Punjab Lok Sabha elections | పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ మధ్యే పోటీ

లోక్‌సభ ఎన్నికల సమరాంగణం ముగింపునకు వస్తున్నది. ఏడు దశల పోలింగ్‌లో భాగంగా శనివారం ఆరో విడత ఎన్నికలు ముగియగా.. ఇక చిట్టచివరి విడతలో జూన్‌ 1న 8 రాష్ట్రాలు/యూటీలలోని 57 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Punjab Lok Sabha elections | పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ మధ్యే పోటీ

హిమాచల్‌లో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ
బీజేపీకి జాట్‌ల ఆందోళన సవాలు
ఆసక్తికరంగా చివరి విడత పోలింగ్‌
జూన్‌ 1తో ముగియనున్న సమరం

(విధాత ప్రత్యేకం)

లోక్‌సభ ఎన్నికల సమరాంగణం ముగింపునకు వస్తున్నది. ఏడు దశల పోలింగ్‌లో భాగంగా శనివారం ఆరో విడత ఎన్నికలు ముగియగా.. ఇక చిట్టచివరి విడతలో జూన్‌ 1న 8 రాష్ట్రాలు/యూటీలలోని 57 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. వీటిలో బీహార్‌ (8), హిమాచల్‌ప్రదేశ్‌ (4), జార్ఖండ్‌ (3), ఒడిషా (6), పంజాబ్‌ (13), యూపీ (13), పశ్చిమ బెంగాల్‌ (9) చండీగఢ్‌ (1) స్థానాలకు ఎన్నికలు జరగనున్నది. వీటిలో పంజాబ్‌, హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరుగుతున్నది. ఈ రెండు రాష్ట్రాలలో గత ఎన్నికల్లో హిమాచల్‌లో కాషాయపార్టీ క్లీన్‌ స్వీప్‌ చేయగా.. పంజాబ్‌లో కాంగ్రెస్‌ 8, బీజేపీ 2, శిరోమణి అకాలీదళ్‌ 2, ఆప్‌ 1 స్థానం గెలుచుకున్నాయి.

హిమాచల్‌లో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ

ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉన్నది. హిమాచల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ నాలుగు స్థానాలనూ చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నది. ఆ రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అక్కడి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడేలా బీజేపీ ప్రోత్సహించిందనే ఆరోపణలు ఉన్నాయి. సంఖ్యా బలం లేకున్నా పోటీ కి నిలబడింది. ఆ తర్వాత ఆ పార్టీ వాళ్లే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మెజారిటీ లేదని కూలదోసేలా ప్రయత్నం చేసింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం వెంటనే రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పార్టీ ఫిరాయించిన వాళ్లపై స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. దీంతో బీజేపీ పాచిక అక్కడ పనిచేయలేదు.

అనర్హత పడిన ఆరు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలతో పాటు నాలుగు లోక్‌సభ స్థానాలకు జూన్‌ 1న పోలింగ్‌ జరగనున్నది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌, సీనియర్‌ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వలె లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా నేతలంతా ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. దీంతో గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన కమలనాథులు ఇప్పుడు వాటిని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పంజాబ్‌లో బీజేపీ, అకాలీదళ్‌లది అస్తిత్వ పోరాటమే

పంచ నదుల రాష్ట్రంగా పేరొందిన పంజాబ్‌ రాష్ట్రంలో ఈసారి పోటీ ఆసక్తిగా ఉన్నది. ఈ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 30 శాతానికి పైగా ఎస్సీ జనాభా ఉంటుంది. దీంతో ఇక్కడ బీఎస్పీ ప్రభావం కూడా ఉంటుంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో అకాలీదళ్‌ ఉన్నప్పుడు భారీ విజయాలు సాధ్యమయ్యాయి. కానీ ఈసారి విడిగా పోటీ చేస్తుండటంతో ఆపార్టీలకు అంత అనుకూల పరిస్థితి లేదు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ కు ముందు ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో బెంగాల్‌లో టీఎంసీ, ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌తో సఖ్యత కుదరలేదు. మమతా ఒంటరిగా పోటీచేయడంలో, జేడీయూను ఇండియా కూటమి నుంచి బైటికి తీసుకురావడంతో బీజేపీ నేతలు సఫలమయ్యారు. దీన్నే కారణంగా చూపెట్టి కూటమి విచ్చిన్నం కోసం బీజేపీ ప్రయత్నం చేసింది. అయితే ఆప్‌, కాంగ్రెస్‌ చర్చల ద్వారా సీట్ల సర్దుబాటు అంశాన్ని పరిష్కరించుకున్నాయి.

పంజాబ్‌, ఢిల్లీలలో ఆప్‌ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య అంగీకారం కుదరడంతో ఢిల్లీలో ఆప్‌ 4, కాంగ్రెస్‌ 3 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇదే సమయంలో పంజాబ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వాలు విడిగా పోటీ చేయడానికే మొగ్గు చూపాయి. రెండుపార్టీల రాష్ట్ర నాయకుల విజ్ఞప్తి మేరకు విడిగానే పోటీ చేస్తున్నాయి. స్నేహపూర్వక పోటీగానే ఇరు పార్టీల అధిష్ఠానాలు చూస్తున్నాయి. ఏడు ఎనిమిది స్థానాల్లో చతుర్ముఖ పోటీ ఉంటుంది అంటున్నారు. కానీ అక్కడ ప్రధాన పోటీ ఇండియా కూటమిలోని ఆప్‌, కాంగ్రెస్‌ మధ్యే ఉంటుందనేది ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్న వాతావరణాన్ని బట్టి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బీజేపీ, అకాలీదళ్‌, బీఎస్పీలు అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితిలో ఉన్నాయి. అయితే బీఎస్పీ ఇతరుల విజయావకాశాలను దెబ్బతీయవచ్చు అంటున్నారు. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలు పరీక్ష కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని పట్టు సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల ఓట్లపై ఆప్‌ ఆధారపడుతున్నది. జాట్‌ రైతులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే దళితులు కొంత ఆ పార్టీకి అండగా నిలిచే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.