Urea Supply Telangana | తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ యూరియా వార్!
రాష్ట్రానికి యూరియా సరఫరా తగ్గుదల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొన్నది. రెండు పార్టీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. వీళ్ల ఆరోపణలు, ప్రతిసవాళ్లు ఎలా ఉన్నా.. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. దుకాణాల వద్ద బారులు నిలబడుతున్నారు. వర్షాలు కురిసినందున యూరియాకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అవసరమైన యూరియాను సరఫరా చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

Urea Supply Telangana | హైదరాబాద్, జూలై 28 (విధాత): రాష్ట్రానికి యూరియా సరఫరా (urea supply) తగ్గుదల విషయంలో కాంగ్రెస్, బీజేపీ (congress-bjp) మధ్య మాటల యుద్ధం నెలకొన్నది. రెండు పార్టీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా యూరియాను కేంద్రం సరఫరా చేయలేదని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ మాత్రం అవసరానికి మించే పంపామని చెబుతున్నది. వీళ్ల ఆరోపణలు, ప్రతిసవాళ్లు ఎలా ఉన్నా.. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. దుకాణాల వద్ద బారులు నిలబడుతున్నారు. వర్షాలు (rains) కురిసినందున యూరియాకు మరింత డిమాండ్ (demand increase) పెరిగే అవకాశం ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అవసరమైన యూరియాను సరఫరా చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేశారు?
తెలంగాణలో జూలై 16 నాటికి 61,10,170 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 61,63,098 ఎకరాల్లో పలు పంటలు సాగయ్యాయి. తెలంగాణలో సాధారణ ఖరీఫ్ (వానకాలం) విస్తీర్ణం 66,41,809 ఎకరాలు. సీజన్ ప్రారంభమైన తర్వాత వర్షపాతం సరిగా నమోదు కాలేదు. రుతుపవనాల ప్రారంభంలో చెదురుమదురు వర్షాలు కురిశాయి తప్ప ఆశించినంత మేరకు లేవు. దీంతో విత్తనాలు వేసిన రైతులు వర్షం కోసం ఆకాశం వైపు చూశారు. జూలై 17 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇంకా రెండు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నది. వర్షాలు కురవడంతో యూరియాకు ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. యూరియా సకాలంలో వాడకపోతే పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తెలంగాణకు ఎంత యూరియా సరఫరా చేశారు?
తెలంగాణ రాష్ట్రానికి 2024–25 ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. అయితే ఇప్పటివరకు కేటాయించిన యూరియా సరఫరా చేయలేదు. 45 శాతం యూరియా ఇంకా రాలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. దీంతో రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉంది. కానీ.. 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయి. దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉందనేది ప్రభుత్వ వాదన. ఏప్రిల్ లో 1.70 లక్షల టన్నుల యూరియాకు గాను 1.22 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయింది. ఇక మేలో 1.60 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలి. కానీ, సప్లయ్ 0.88 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయింది. జూన్ లో 5 లక్షల టన్నులు అవసరం ఉంటే.. 3.06 లక్షల టన్నులే వచ్చాయి. జూలైలో కేంద్రం 1.60 లక్షల టన్నుల యూరియా కేటాయించింది. అందులో 63వేల టన్నుల దేశీయ యూరియా, మిగిలినది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదాని నుంచి పంపుతామని తెలిపింది. అయితే ఇప్పటివరకు 29,000 టన్నులు మాత్రమే వచ్చిందని ప్రభుత్వం చెబుతున్నది. జూలై 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. రాష్ట్రానికి నెలలవారీగా యూరియా కేటాయింపు, సరఫరా మధ్య తేడాను వివరిస్తూ కేటాయింపు మేరకు సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
తుమ్మలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సవాల్
యూరియా కేటాయింపు, సరఫరాలో తేడా ఉన్న విషయాన్ని కేంద్రానికి ఈ నెల 2న తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. రాష్ట్ర అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ వాదనను బీజేపీ తోసిపుచ్చింది. రాష్ట్రానికి 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నులను పంపిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు చెప్పారు. దీనిపై చర్చకు తాను సిద్దమని మంత్రి తుమ్మలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో డిమాండ్ కంటే ఎక్కువ పంపినా ఎరువులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు చేయాలని రామచందర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. మరో వైపు రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయింపులో రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు బాధ్యత తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరో వైపు ఎరువుల బాధ్యత కేంద్రానిదేనని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువులు సరఫరా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వ్యవసాయం గురించి ఏం తెలుసునని రామచందర్ రావు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
సరఫరా ఆలస్యానికి కారణం ఏంటి?
జూలైలో 1.60 లక్షలు యూరియా సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే ఇందులో 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన యూరియా. ఈ యూరియా రావడానికి అవసరమైన నౌకలను కేంద్రం కేటాయించాలి. మరోవైపు తెలంగాణలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి తెలంగాణకు ఇచ్చే కోటా 30,800 టన్నులు. అయితే ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి 60 వేల టన్నుల యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఈ ఫ్యాక్టరీ నుంచి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎరువులు సరఫరా చేస్తారు. దిగుమతి చేసుకున్న యూరియా కోసం అవసరమైన నౌకలు కేటాయిస్తే యూరియా సమస్య తీరిపోయే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు రాష్ట్రానికి అవసరమైన యూరియా, ఎరువుల విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సకాలంలో ఎరువులు పంటలకు వాడకపోతే తెలంగాణలోని 53.51 లక్షల హెక్టార్ల సాగు భూమిలో దిగుబడి 10–15 శాతం తగ్గుతుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరించారు.