Congress Party Faction Wars | కాంగ్రెస్ పార్టీలో అధికారంలోనూ తప్పని ఆధిపత్యపోరు!
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు క్రమంగా భగ్గుమంటున్నాయి. నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం నాయకుల మధ్య వార్ కొనసాగుతోంది. అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలు జరిగితే వేదికపైనే గ్రూపు నాయకులు తమ పట్టు నిలుపుకొనేందుకు పోటీ పడుతున్నారు. అనుచరులు తమ నాయకులకు జేజేలు పలుకుతూ ఎదుటిపక్షాన్ని కించపరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విభేదాలు భగ్గుమంటున్న సెగ్మెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
Congress Party Faction Wars | విధాత, ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు క్రమంగా భగ్గుమంటున్నాయి. నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం నాయకుల మధ్య వార్ కొనసాగుతోంది. అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలు జరిగితే వేదికపైనే గ్రూపు నాయకులు తమ పట్టు నిలుపుకొనేందుకు పోటీ పడుతున్నారు. అనుచరులు తమ నాయకులకు జేజేలు పలుకుతూ ఎదుటిపక్షాన్ని కించపరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విభేదాలు భగ్గుమంటున్న సెగ్మెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పార్టీ ముఖ్యనాయకులు, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం ఈ సమస్య తప్పడంలేదు. ప్రధాన నాయకులనే వారు సైతం తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఈ గ్రూపులను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో నాయకులు పరస్పర విమర్శలూ.. దూషణలకు పాల్పడుతున్నారని అంటున్నారు. కొద్దికాలం గుంభనంగా ఉన్న ఈ గ్రూపులు మళ్ళీ పురివిప్పి బహిరంగ బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రెండు వర్గాల మధ్య కుస్తీ సాగుతోంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో అభ్యర్థుల ఎంపిక, వారిని గెలిపించుకోవడం వంటి అనేక అంశాలపై ఈ గ్రూపు రాజకీయాలు ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమయంలో ఇటువంటి వ్యవహారాలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తోపాటు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికీ తలనొప్పులు తీసుకొస్తుందని అంటున్నారు. కాంగ్రెస్‌లో ఈ కల్చర్ కామనే అనే పాత ముచ్చటనే ముందుకు తెచ్చి, వ్యవహారాన్ని లైట్‌గా తీసుకుంటే అసలుకే ఎసరొస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
రోడ్డెక్కుతున్న గ్రూపు వార్
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌లోని గ్రూపు వార్ రోడ్డెక్కుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మిగిలిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్నది. సురేఖ, మురళి బహిరంగంగానే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్యలపై తీవ్రంగా విమర్శలు చేయడంతో నెలకొన్న విభేదాలకు ఇంకా ఫుల్‌స్టాప్ పడలేదు. మంత్రి దంపతులు తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఎమ్మెల్యేలంతా అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చినా ఏ పరిష్కారం చూపకుండా కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా జిల్లాలో మంత్రి సురేఖకు సంబంధం లేకుండా ఆమె వ్యతిరేక ప్రజాప్రతినిధులు ఒక గ్రూపుగా సీఎంను కలుస్తున్నారు. స్పోర్ట్స్ స్కూల్ మంజూరులో మంత్రి కనీస పాత్ర కనిపించడంలేదు. ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిని కలిసిన వారిలో సైతం ఈ ప్రజాప్రతినిధులు తప్ప మంత్రి జాడలేదు. ఇదిలా ఉండగా డోర్నకల్, మహబూబాద్‌లో ప్రస్తుత ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్ తీరుపైన ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమకు కనీస గుర్తింపులేదని వాపోతున్నారు. మురళీనాయక్ తమను పట్టించుకోవడంలేదని పాత కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలకుర్తిలో పాత, కొత్త లీడర్ల మధ్య నువ్యానేనా అనే రీతిలో పోరు సాగుతోంది. ఇక్కడ పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా తిరుపతి రెడ్డి గ్రూపు మండిపడుతోంది. గ్రామస్థాయి నుంచి రెండు గ్రూపులుగా చీలిపోయి పోటీపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెడుతామంటూ బహిరంగంగానే సవాల్ చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య వీధిపోరు సాగుతోంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం