Uganda’s Chimpanzee Civil War: Largest Wild Group Splits Into Deadly Rivals
హైలైట్స్:
- • ఒకే కుటుంబంలా ఉన్న చింపాంజీలు రెండు వర్గాలుగా
- • కలిసి జీవించినవారే పరస్పర దాడులు
- • స్నేహం నుంచి శత్రుత్వం వరకు
- • ఇలాంటి విభజన 500 ఏళ్లకు ఒకసారి మాత్రమే
హైదరాబాద్, ఏప్రిల్ 13, 2026:
ఉగాండాలోని కిబాలే జాతీయ వనం(Kibale National Park) లోని ఎన్‌గోగో (Ngogo) అడవులు ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టిలో ఒక భయంకరమైన యుద్ధభూమిగా మారాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చింపాంజీ సమూహం—దాదాపు 200 చింపాంజీలతో ఉన్న ఈ సమాజం, ఒకే కుటుంబంలా జీవిస్తూ వచ్చి, ఒక్కసారిగా రెండు వైరి వర్గాలుగా విడిపోయి… కుటుంబసభ్యులే ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరుకుంది.
30 ఏళ్లుగా చింపాంజీల జీవన విధానాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు తాజాగా ఈ దిగ్భ్రాంతికర సంఘటనను బయటపెట్టగా, ఈ అధ్యయనం ఏప్రిల్ 9న ప్రముఖ శాస్త్రీయ జర్నల్ Scienceలో ప్రచురితమైంది.
సఖ్యత నుంచి విభజన వరకు… క్రమంగా పెరిగిన దూరం

గుంపుగా కూర్చున్న చింపాంజీలు – ఒకే కుటుంబంగా ఉన్నప్పుడు..
గతంలో ఈ చింపాంజీలు ఒకే సమాజంలా, విడిపోతూ, కలిసిపోతూ సామరస్యంగా జీవించేవి. కానీ 2015 తర్వాత పరిస్థితి మారింది. పశ్చిమ (Western), మధ్య (Central) అనే రెండు గ్రూపుల మధ్య దూరం పెరిగింది. మొదట కొంత కొంత దూరంగా మెలిగినా, తర్వాత పూర్తిగా దూరమయ్యాయి. 2018 నాటికి రెండు బృందాలుగా స్థిరపడ్డాయి.
తరువాత నుండి ఈ రెండు గ్రూపులు వేర్వేరు ప్రాంతాల్లో నివసించడం, ఆహారం కోసం కూడా వేర్వేరుగా తిరగడం, సంతానోత్పత్తి కూడా తమ తమ గ్రూపులకే పరిమితం కావడం ప్రారంభమైంది. ఒకే చోట తింటూ, తినిపిస్తూ, ఆనందంగా జీవించిన ఇవి ఇప్పుడు శత్రు వర్గాలుగా మారడం, శాస్త్రవేత్తలను కలవరపరిచింది.
చీలిక తర్వాత రక్తపాతం… గ్రూపుల మధ్య చెలరేగిన హింస

దాడి స్వభావాన్ని చూపుతున్న చింపాంజీ – ఘర్షణలకు సంకేతం
విడివిడిగా జీవించడంతో మొదలైన ఈ దూరం, కొద్దికాలంలోనే హింసగా మారింది. చిన్నదైన పశ్చిమ గ్రూప్, పెద్ద సెంట్రల్ గ్రూప్‌పై దాడులు ప్రారంభించింది. 2018 నుంచి 2024 వరకు కనీసం 7 పెద్ద మగ చింపాంజీలు, 17పిల్లలు ఈ హింసకు బలయ్యాయి. ఈ దాడుల్లో కొన్ని సందర్భాల్లో పాత మిత్రులనే లక్ష్యంగా చేసుకోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అదనంగా, మరికొన్ని చింపాంజీలు అదృశ్యమవ్వడం వల్ల అసలు మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఆరొన్ సాండెల్(Aaron Sandel) మాట్లాడుతూ, చింపాంజీలు తమ పాత కుటుంబసభ్యులనే చంపడం అత్యంత ఆశ్చర్యకరమని తెలిపారు. ఈ సమూహం గతంలో నెట్‌ఫ్లిక్స్ చిత్రీకరించిన Chimp Empire డాక్యుమెంటరీలో కూడా కనిపించడం విశేషం.
ఎందుకు విడిపోయాయి?.. శాస్త్రవేత్తల విశ్లేషణ

