Eye on two ministers | ఇద్దరు మంత్రులపై హైకమాండ్ నిఘా! తదుపరి విస్తరణలో వారి శాఖలకు కత్తెర?

Eye on two ministers | పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి, అన్నీ కలిసొచ్చి అధికారంలోకి రావడంతో ఇద్దరు మంత్రులు చెలరేగిపోయి వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మంత్రులు కూడా తమ శాఖల కార్యదర్శులతో చేతులు కలిపి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని, రెండు కీలక శాఖలను నిర్వహిస్తున్న ఇద్దరు మంత్రులపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిఘా పెంచిందని గాంధీభవన్‌లోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని అంతర్గత విచారణలో సైతం స్పష్టం కావడంతో పార్టీ పెద్దలు దృష్టి పెట్టారని తెలుస్తున్నది. ఎప్పుడు విస్తరణ జరిగినా వీరి శాఖలను కత్తిరించి, అనామక శాఖలను కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా కొందరు మంత్రులు ఢిల్లీలో లాబీయింగ్ చేసి రెండు మూడు శాఖలను దక్కించుకున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. అలా శాఖలు దక్కించుకున్న మంత్రులు సొంత ప్రయోజనాలకు పెద్ద పీట వేయడమే కాకుండా, పార్టీ నాయకులను దగ్గరికి కూడా రానివ్వడం లేదని తెలుస్తున్నది. ప్రతీ అంశాన్ని వ్యాపారం మాదిరి చూస్తూ, పార్టీ లేదు పాడు లేదు అనే విధంగా మాకేమీ ఇస్తారనే విధంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. మంత్రివర్గంలోని ఈ ఇద్దరు మంత్రుల వైఖరితో విసిగిపోయిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని ముఖ్య నాయకులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే పని మొదలు పెట్టారని గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు మీడియాలో వస్తున్న వార్తలను కూడా ఆంగ్లంలోకి అనువదింప చేయించి మరీ పంపిస్తున్నారని సమాచారం. కొందరైతే ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ముఖ్య నాయకులను కలిసి వివరాలు ఇచ్చి వస్తున్నారని అంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అంతులేని అవినీతికి పాల్పడుతున్న మంత్రులపై అధిష్ఠానం ప్రాథమిక సమాచారం సేకరించగా.. విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఇద్దరి అవినీతిని కట్టడి చేయకపోతే మరింతగా ప్రజల్లో బదనాం అవుతామనే ఉద్ధేశంతో మరింత లోతుగా అంతర్గత విచారణ చేయిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వివిధ వర్గాల నుంచి అవసరమైన సమాచారం సేకరిస్తున్నట్లు ఒక కీలక నాయకుడు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇద్దరు మంత్రులపై పెద్ద ఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఒక్కొక్క మంత్రి రెండు మూడు శాఖలను పర్యవేక్షిస్తున్నారు. వారి వారి శాఖల్లో జరుగుతున్న పనులు, బదిలీలు, అనుమతులు, మంజూరు ద్వారా వచ్చే ఆదాయంపై కూడా ఆరా తీసే పనిలో హైకమాండ్ దూతలు ఉన్నారని తెలుస్తున్నది. ఏ పనికి ఎంత ముట్టచెబుతున్నారు? బదిలీల్లో ఎంత తీసుకుంటున్నారు? మధ్యవర్తులు ఎవరు? కుటుంబ సభ్యులతో లావాదేవీలు నడిపిస్తున్నారా? అనే అంశాలపై పార్టీ వేగులు నిఘా పెట్టినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సచివాలయంతోపాటు వారు నివాసం ఉండే ప్రాంతంలో తచ్చాడుతూ, వచ్చిపోయే వాహనాలు, వ్యక్తులపై వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. ఇద్దరు మంత్రులు ఎవరెవరెవరిని కలుస్తున్నారు? అందులో సాధారణ ప్రజలు ఎవరు? పైరవీకారులు ఎవరు? నియోజకవర్గం నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారా? అనేది కూడా తెలుసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని ఢిల్లీలోని పెద్దలకు ఆధారాలతో సహా చేరవేస్తున్నారని సదరు ముఖ్య నాయకుడు తెలిపారు.
ఒక మంత్రి పూర్తిగా ఎవరినీ లెక్క చేయకుండా పార్టీని తానే అధికారంలోకి తీసుకువచ్చాననే విధంగా సెటిల్‌మెంట్లు చేస్తూ వందల కోట్లు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తను చెప్పిందే వేదం అన్నట్టు ఏ ఎమ్మెల్యేను కూడా ఖాతరు చేయాల్సిన పనిలేదనే విధంగా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయన సచివాలయంతో పాటు జూబ్లీహిల్స్ ప్రాంతంలో బ్యాక్ ఎండ్ ఆఫీసు నడిపిస్తున్నారని చర్చ సాగుతున్నది. ‘ఆయనకు వచ్చే వినతులను బ్యాక్ ఎండ్ ఆఫీసులో ఉన్నవారికి అప్పగిస్తారు. వారు సరేనని చెప్పిన వెంటనే పని మొదలు పెట్టి రోజుల వ్యవధిలో పూర్తి చేస్తారు. ఇదే పని కోసం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ వస్తే నెలల తరబడి తిప్పుతుంటారు’ అని ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు. ఎంత తిరిగినా ఇలాంటి వారి పనులు కాబోవని ఆయన చెప్పారు.
మరో మంత్రి.. గ్రూపు రాజకీయాలు నడిపిస్తూ.. ఎప్పుడైనా అదృష్టం తన తలుపుతడుతుందన్న గంపెడాశతో ఉన్నారని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉన్నత పదవి దక్కితే అదే చాలనే విధంగా ఆయన తన పావులు కదుపుతూ, ఢిల్లీ పెద్దల దీవెనలపై భరోసాతో ఉంటున్నారని సమాచారం. ప్రతి పనికీ రేటు నిర్ణయించిన ఈయనపై పెద్ద ఎత్తున ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో కూడా ఈయన ఢిల్లీ పెద్దల ద్వారా చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి లేదు.. ఇవేం కమీషన్ రేట్లు?’ అంటూ బాధితులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. మనవాడే అని కొద్ది నెలల వరకు ఫిర్యాదులను బుట్టదాఖలు చేసిన అధిష్ఠానం పెద్దలు చివరకు రంగంలోకి దిగక తప్పలేదని అంటున్నారు.
ఈయన శాఖల ద్వారా ఏమేమి పనులు జరుగుతున్నాయి? ఏ పనికి ఎంత రేటు నిర్ణయించారు? మధ్యవర్తిత్వం వహిస్తున్న వారు ఎవరు? పేషీలో పనిచేస్తున్నవారు ఎంత మంది? కుటుంబం నుంచి ఎవరు ఆదేశాలు ఇస్తున్నారు? అనే అంశాలపై ఇప్పటికే ఢిల్లీ వేగులు ఒక అంచనాకు వచ్చారని సమాచారం. కుటుంబం నుంచి ఆదేశం వస్తే తప్ప ఫైలు ముందుకు కదలడం లేదని, పని పూర్తి కావడం లేదన్న ఆరోపణలు పెరగడంతో ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేరుతో పనులు చక్కబెడుతున్నారని తెలుస్తున్నది. ఎవరైనా పనికోసం మధ్యవర్తి లేదా పేషీ సిబ్బంది ద్వారా వస్తే వివరాలు తీసుకుంటున్నారని, ఈ విషయాన్ని కుటుంబంలోని వారికి తెలియచేసి, ఒకే అని చెప్పిన తరువాత, ఆ విషయాన్ని సంబంధిత నియోజకర్గం ఎమ్మెల్యేకు తెలియచేస్తున్నారని సమాచారం. తమకు వచ్చే కమిషన్‌లో వారికి కూడా కొంత ముట్టచెప్పి, మిగతా మొత్తాన్ని వీళ్లే కొట్టేస్తున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ జరిగే మోసం ఏమంటే.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సంబంధీకుల పని అని శాఖ కార్యదర్శికి సిఫారసు చేసి పని కానిచ్చేస్తున్నారు. ఈయన శాఖలో ఇప్పటి వరకు జరిగిన పనులు, మంజూరు అయిన నిధులు, ఎంత కమిషన్ వసూలు చేశారనే దానిపై ఢిల్లీ వేగులు స్పష్టతకు వచ్చారని, ఎంత కూడాబెట్టారనే వివరాలతో కూడిన నివేదికను కూడా పార్టీ పెద్దలకు పంపించారని తెలిసింది. ఈ నివేదికను అధ్యయనం చేసిన తరువాత ఇంత పెద్ద ఎత్తున వసూళ్లు జరిగాయా అంటూ పార్టీ పెద్దలు విస్మయం వ్యక్తం చేశారని తెలిసింది. ఇప్పటికే సదరు మంత్రికి హెచ్చరికలు కూడా వచ్చాయని, అయినా తీరు మార్చుకోకుండా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. చెలరేగుతున్న ఇద్దరు మంత్రులకు స్థానిక ఎన్నికల తరువాత జరిగే విస్తరణలో అప్రాధాన్య శాఖలు అప్పగించవచ్చనే వాదన సచివాలయంలో కూడా విన్పిస్తున్నది.
ఇవి కూడా చదవండి..
Chandrababu Naidu | సీబీఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్ ఉండరు.. : ఏపీ సీఎం చంద్రబాబు
shocking incident | ‘శాడ్’ రీల్ చేస్తూ.. 13వ అంతస్తు నుంచి పడి యువతి మృతి