వర్గం, ఇందిర వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తమను పట్టించుకోవడంలేదని పాత కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ, బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి మధ్య గ్రూపు ఆధిపత్యం సాగుతున్నది. పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా వర్గాల మధ్య దూషణలు, విమర్శలు ఉన్నాయి. జనగామలో డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పాత కాంగ్రెస్ నాయకులు ఒకరు అంటే ఒకరికి గిట్టదన్న పరిస్థితి ఉందని చెబుతున్నారు. వరంగల్ పశ్చిమంలో నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి వర్గాల మధ్య తాత్కాలిక రాజీ ఉన్నా గ్రూపులు మాత్రం కొనసాగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కరీంనగర్, నిజామాబాద్‌నూ వీడని కలహాలు
కరీంనగర్ జిల్లాలో పొన్నం ప్రభాకర్, స్థానిక కాంగ్రెస్ నాయకుడు జువ్యాడి మధ్య విభేదాలు సాగుతున్నాయి. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరస్పరం ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా పార్టీలో విభేదాల కారణంగానే ఆ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్కను మార్చారనే చర్చలు వినిపిస్తున్నాయి. తాజాగా బాన్సువాడలో మాజీ స్పీకర్ పోచరం, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాలు బహిరంగంగా బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌లో కూడా మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గాల మధ్య ఆధిపత్యపోరు సాగుతున్నదనే చర్చలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన బహిరంగ సభలో మల్లు రవి మంత్రి జూపెల్లిపైన అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల నుంచి మెదక్ జిల్లా పటాన్ చెరువులో ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి తొలినుంచి కాంగ్రెస్‌ను నమ్ముకున్న కాటా శ్రీనివాస్‌కు వర్గానికి మధ్య పొంతన కుదరడం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ పర్యటన సందర్భంగా అక్కడి గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి శ్రీధర్ బాబుకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు మధ్య కోల్డ్ వార్ కొనసాగింది. సరస్వతి పుష్కరాల సమయంలో ఎంపీగా తనకు అవమానం జరిగిందని వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ..
ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం పట్టణంలో పొంగులేటి, తుమ్మలకు వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ నాయకులు గుర్తింపు కోసం తహతహలాడుతున్నారు. ఇక్కడ ముగ్గురి మంత్రుల మధ్య ఆధిపత్యపోరు చాపకింద నీరులా విస్తరిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నల్లగొండలో మంత్రి ఉత్తమ్, కోమటి రెడ్డి మధ్య సఖ్యత అంతంత మాత్రంగా ఉందని తాజాగా సాగర్ నీటి విడుదల సందర్భంగా నెలకొన్న విభేదాలు ఎత్తిచూపుతున్నాయి. ఇక సీఎం టార్గెట్‌గా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలు సరేసరి.
స్థానిక ఎన్నికల పై తీవ్ర ప్రభావం?
హస్తం పార్టీలో ఆధిపత్యపోరు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇది అంతిమంగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అంటున్నాయి. పాతకాలం నాటి రాజకీయాలు ప్రస్తుతం లేదని, ఏ చిన్న అవకాశం వచ్చిన ఎదుటి పార్టీ ఉపయోగించుకునే ముప్పు ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులను కట్టడి చేసి ఒక్కతాటిపైకి తీసుకురాకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం కనబరిచే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
జనహిత పాదయాత్ర ఫలించేనా?
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ చేపట్టిన జనహిత యాత్ర పార్టీలో నెలకొన్న గ్రూపులకు చెక్ పెట్టడమే కాకుండా సామాన్య కాంగ్రెస్ కార్యకర్త మనోగతాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా గత 20 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజానాడి తెలుసుకునే ప్రయత్నం అంతర్గతంగా చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో పాగా వేసేందుకు సర్వశక్తులొడ్డుతున్న బీజేపీని కట్టడి చేయాలంటే కాంగ్రెస్‌లో గ్రూప్ వార్‌కు నీళ్లొదిలి ఐక్యంగా పనిచేయాలని కాంగ్రెస్‌లోని సీనియర్లు సూచిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఐక్యత కాంగ్రెస్‌ను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram