Bhu Bharathi | భూ భారతి చట్టం అమలులో జాప్యం.. ప్రభుత్వంలో అస‌లేం జరుగుతోంది?

భూ భారతి చట్టాన్ని అమలు చేయాలంటే రూల్స్‌ రావాలి. వాటికి అనుగుణంగా సాఫ్ట్‌ వేర్‌లో తగిన మార్పులు చేయాలి. కానీ ఆదిశగా ప్రయత్నాలు జరుగడం లేదన్న సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఉన్న వెబ్‌ సైట్‌నే వీరు సక్రమంగా నిర్వహించడం లేదు. ఫలితంగా స్లాట్‌ బుకింగ్‌కు గంటల తరబడి వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న‌ద‌ని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Bhu Bharathi | భూ భారతి చట్టం అమలులో జాప్యం.. ప్రభుత్వంలో అస‌లేం జరుగుతోంది?
  • గవర్నర్‌ సంతకం అయి రెండు వారాలు
  • టెక్నికల్‌గా అప్‌డేట్‌ కాని వైనం
  • రూల్స్‌ రూపక్పలన ఏది?
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఎప్పుడో!
  • నోటిఫై తేదీపై లేని క్లారిటీ
  • చట్టం వచ్చి రోజులు గడుస్తున్నా
  • ఇంకా అమలులోనే ధరణివైబ్‌ సైట్‌
  • మొద్దు నిద్రలోనే సర్కార్

(తిప్పన కోటిరెడ్డి)
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పినట్లుగానే ధరణిని బంగాళఖాతంలో వేశారు కానీ… భూ భారతిని మాత్రం సకాలంలో అమలులోకి తీసుకురాలేక పోయారు. డిసెంబర్‌ 18వ తేదీన అసెంబ్లీలో, 20వ తేదీన మండలిలో ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాన్ని కారణం ఏమిటో కానీ ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీన గవర్నర్‌కు పంపింది. అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదించిన చట్టాన్ని పరిశీలించిన గవర్నర్‌ 2025 జనవరి 9వ తేదీన ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ తరువాత గెజిట్‌ విడుదలైంది. ఇది జ‌రిగి రెండు వారాలు కావస్తున్నా రూల్స్‌ను సర్కారు ఇంత వరకు విడుదల చేయలేక పోయింది. అసలు నోటిఫై తేదీని ఇప్పట్లో ప్రకటిస్తారా? అన్న సందేహాలు కూడా వెలువడుతున్నాయి.

సిద్దం కానీ సర్వర్‌

భూ భారతి పోర్టల్‌ అమలుకు సర్వర్‌ సిద్దం కాలేదని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం భూమి రికార్డులు, క్రయ విక్రయాలన్నీ ధరణి పోర్టల్‌లోనే నడుస్తున్నాయి. దీంతో భూ భారతి చట్టంతో వచ్చిన మార్పు ఏమిటన్నది రైతులకు తెలియని పరిస్థితి. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ధరణి అక్రమాలపై పోరాటం చేసింది. ధరణిలో జరిగిన అక్రమాలే ఆయుధంగా చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ రైతు డిక్లరేషన్‌ ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. నమ్మిన ప్రజలు గెలిపించారు. కానీ భూ భారతి చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఏడాది దాటిన తరువాతే సాధ్యమైంది. చట్టం అయితే తీసుకొచ్చారు కానీ నేటికి ధరణి పోర్టల్‌నే అమలులో ఉంచారు.

చ‌ట్టం తేవ‌డానికి ముందే నాడు సిద్ధ‌మైన ధ‌ర‌ణి

ధరణి చట్టం తీసుకొచ్చే నాటికి గత బీఆరెస్‌ ప్రభుత్వ ధరణి పోర్టల్‌ను, సర్వర్‌ను సిద్దం చేసుకున్నది. ఆ తరువాతనే చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ధరణి చట్టం రావడానికి కొద్ది రోజుల ముందు రికార్డులన్నింటినీ ఫ్రీజ్‌ చేసింది. అయితే ధరణికి మందు కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఐసీ చేతిలో వెబ్‌సైట్‌ నిర్వహణ ఉండేది. రికార్డులు పక్కాగా ఉండేవి. కానీ గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణిని తీసుకు వచ్చి వెబ్‌ సైట్‌ నిర్వహణను ఎన్‌ఐసీ నుంచి తీసి వేసి ప్రైవేట్‌ సంస్థ చేతికి అప్ప‌గించింది. అయితే ధరణి చట్టం అమలుకు మూడున్నరేళ్లుగా రూల్స్‌ తీసుకురాకుండా అమలు చేసింది. దీంతో ధరణిలో అనేక సమస్యలు వచ్చాయి. సమస్యల పరిష్కారానికి వేదిక లేకుండా పోయింది. దీంతో ధరణిలో భూమి రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారం అంతా గందర గోళంగా మారింది. ధరణి సమస్యలపైనే కాంగ్రెస్‌ ఫోకస్‌ చేసింది. ధరణి చట్టంతో భూములన్నీ కాజేశారని ఆరోపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఏడాది తరువాత భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చింది. బిల్లును చట్ట రూపంలో తీసుకు రావడానికి ముందుగా ప్రజల ముందుకు తీసుకు వెళ్లారు. దీనిని అభినందించాల్సిందే. అయితే కాంగ్రెస్‌ పార్టీ చట్టం తీసుకు వచ్చిన వెంటనే తీసుకు రావాల్సిన రూల్స్‌కు ఇప్పటి వరకు అతిగతీ లేదు. కనీసం దీనిపై కసరత్తు జరుగుతుందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవంగా రూల్స్‌ లేకుండా చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కాదు.

