రేవంత్ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిందా? ర‌ద్దు చేయించుకున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో అసమ్మతి రాగం ఊపందుకుంటున్న సమయంలో గ్యాప్‌ ఇవ్వడం అంటే అసలుకే మోసం తెస్తుందని నిఘా వర్గాల సూచన ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చర్చించుకుంటున్నారు. ఆరెస్సెస్‌లోని ఒక కీలక నేత సహకారంతో కేంద్రమే పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పించారని తెలుస్తున్నది.

(విధాత ప్రత్యేకం)

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న అర్ధాంతరంగా ర‌ద్దు కావ‌డంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ప‌లు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి విదేశీ ప‌ర్య‌ట‌న గురించి కేంద్రానికి అప్ప‌టిక‌ప్పుడే సమాచారాలు అందటం ఏమీ ఉండదు. 15 రోజుల ముందే రేవంత్‌ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న గురించి కేంద్రానికి తెలుసు. ఆ మేరకు రాష్ట్ర అధికారులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో లండన్‌ పర్యటనకు అనుమతి వచ్చింది కానీ.. అమెరికాకు మాత్రం నో చెప్పారు. రేవంత్ రెడ్డి లండ‌న్‌లో ఉన్న సమయంలో అమెరికా ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ అనేది న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని టీ కాంగ్రెస్ నేత‌లే బాహాటంగా చ‌ర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి పీఠానికి ఎస‌రు పెట్టే విధంగా తెలంగాణ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అవుతున్నాయని, ఈ సమయంలో గ్యాప్ ఇవ్వ‌డం అస‌లుకే మోసం అని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఉప్పందించాయ‌ని తెలుస్తున్నది. నిఘా వర్గాల సంకేతాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరెస్సెస్‌లో ప్ర‌ముఖ నాయ‌కుడిగా ఉన్న త‌న స్నేహితుడి ద్వారా సంప్రదింపులు చేయించుకుని, ఫలితంగానే కేంద్రం రేవంత్‌ రెడ్డి పర్యటనను రద్దు చేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఊపందుకుంటున్న అసమ్మతిరాగం

తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా అస‌మ్మ‌తి రాగం ఊపందుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా, బ‌హిరంగంగా రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక‌వైపు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, మ‌రోవైపు కొండా సురేఖ కుమార్తె, ఇంకోవైపు సీనియ‌ర్ నేత జీ చిన్నారెడ్డి బాహాటంగా అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారు. అధిష్ఠానం ఇస్తున్న షోకాజ్ నోటీసులను కూడా లెక్క‌చేయ‌డం లేదు. కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో త‌న బ‌లం నిరూపించుకునే ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి 40 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేల‌ను కూడ‌గ‌ట్టి ప్రెస్‌మీట్ పెట్టేందుకు పురికొల్పారని సమాచారం. కానీ.. ప‌ట్టుమ‌ని ప‌ద‌హారు మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. వీరిలో సబ్జెక్ట్‌ ఏంటో తెలియకుండా వచ్చినవాళ్లు ఏడెనిమిది మంది ఉండొచ్చ‌ని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆ సాయంత్ర‌మే వారంతా మ‌రో సీనియ‌ర్ నేత‌, తెలంగాణ త‌దుప‌రి సీఎం అని ప్ర‌చారం సాగుతున్న ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని క‌లిసినట్టు సమాచారం. తమకు ముందుగా విషయం తెలియదని, అక్కడికి వెళ్లిన తర్వాత విషయం తెలిసిందని సదరు ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి సంజాయిషీ ఇచ్చారని తెలుస్తున్నది. ఇది చెప్పేందుకే ఉత్తమ్‌ దగ్గరకు వెళ్లారని గాంధీ భవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సీనియర్‌ నేతలకు సంకేతాలు?

రేవంత్‌ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పటికే పెద్ద సంఖ్యలో అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తున్నది. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అంశం కొంతకాలంగా పార్టీ నేతల చర్చల్లో నానుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లోపే మార్పు ఖాయమని అధిష్ఠానం నుంచి కొందరు సీనియర్‌ నాయకులకు సంకేతాలు అందినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి వర్గం నాయకులు రేవంత్‌ రెడ్డిని బాహాటంగా టార్గెట్‌ చేస్తున్నారనే ప్రచారం సాగుతున్నది. అధిష్ఠానం సమ్మతితోనే రేవంత్‌ వ్యతిరేక వర్గం రెచ్చిపోతున్నదనే అనుమానాలను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే విధంగా కాకుండా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ప్రజలు భయపడేలా పాలన సాగిస్తున్నారనే అభిప్రాయాలు సొంత పార్టీ నేతల్లో బలంగా ఉన్నాయి. దీనికి 22ఏ వివాదం ఒక కారణంగా చూపుతున్నారు. దానితోపాటు ఆయన వచ్చే ఎన్నికల్లోపే పార్టీ మారే అవకాశాలు కొట్టిపారేయలేమన్న వాదనలూ చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే బంధంతో ఆరెస్సెస్‌ ప్రముఖుడితో తన పర్యటన రద్దుకు గుట్టుగా సాయం పొందారనే గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

Latest News