సరదాగా ఆడుకుంటున్న చింపాంజీలు – యుద్ధానికి ముందు ఉన్న స్నేహభరిత దశ
ఈ సంఘటన వెనుక అనేక కారణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
సమూహం అసాధారణంగా పెద్దది కావడం (30కి పైగా మగ చింపాంజీలు ఉండటం) వల్ల సామాజిక సంబంధాలను నిలబెట్టుకోవడం కష్టమైంది. 2014లో ఐదు కీలక మగ చింపాంజీలు మరణించడం వల్ల గ్రూపుల మధ్య వారధిగా ఉన్న బంధాలు తెగిపోయాయి.
2015లో మొత్తం బృందానికి నాయకత్వం వహించే అధినేత ఆల్ఫా మేల్(Alpha Male) మారడం, 2017లో శ్వాసకోశ వ్యాధి కారణంగా దాదాపు 25 చింపాంజీలు మరణించడంతో సమూహంలో అస్థిరతను పెంచాయి. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా, ఒకప్పుడు బలంగా ఉన్న పరస్పర సంబంధాలు క్రమంగా బలహీనపడి… చివరకు పూర్తిగా తెగిపోయాయి.
శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, చింపాంజీల్లో ఇలాంటి శాశ్వత విభజనలు అత్యంత అరుదు. దాదాపు 500 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతాయి.
మనుషుల యుద్ధాలకూ వేరే కారణాలున్నాయా? కొత్త కోణం?

చిన్న చింపాంజీతో మమకారంగా వ్యవహరిస్తున్న పెద్దది – కుటుంబ బంధాల ప్రతిబింబం
చింపాంజీల డిఎన్ఏ మనుషుల డిఎన్ఏతో 98.8% పోలిఉంటుంది. అయితే వాటిలో మతం, జాతి, రాజకీయాలు వంటి భావనలు ఉండవు. అయినప్పటికీ, కేవలం సామాజిక సంబంధాల మార్పు వల్లే ఇలాంటి హింసాత్మక విభజన చోటుచేసుకుంది.
ఇది మనుషుల సమాజంలో జరుగుతున్న అంతర్గత ఘర్షణలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. మనం భావించేలా యుద్ధాలకు ప్రధాన కారణాలు మతం, జాతి మాత్రమేనా? లేక వాటి వెనుక మరింత ప్రాథమికమైన, సంబంధాల విభజన, నమ్మకం కోల్పోవడం వంటి అంశాలున్నాయా?
చిన్న చిన్న సంబంధాలను బలపరచడం, సమన్వయం పెంచడమే ఈ రెండు గ్రూపుల మధ్య శాంతికి మార్గం కావచ్చని ఆరొన్ సాండెల్ అభిప్రాయపడ్డారు.
ఉగాండా అడవుల్లో జరిగిన ఈ చింపాంజీల అంతర్యుద్ధం కేవలం జంతువుల కథ కాదు. ఇది మనుషుల సమాజానికి ఒక హెచ్చరిక. ఒకే కుటుంబంలా ఉన్న సమాజం, సంబంధాల వైఫల్యంతో ఎలా చీలిపోతుందో ఇది తెలియజేస్తోంది. అదే సమయంలో, శాంతి కూడా చిన్న చిన్న సంబంధాలతోనే మొదలవుతుందని కూడా గుర్తు చేస్తోంది.