచి 2014 వరకు ఆ పార్టీ ఎన్నో ఉత్థానపతనాలు చవిచూసింది. అయినా ప్రజల ఎన్నడూ ఈసారి ఎన్నికల్లో వలె తిరస్కరించలేదు. 2004లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేసిన ఆపార్టీ 6.83 శాతం ఓట్లతో 5 ఎంపీ సీట్లను గెలుచుకున్న ది.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై నాన్చుడు ధోరణని అవలంబిస్తున్నదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బైటికి వచ్చింది. అప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం. సత్యనారాయణ రావు విసిరిన సవాల్‌ స్వీకరించిన కేసీఆర్‌ ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి 2 లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందారు. మళ్లీ 2008లో మరోసారి రాజీనామా అస్త్రాన్ని సంధించిన కేసీఆర్‌ ఆ పార్టీ తరఫున ఎన్నికైన 16 మంది ఎమ్మెల్యేలతో 4 గురు ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు. 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడింటిని, నాలుగు లోక్‌సభ సెగ్మెంట్లలో రెండు స్థానాలను మాత్రమే బీఆర్‌ఎస్ నిలబెట్టుకుంది.

2009లో రెండు స్థానాలకే పరిమితం

2009లో మహాకూటమితో జతకట్టింది. తరచూ ఉప ఎన్నికలకు వెళ్లడం, మహాకూటమి అజెండాలో తెలంగాణ ప్రధాన అంశం కాకపోవడం వంటి కారణాలతో తొమ్మిది పార్లమెంటు స్థానాలు పోటీ చేసి రెండు పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకున్నది. 2004 నుంచి 2009 వరకు కేసీఆర్‌ వ్యవహారశైలి కూడా లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపింది. మహబూబ్‌నగర్‌ నుంచి కేసీఆర్, మెదక్‌ నుంచి విజయశాంతి గెలుపొందారు. కేసీఆర్‌ పాలమూరు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

2014లో గణనీయంగా 11 సీట్లు గెలుచుకున్నబీఆర్‌ఎస్‌

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేసిన బీఆర్‌ఎస్‌ మెజారిటీ స్థానాలను దక్కించుకున్నది. 17 స్థానాలకు పోటీ చేసి 34.94 శాతం ఓట్లతో 11 సీట్లను తన ఖాతాలో వేసుకున్నది. ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్, భువనగిరి, వరంగల్‌, మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేసింది. రెండు జాతీయపార్టీలను కాదని 2014లోనూ కేసీఆర్‌ నాయకత్వానికే ఓటర్లు జైకొట్టారు. కొత్త రాష్ట్రం కాబట్టి మన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవాలన్నా బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్న ఆయన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు.

2019లో

అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్‌ఎస్‌కు ఓటర్లు 88 స్థానాలు కట్టబెట్టారు. 2014 కంటే ఎక్కవ సీట్లు గెలుచుకుంటామని బీరాలు పలికిన బీఆర్‌ఎస్‌ అధినేతకు 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ షాక్‌ ఇచ్చారు. 41.71 శాతం ఓట్లతో 9 స్థానాలకే పరిమితమైంది. వీటిలో స్వయంగా కేసీఆర్‌ కూతురు నిజామాబాద్‌లో, బీఆర్‌ఎస్‌ పుట్టినప్పుటి నుంచి కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత వినోద్‌కుమార్‌ను ఓడించారు. కేసీఆర్‌ ఒంటెద్దు పోకడ దీనికి కారణమనే విమర్శలున్నాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ నాటికి బీఆర్‌ఎస్‌ ప్రభావం మసకబారింది. జహీరాబాద్‌, చేవెళ్ల, సిట్టింగ్‌ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. వరంగల్‌ కడియం శ్రీహరి కూతురు డాక్టర్‌ కావ్యకు టికెట్‌ ఇచ్చినా నిరాకరించారు. బీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగినా ఓటమి తప్పదని బీజేపీ లేదా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడం నయమనుకున్నారు. అందుకే చాలామంది అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొన్నది. అయితే ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పినట్టు బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదన్న అంచనాలే నిజమయ్యాయి.

మొత్తం 17 స్థానాలలో ఖమ్మం, మహబూబాబాద్‌లో మినహా మిగిలిన 15 చోట్ల మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. 2019లో నిజామాబాద్‌, కరీంనగర్‌లు కోల్పోవడం, తాజాగా 2024 లో కేసీఆర్‌, హరీశ్‌ రావులు ప్రాతనిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలున్న మెదక్‌ కూడా చేజారడం బీఆర్‌ఎస్‌ కోలుకోలేని దెబ్బే. కాళేశ్వరం, ఫొన్‌ ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కూతురు కవిత అరెస్టు కావడం వంటి ఆపార్టీని బాగా దెబ్బతీశాయి.

బీఆర్‌ఎస్‌ గౌరవప్రదమైన ఓటమిని, ఒకటి రెండు సీట్లతో ఆ పార్టీని గట్టెక్కించడానికి కేసీఆర్‌ బస్సు యాత్ర చేపట్టినా ఓటర్లు మూడో స్థానానికే పరిమితం చేశారు. దీనికి కారణం కాంగ్రెస్‌ అడ్డుకోవడం కోసం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో లోపాయీకారీ ఒప్పందం చేసుకున్నారన్న కాంగ్రెస్‌ ఆరోపణలను ఓటర్లు విశ్వసించినట్టు కనిపిస్తున్నది. అలాగే కూతురును కాపాడుకోవడం కోసం బీఆర్‌ఎస్‌ను బలిపెట్టారన్న వాదన కూడా ఉన్నది. పార్టీ పెట్టినప్పటి నుంచి 23 ఏళ్లలో లోక్‌సభలో ఒక్క ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం.

లోక్‌స‌భ 2024 ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూసామ‌ని అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్నమ‌న్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతి పెద్ద గౌరవం.ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం

2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018లో 88 స్థానాలతో రెండవసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నాం. ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కచ్చితంగా నిరాశను కలిగించాయి అన్నారు. అయినా ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్నవిశ్వాసం ఉన్నది ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంద‌న్నారు.