భూ భారతి చట్టాన్ని అమలు చేయాలంటే రూల్స్‌ రావాలి. వాటికి అనుగుణంగా సాఫ్ట్‌ వేర్‌లో తగిన మార్పులు చేయాలి. కానీ ఆదిశగా ప్రయత్నాలు జరుగడం లేదన్న సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఉన్న వెబ్‌ సైట్‌నే వీరు సక్రమంగా నిర్వహించడం లేదు. ఫలితంగా స్లాట్‌ బుకింగ్‌కు గంటల తరబడి వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న‌ద‌ని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారినికి ద‌రఖాస్తు చేసుకోవడానికి వీలు పడడం లేదని అంటున్నారు. దీనిపై రైతులు రెవెన్యూ సిబ్బందిని ఏదైనా దరఖాస్తు పరిష్కరించమని అడిగితే కొత్త చట్టం వచ్చాక చేద్దామని సమాధానం చెప్పుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. కొత్త చట్టం అమలులోకి తీసుకు వచ్చే వరకు అన్ని యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు కానీ అమలు కావడం లేదని, రైతులు ఇబ్బంది పడుతున్నాని రైతుల సమస్యలపై పని చేస్తున్న వారు చెపుతున్నారు. దీంతో అసెంబ్లీలో చట్టం చేస్తున్న సందర్భంగానే కొత్త చట్టం అమలులోకి వచ్చే వరకు అన్ని స్టాప్‌ చేయాలని సీసీఎల్‌ ఏ సర్క్యులర్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. వెంటనే దీనిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఖండించారు. అలాంటి సర్క్యులర్‌ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

కానీ రెవెన్యూ అధికారులు ధరఖాస్తులు పరిష్కరించకుండా కొత్త చట్టం వచ్చిన తరువాతనే చేస్తామని చెప్పుతున్న దానిని బట్టి నిజంగానే రెవెన్యూ శాఖ సర్క్యులర్‌ ఇచ్చిందా? అన్న సందేహాలను రైతు సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏవైనా ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ తీసుకు రావడంలో ఆలస్యం అవుతున్నది. దీనికి శాఖ మంత్రి కారణమా? అధికారులది కారణమా? అంటే శాఖకు బాస్‌ అయిన మంత్రినే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వాస్తవంగా ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్‌ అమలులోకి రావాలంటే మూడు రకాల పనులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని న్యాయనిపుణులు చెపుతున్నారు. ఇందులో మొదటగా వెను వెంటనే భూ భారతి నియమాలు, రూల్స్‌ను రూపొందించి అమలులోకి తీసుకు రావాలి. రూల్స్‌ అమలుకు తగిన విధంగా సాఫ్ట్‌ వేర్‌లో మార్పులు చేయాలి. భూ భారతి చట్టాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తారో నోటిఫై చేయాలి. ఈ మేరకు అన్ని రూపొందించి చట్టాన్ని అమలులోకి తీసుకు రావడానికి సీసీఎల్‌ ఏ కార్యాలయంలో వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేసుకొని ఫుట్‌ వార్‌ బేస్‌లో అమలు చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెపుతున్నారు.

ఇలాంటి వార్‌ రూమ్‌ లో సాఫ్ట్‌ వేర్‌ నిపుణులు, రెవెన్యూ అధికారులు, లీగల్‌ ఎక్స్‌ ఫర్ట్స్‌తో ఏర్పాటు చేసి పని చేస్తే త్వరగా చట్టం అమలులోకి రావడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే వార్ రూమ్‌లో తీసుకున్న నిర్ణయాలు అప్పటికప్పుడే అమలు చేసే విధంగా తగిని సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంటున్నారు. ఒక వైపు రూల్స్‌ను అమలులోకి తీసుకు రావడంతో పాటు కొత్త చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్ప‌ష్టం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, అప్పుడే రైతులకు ఇబ్బందులు కలుగకుండా భూమాత చట్టంలో సేవలు అందించడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఈ దిశగా కాంగ్రెస్‌ సర్కారు ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదన్న చర్చ రెవెన్యూ వర్గాలలో జరుగుతోంది.